మాపై దాడి చేస్తే ప్రతిదాడి తీవ్రం: ఇజ్రాయెల్

ఇరాన్‌-అమెరికాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్‌ను ఉద్దేశిస్తూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ భూభాగంపై ఎవరైనా దాడి చేస్తే ప్రతి దాడి అత్యంత...

Updated : 08 Jan 2020 22:12 IST

జెరూసలేం: ఇరాన్‌-అమెరికాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్‌ను ఉద్దేశిస్తూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ భూభాగంపై ఎవరైనా దాడి చేస్తే ప్రతి దాడి అత్యంత తీవ్రంగా ఉంటుదని అన్నారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ బలగాలు క్షిపణులతో దాడికి దిగిన అనంతరం ఆయన పై విధంగా స్పందించారు. అయితే గత వారం అమెరికా డ్రోన్‌ దాడిలో మృతి చెందిన ఇరాన్‌ మిలిటరీ కమాండర్‌ ఖాసీం సులేమానీని నెతన్యాహు తీవ్రవాద నాయకుడిగా అభివర్ణించారు. ‘‘ఖాసీం సులేమానీ ఎంతో మంది అమాయక ప్రజల మరణాలకు బాధ్యుడు. దశాబ్దాలుగా అతను ఎన్నో దేశాలను అస్థిరపరచి, అక్కడి ప్రజలను ఎంతో క్షోభకు, భయానికి గురిచేయంతో పాటు మరింత నాశనానికి పాల్పడాలనుకున్నాడు’’ అని అన్నారు. మధ్య తూర్పు ప్రాంతంతో పాటు, ప్రపంచంలో ఇరాన్‌ ఉగ్రవాద ప్రచారాలకు అతనే నాయకత్వం వహించాడు అని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. బాగ్దాద్‌లో సులేమానీని చంపే విషయంలో ఆయన ఎంతో వేగంగా, హుందాగా వ్యవహరించారని పేర్కొన్నారు. అమెరికా చేసిన డ్రోన్‌ దాడి నేపథ్యంలో అమెరికాతో సహా దాని మిత్రపక్ష దేశాలు అప్రమత్తమయ్యాయి. సోమవారంనాడు ఇరాన్ ముఖ్య అధికారి మాట్లాడుతూ అమెరికా తమపై దాడికి దిగితే ముందుగా ఇజ్రాయెల్‌లోని ముఖ్య నగరాలైన హైఫా, టెల్ అవీవ్‌ బూడిదలో కలిసి పోతాయని హెచ్చరించారు. తాజాగా అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులతో ప్రతీకార దాడులకు దిగింది. దీనిపై సరైన సమయంలో బదులిస్తామని అమెరికా రక్షణశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని