Chandrayaan 3: మన టెక్నాలజీని అమెరికా అడిగింది: ఇస్రో చీఫ్‌

ISRO: ‘చంద్రయాన్-3’ అభివృద్ధి చూసి అమెరికా అంతరిక్ష నిపుణులు భారత సాంకేతికతను అడిగారని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు.

Published : 15 Oct 2023 17:51 IST

చెన్నై: చంద్రయాన్‌-3 (Chandrayaan- 3) విజయంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతకుముందే ‘చంద్రయాన్-3’ అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో (ISRO) ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. కాలం మారిందని.. భారత్‌ సైతం అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదన్నారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచారని చెప్పారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా డా.ఏపీజే అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్‌ (S Somanath) ప్రసంగించారు.

‘‘చంద్రయాన్-3’ వ్యౌమనౌకను రూపొందించిన అనంతరం నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (JPL) నిపుణులను ఆహ్వానించాం. మేం వారికి చంద్రయాన్-3 గురించి వివరించాం. దీన్ని ఎలా రూపొందించాం? ఇంజినీర్లు ఏ విధంగా కష్టపడ్డారు? చంద్రుడిపై ఏ విధంగా ల్యాండ్‌ చేయనున్నాం? తదితర విషయాలు చెప్పాం. అంతా బాగానే జరుగుతుందంటూ వారు సమాధానమిచ్చారు. మన శాస్త్రీయ పరికరాలను పరిశీలించి.. అవి చాలా తక్కువ ఖర్చుతో, నిర్మాణానికి సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఉన్నాయన్నారు. వాటిని ఎలా రూపొందించారు? ఈ సాంకేతికతను అమెరికాతో ఎందుకు పంచుకోకూడదు? అని అడిగారు’ అని సోమనాథ్‌ గుర్తుచేసుకున్నారు.

ఆ కొలిమి తోడుంటే.. విక్రమ్‌ నిద్ర లేచేదే!

‘అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ను మరింత శక్తిమంతం చేసే దిశగా.. రాకెట్లు, ఉపగ్రహాల తయారీకి ముందుకు రావాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తున్నాం. చెన్నైలో అగ్నికుల్‌, హైదరాబాద్‌లో స్కైరూట్‌ సంస్థలు రాకెట్‌లను నిర్మిస్తున్నాయి. ఇలా దేశంలో ఐదు కంపెనీలు రాకెట్లు, ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయి’ అని సోమనాథ్‌ చెప్పారు. ‘చంద్రయాన్‌-3 విజయవంతమైన సమయంలో.. జాబిల్లిపైకి భారతీయుడిని ఎప్పుడు పంపుతారని ప్రధాని మోదీ అడిగారు. ఇక్కడ కూర్చున్న మీలోనే కొందరు ఆ పని సాధిస్తారు. ఆ రాకెట్‌ను డిజైన్ చేస్తారు’ అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ‘చంద్రయాన్‌- 10’ సమయంలో మీలోనే ఒకరు రాకెట్‌లో జాబిల్లిని చేరుకుంటారని.. అందులో చాలావరకు మహిళ వ్యోమగామే ఉండొచ్చన్నారు.

చంద్రుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన చంద్రయాన్‌-3.. ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా, అప్పటి సోవియట్‌ యూనియన్‌, చైనాల తర్వాత చంద్రుడిపై ల్యాండింగ్ ఘనతను సాధించిన నాల్గో దేశంగా భారత్‌ నిలిచింది. ఇదిలా ఉండగా.. జేపీఎల్‌ అనేది నాసా నిధులు సమకూర్చే ఓ పరిశోధనాభివృద్ధి కేంద్రం. సంక్లిష్టమైన రాకెట్ మిషన్లను అభివృద్ధి చేయడంలో ఇక్కడి నిపుణులు నిమగ్నమై ఉంటారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ దీని నిర్వహణ బాధ్యతలు చూస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని