Indian Army: గల్వాన్‌ ఘర్షణ తర్వాత భారత సైన్యానికి ప్రత్యేక శిక్షణ..!

గల్వాన్‌ ఘర్షణ అనంతరం శిక్షణలో భారత సైన్యం కీలక మార్పులు చేసింది. దళాలను మార్షల్‌ ఆర్ట్స్‌లో రాటు దేలుస్తోంది.

Updated : 16 Feb 2024 13:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గల్వాన్‌ ఘర్షణ తర్వాత నుంచి భారత సైన్యం (Indian Army) శిక్షణలో మార్పులు చేసినట్లు తెలిసింది. ఆయా రెజిమెంట్లలో సైనికులకు రోజువారీ ఫిట్‌నెస్‌ శిక్షణతో పాటు.. వివిధ మార్షల్‌ ఆర్ట్స్‌ను కూడా భాగం చేసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయని ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. పంజాబ్‌ రెజిమెంట్‌లోని వారికి ఘాతక్‌, గూర్ఖా రెజిమెంట్‌కు కుక్రీ డ్యాన్స్‌, మద్రాస్‌ రెజిమెంట్‌కు కలిరిపయట్టు వంటివి నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన సైనికులను అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కిబితు ప్రాంతంలో మోహరించారు. వారు ఇటీవల కొందరు జర్నలిస్టుల ముందు మార్షల్‌ ఆర్ట్స్‌ను ప్రదర్శించి చూపారు.

ఆ యూనిట్‌కు చెందిన మేజర్‌ కార్తికేయ జైస్వాల్‌ మాట్లాడుతూ.. స్థానిక భౌగోళిక స్వరూపం, గస్తీ సమయంలో ఎదురయ్యే సవాళ్లు భిన్నమైనవన్నారు. ‘‘వేగంగా ప్రవహించే నదులు, ముళ్లు, వర్షాలు, త్వరగా మారిపోయే వాతావరణం, ఎత్తైన శిఖరాల వంటివి ఇక్కడ ఉంటాయి. దీంతో నిత్యం శిక్షణ తప్పనిసరి. వీటిల్లో మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా ఒకటి’’ అని వెల్లడించారు. ఇలాంటి అభిప్రాయాన్నే ఆ యూనిట్‌ కమాండింగ్‌ అధికారి కర్నల్‌ ప్రిన్స్‌ రోహిత్‌ వ్యక్తం చేశారు.

గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఉధంపుర్‌లోని నార్తర్న్‌ కమాండ్‌ ఇజ్రాయెల్‌కు చెందిన క్రావ్‌ మాగా అనే మార్షల్‌ ఆర్ట్స్‌ను సైనిక శిక్షణలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆయా యూనిట్లకు లేఖలు రాసింది. ఆ తర్వాత అవి తమకు అనుబంధంగా అవసరమైన యుద్ధ విద్యను ఎంపిక చేసుకున్నాయి. ‘‘సరిహద్దుల వెంట ఘర్షణలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. మనకు ఇప్పటికే ఉన్న పలు భారతీయ మార్షల్‌ ఆర్ట్స్‌ ఆ సమయంలో సరిగ్గా సరిపోతాయి’’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

45 ఏళ్ల లోపు సైనికులు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉన్నామని నిరూపించుకునేందుకు ఇప్పటికే ప్రతి త్రైమాసికంలో బీపీఏటీ(Battle preparedness and efficiency test)ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిలో 30 ఏళ్ల లోపు వారు 5 కిలోమీటర్ల పరుగును 25 నిమిషాల్లో ముగించాలి. 30-40 మధ్య వయస్కులకు అదనంగా మరో రెండు నిమిషాల సమయం ఇస్తారు. అధికారుల ఫిట్‌నెస్‌కు సంబంధించిన నిబంధనలను కూడా సైన్యం మార్చింది. ఇవి ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. 

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం

భారత్‌-చైనా సైనికుల మధ్య 2020లో గల్వాన్‌ లోయలో ఘర్షణ జరిగింది. ఈ సమయంలో ఇరు దేశాల సైనికులు రాళ్లు, కర్రలతో తలపడ్డారు. వాస్తవాధీన రేఖ వద్ద తుపాకుల వంటి ఆయుధాలు వినియోగించకూడదని ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైన్యం శిక్షణలో మార్షల్‌ ఆర్ట్స్‌ను భాగం చేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని