Boeing 737 MAX: భారత్‌లోనూ బోయింగ్‌ కలకలం.. ఓ విమానంలో లోపాన్ని గుర్తించిన డీజీసీఏ

భారత్‌లో కూడా బోయింగ్‌ 737 మ్యాక్స్ విమానంలో ఓ లోపం బయటపడింది. ఈ విషయాన్ని డీజీసీఏ ప్రకటించింది.

Updated : 09 Jan 2024 15:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బోయింగ్‌ 737 మ్యాక్స్‌ (Boeing 737 MAX) రకం విమానాలు వైమానిక రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇటీవల వీటిల్లో పలు లోపాలు బయటపడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌లైన్స్‌లు, ప్రభుత్వాలు తనిఖీలు చేపట్టాయి. తాజాగా భారత్‌లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ దీనిపై దృష్టిపెట్టింది. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిని ఆకాశ ఎయిర్‌ (22), స్పైస్‌ జెట్‌ (9), ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (9) నడుపుతున్నాయి.

తాజాగా ఈ విమానాల్లో డీజీసీఏ తనిఖీలు చేపట్టింది. ఒక విమానంలో వాషర్‌ లేనట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. ‘‘ఇప్పటికే 39 తనిఖీలు పూర్తయ్యాయి. 40వ దానిలో వాషర్‌ కనిపించలేదు. ఈ విషయం బోయింగ్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆ సంస్థ సూచించిన విధంగా చర్యలు తీసుకుంటాం’’ అని డీజీసీఏ తెలిపింది.

బోయింగ్‌ డేంజర్‌ బెల్స్‌.. మరిన్ని విమానాల్లో లూజ్‌ బోల్ట్‌ల గుర్తింపు

ఇటీవల అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్‌ 9 రకం విమానం 177 మంది ప్రయాణికులతో గాల్లో ఉండగా.. డోర్‌ప్లగ్‌ ఊడిపోయింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత నెల చివర్లో ఓ 737 మ్యాక్స్‌ విమానం రడ్డర్‌ కంట్రోల్‌ వ్యవస్థలో కీలకమైన బోల్ట్‌కు నట్లు లేనట్లు గుర్తించారు.

ఐదేళ్ల క్రితం నెలల వ్యవధిలోనే ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు కూలి 346 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు ఈ రకం విమానాలను పక్కనపెట్టారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కార్పొరేట్‌ విషాదంగా ఇది నిలిచింది. ఈ పరిణామాలతో బోయింగ్‌కు దాదాపు 20 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వచ్చింది. ఆ తర్వాత కూడా పలు లోపాలు ఈ విమానాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని