Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 Mar 2024 20:59 IST

1. ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్‌ జగన్‌?: చంద్రబాబు

ప్రపంచంలోని అన్ని కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యత తనదేనని తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా వింజమూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘నేను సీఎంగా ఉన్నప్పుడు 9 సార్లు డీఎస్సీ వేశా. ఈ ఐదేళ్లలో నువ్వేం చేశావు జగన్‌? ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించావా?’అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస చేసుకోలేదు: కె.కేశవరావు

తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. దిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అతి త్వరలో తన కుమార్తె విజయలక్ష్మితో కలిసి సొంతగూటికి చేరుతున్నట్లు చెప్పారు. కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస సరిచేసుకోలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్‌ ఒకటి నుంచి వడగాల్పులు

తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. ఏప్రిల్‌ ఒకటి, రెండు తేదీల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీకి ఐటీ విభాగం మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ.1,823 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్‌కు ఐటీ నోటీసు రావడంపై  పార్టీ మండిపడింది. ‘‘ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాము’’అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏప్రిల్‌ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?

బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పాలసీలను డిజిటలైజేషన్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అంటే ఇకపై అన్ని బీమా సంస్థలూ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే (E- insurance) పాలసీలను అందించాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్యం, సాధారణ బీమా సహా అన్ని బీమా పాలసీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బెంగళూరు కేఫ్‌ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు

బెంగళూరు (Bengaluru) బ్రూక్‌ఫీల్డ్‌లోని ‘రామేశ్వరం కేఫ్‌’లో బాంబు పేలుడు (Bengaluru cafe Blast) ఘటనపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిందితుల సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ప్రకటించింది. ఇద్దరు నిందితులు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు భావిస్తున్న ఎన్‌ఐఏ.. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి

పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే కొందరికి నామినేటెడ్‌ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన పీఈసీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో తెలంగాణ మోడల్‌ పాలన బాగుందని జాతీయ నాయకత్వం కితాబు ఇవ్వడం గర్వకారణమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయంలో కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతోన్న ఎన్నికల సంఘం (Election Commission).. అనేక మార్గాల్లో పౌరులు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులోభాగంగా ‘సీ-విజిల్‌’ (C-Vigil) మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా 79వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు: ఏడీఆర్‌

లోక్‌సభలోని (Loksabha) 514 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్‌ పలు వివరాలతో నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎంపీల్లో 5 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. 42 మంది మృతి

హమాస్‌తో యుద్ధం కొనసాగుతోన్న వేళ సిరియా (Syria)పై ఇజ్రాయెల్‌ (Israel) విరుచుకుపడింది. అక్కడి అతిపెద్ద నగరమైన అలెప్పోపై చేపట్టిన వైమానిక దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. వీరిలో 36 మంది సిరియా సైనికులేనని ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని