Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 15 Feb 2024 21:01 IST

1. ఇసుక దోపిడీని వెలుగులోకి తెస్తే దాడి చేస్తారా?: చంద్రబాబు

విలేకరి పరమేశ్వరరావుపై ఇసుక దొంగల దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. అడ్డగోలు ఇసుక దోపిడీని వెలుగులోకి తెస్తే ప్రాణాలు తీస్తారా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయిన నాటి నుంచి వైకాపా అక్రమాలను ఎండగడుతున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మద్యం, ఇసుక అక్రమార్జనతోనే ఎన్నికలకు వైకాపా: పవన్‌ కల్యాణ్‌

మద్యం, ఇసుక, గనుల అక్రమార్జన సొమ్ముతో వైకాపా ఎన్నికలకు సిద్ధమైందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, నదీ తీరంలో భారీ యంత్రాలతో చేస్తున్న దోపిడీపై నేతలకు పవన్‌ వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. త్వరలో తెదేపాలోకి లావు శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట ఎంపీ, వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు త్వరలో తెదేపాలో చేరనున్నారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీఎం సీటులో మంత్రి అమర్‌నాథ్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌

పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన సమీక్షను బుధవారం సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో నిర్వహించారు. ఇన్నాళ్లూ మంత్రిగా తన సీటులో కూర్చొని సమీక్షలు నిర్వహించిన అమర్‌నాథ్‌ అందుకు భిన్నంగా సీఎం సీటులో కూర్చొన్నారు. దీంతో ‘సీఎం సీటుపై మంత్రి కన్ను పడింది’ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇండోసోల్‌ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ జరుగుతోంది: ఎంపీ బాలశౌరి

వైకాపా ప్రభుత్వం షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌కు ఆస్తులు కట్టబెడుతోందని జనసేన నేత, మచిలీపట్నం ఎంపీ వి.బాలశౌరి ఆరోపించారు. అనుబంధ సంస్థ ఇండోసోల్‌ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ జరుగుతోందన్నారు. ఈ కంపెనీకి విద్యుత్‌ రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.23 వేల కోట్ల భారం పడనుందని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారాస బతకాలంటే హరీశ్‌రావు అధ్యక్షుడు కావాలి: రాజగోపాల్‌రెడ్డి

అవినీతి మచ్చలేని భారాస నేతలనే కాంగ్రెస్‌లోకి తీసుకుంటామని ఆ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. డబ్బున్న నేతలు వస్తే ఎలా వాడుకోవాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రీజనల్‌ రింగ్ రోడ్డుకు రూ.26 వేల కోట్లు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణలో రైల్వేస్టేషన్‌లు తక్కువగా ఉన్నాయని.. కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌తో కలిసి ఆయన భూమిపూజ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తెలంగాణ మాజీ డీజీపీని వదలని సైబర్‌ నేరగాళ్లు

రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌, తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్‌ (Anjani Kumar)నూ సైబర్‌ నేరగాళ్లు వదల్లేదు. ‘అంజనీకుమార్‌ 1100’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా తెరిచారు. దీనిపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఆయన పీఏ హలీమ్‌ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘పారదర్శకత కోసమే..’ ఎన్నికల బాండ్లను సమర్థించుకున్న భాజపా!

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని (Electoral Bonds Scheme) భాజపా (BJP) సమర్థించుకుంది. ఎన్నికల నిధుల్లో పారదర్శకతను తీసుకురావడమే దాని లక్ష్యమని పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ (Ravi Shankar Prasad) పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘ప్రేమలేఖ’తో ట్రంప్ విరాళాల సేకరణ..!

అమెరికా (USA) అధికార పీఠాన్ని మరోసారి దక్కించుకోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు. తాజాగా తన భార్య మెలానియాకు రాసిన ప్రేమలేఖతో ఆయన మద్దతుదారులను విరాళాలు అడిగారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు