Supreme Court: ‘జూన్‌ 15లోగా ఆ స్థలాన్ని ఖాళీ చేయండి’: కేజ్రీవాల్‌ పార్టీకి సుప్రీం ఆదేశాలు

దిల్లీ హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేయాలని ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP)ని ఆదేశించిన సుప్రీంకోర్టు.. అందుకు కొంత సమయం ఇచ్చింది.  

Published : 04 Mar 2024 17:25 IST

దిల్లీ: న్యాయ అవసరాలకు కేటాయించిన స్థలంలో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేయాలని ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP)ని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకోసం జూన్‌ 15 వరకు గడవు విధించింది. న్యాయ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు దిల్లీ హైకోర్టుకు స్థలాన్ని కేటాయించారు. అందులోనే ఆప్‌ కేంద్ర కార్యాలయం ఉంది.

దిల్లీ హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆప్‌ కార్యాలయం ఉందన్న విషయాన్ని సుప్రీం పరిశీలించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని అన్నారు. ‘ఒక రాజకీయ పార్టీ అక్కడ ఎలా కార్యకలాపాలు నిర్వహిస్తుంది..? అక్రమ కట్టడాలన్నింటిని తొలగిస్తాం. ప్రజలకు ఉపయోగపడే భూమిని హైకోర్టుకు తిరిగి స్వాధీనం చేయాలి. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని నిర్ధారించేందుకు తదుపరి వాయిదాలోగా దిల్లీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్ సమావేశం కావాలి’ అని ఆదేశించింది.

మీరొక మంత్రి.. ఆ మాత్రం తెలియదా?: ఉదయనిధి ‘సనాతన’ వ్యాఖ్యలపై సుప్రీం

అలాగే ఆప్‌ ఆఫీసులకు స్థలం కోసం ల్యాండ్‌ అండ్ డెవలప్‌మెంట్‌ విభాగాన్ని సంప్రదించాలని ఆ పార్టీకి సూచించింది. ఆ విభాగం పార్టీ దరఖాస్తును పరిశీలించి, నాలుగు వారాల్లో తన నిర్ణయాన్ని తెలియజేయాలని చెప్పింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే జూన్‌ 15 వరకు గడువు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని