క్రైస్తవులపై దాడులనేవి తప్పుడు ప్రచారం: కేంద్రం

దేశంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయనేది తప్పుడు ప్రచారమనీ, అర్ధ సత్యాలతో, స్వీయ ప్రయోజనాల కోసం రాసుకున్న వ్యాసాలతో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని

Published : 17 Aug 2022 05:51 IST

దిల్లీ: దేశంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయనేది తప్పుడు ప్రచారమనీ, అర్ధ సత్యాలతో, స్వీయ ప్రయోజనాల కోసం రాసుకున్న వ్యాసాలతో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ మంగళవారం సుప్రీంకోర్టుకు ప్రమాణపత్రం సమర్పించింది. క్రైస్తవులపై దాడుల్ని, హింసను అరికట్టే చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నల ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరయ్యారు. ‘‘కొన్ని సంఘాలు రహస్య ఎజెండాను ఏర్పాటు చేసుకుని, దానికి తగ్గట్టు వ్యాసాలను, నివేదికలను రూపొందించి రిట్‌ పిటిషన్లకు, పిల్‌లకు ప్రాతిపదికను ఏర్పరుస్తున్నాయి. క్రైస్తవులు అణచివేతకు గురవుతున్నారంటూ చెబుతున్న నివేదికలు తప్పు. కులం, మతం కోణమే లేని స్వల్ప వివాదాలనూ క్రైస్తవులపై హింసగా చిత్రీకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా అశాంతి రేకెత్తించడం, దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా విదేశీ నిధుల్ని రాబట్టడం ధ్యేయంగా ఇలాంటి వంచనాత్మక పిటిషన్లు వేస్తున్నారు’’ అని తెలిపారు. పిల్‌పై స్పందన ఆలస్యమైనందుకు క్షమాపణలు చెప్పారు. అఫిడవిట్‌పై పిటిషనర్లు స్పందించడానికి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని