Nitish Kumar: జనాభా నియంత్రణ వ్యాఖ్యలపై దుమారం.. క్షమాపణలు చెప్పిన నీతీశ్‌ కుమార్

తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బిహార్ ముఖ్యమంత్రి  నీతీశ్‌ కుమార్(Nitish Kumar) స్పందించారు. తన వ్యాఖ్యలతో తప్పుడు సందేశం వెళ్లి ఉంటే..  క్షమించాలని కోరారు. 

Updated : 08 Nov 2023 12:40 IST

పట్నా: జనాభా నియంత్రణ విషయంలో మహిళల విద్యకున్న ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌(Bihar Chief Minister Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భాజపా నేతలతో సహా పలువురు నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్‌ రేఖా శర్మ స్పందిస్తూ.. నీతీశ్‌(Nitish Kumar) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు. ‘నా వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తున్నాను. నా మాటలతో తప్పుడు సందేశం వెళ్లి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటా’ అని అన్నారు.

ఇటీవల బిహార్‌(Bihar)లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా  నితీశ్‌ మాట్లాడుతూ.. చదువుకున్న మహిళలు శృంగారంలో తమ భర్తలను నియంత్రించగలరని వ్యాఖ్యానించారు.‘‘భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయి. అయితే చదువుకున్న మహిళకు భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తోంది’’ అని మాట్లాడారు. దీనిపై భాజపా తీవ్రంగా స్పందించింది. నీతీశ్‌ తన వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య హుందాతనాన్ని దెబ్బతీశారని విమర్శించింది. ‘అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఆయన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కనపడుతోంది. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, వైద్యుడిని సంప్రదించాలి’ అని పేర్కొంది.

పని ప్రదేశంలో లైంగిక వేధింపులను తీవ్రంగా పరిగణించాలి: సుప్రీం

నీతీశ్‌ వ్యాఖ్యలను రేఖా శర్మ తీవ్రంగా ఖండించారు. ‘మహిళల హక్కులు, ఎంపికల విషయంలో ఆయన వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే బిహార్ అసెంబ్లీలోనూ నిరసన వ్యక్తమైంది. ‘నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా. నేను మీడియా ముందు ఇచ్చిన వివరణను అందరూ చూశారు. ఇంకెందుకు అసెంబ్లీలో ఈ అరుపులు’ అని నీతీశ్‌ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే..ఈ వివాదంపై జేడీయూ మిత్రపక్షమైన ఆర్జేడీ నుంచి మద్దతు రావడం గమనార్హం. ఆయన మాటలను వక్రీకరించకూడదని ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని