Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 May 2024 21:01 IST

1. ఏపీలో ‘ఈ-ఆఫీస్‌’ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ

ఏపీలో ‘ఈ-ఆఫీస్‌’ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్‌’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్‌ను అప్‌గ్రేడ్‌ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు.. గవర్నర్‌, ఏపీ సీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ చర్యలు తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట

భారాస ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్‌పై విచారణను జులైకి వాయిదా వేసింది. భారాస ఎమ్మెల్సీగా 2022లో దండె విఠల్‌ ఎన్నికయ్యారు. అయితే, తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని కాంగ్రెస్‌ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనమే.. 3 కి.మీ మేర క్యూలైను

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల దృష్ట్యా ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజన సందోహం కనిపిస్తోంది. అనూహ్యంగా పెరిగిన రద్దీతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండిపోయి.. ఔటర్‌ రింగురోడ్డులో 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గ్రూప్‌-4 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక అప్‌డేట్‌

గ్రూప్‌-4 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్‌ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసిన కమిషన్‌.. త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా జనరల్‌ అభ్యర్థులను 1:3, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో జాబితాలను రూపొందించనున్నట్లు పేర్కొంది. ఈ జాబితాలను ఏక్షణమైనా వెబ్‌సైట్‌లో పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మద్యం కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ ఛార్జ్‌షీట్‌.. నిందితుల జాబితాలో ఆప్‌ పేరు

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం మరో అనుబంధ ఛార్జ్‌షీట్‌ (ED Chargesheet) దాఖలు చేసింది. ఇందులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ఆద్మీ పార్టీని నిందితులుగా పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్‌

జట్టు స్టార్‌ ఆటగాళ్లతో నిండిపోయినంత మాత్రాన విజయాలు సాధిస్తుందని చెప్పలేమని మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) అభిప్రాయపడ్డాడు. 2025 సీజన్‌కు ముందు కొందరిని వదులుకోవాలని ముంబయి ఇండియన్స్‌కు సూచించాడు. ఓ ఆంగ్ల క్రీడా పత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నిర్మాణంలో మేటి.. తాజ్‌ మహల్‌కు పోటీ..!

ఆగ్రా అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌ మహలే. ఇప్పుడు అదే నగరంలో ధవళవర్ణంలో మెరుస్తోన్న మరో నిర్మాణం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే.. రాధాస్వామి ఆధ్యాత్మిక సంప్రదాయానికి పునాది వేసిన ‘శివ్‌ దయాళ్‌ సింగ్‌’ పాలరాతి సమాధి. తాజ్‌ మహల్‌కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్‌ కాలనీలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నవీన్‌ బాబూ.. రత్నభాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉంది?: అమిత్‌ షా

ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం నవీన్‌ పట్నాయక్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. ‘నవీన్‌ పట్నాయక్‌ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, వారి నమ్మకాలు, విశ్వాసాలతో ఆడుకుంటున్నారు. నవీన్‌ బాబూ.. రత్న భాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉందో చెప్పండి?’’అని అన్నారు.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

9. మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర పోస్ట్‌

‘మరికొన్ని సంవత్సరాల్లో మనం అంగారకుడిపై అడుగుపెడతాం’ అని ఓ ఎక్స్‌ యూజర్‌ చేసిన పోస్ట్‌కు ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ‘‘ఐదేళ్లలోపే ఆ గ్రహంపైకి మానవరహిత యాత్ర విజయవంతమవుతుంది. 10 ఏళ్లలోపే అక్కడికి మనుషులను కూడా పంపించగలుగుతాం. 20 ఏళ్లలో ఓ నగరాన్ని నిర్మిస్తాం. కచ్చితంగా వచ్చే 30 ఏళ్లకు అక్కడ సురక్షితంగా నాగరికత విరాజిల్లుతుంది’’ అని ఆయన రాసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వాళ్లను భారత్‌ గౌరవిస్తే.. మనం ‘దొంగలు’ అంటున్నాం- పాకిస్థాన్‌ మంత్రి

భారత్‌పై పాకిస్థాన్‌ నేతల నుంచి ప్రశంసలు రావడం ఇటీవల క్రమంగా పెరుగుతోంది. తాజాగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్‌నఖ్వీ కూడా భారత్‌ తీరును కొనియాడారు. తమ దేశంలో వ్యాపారవేత్తలను దొంగలుగా చిత్రీకరిస్తుంటే.. భారత్‌ మాత్రం అక్కడి వ్యాపారులకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు