Arvind Kejriwal: బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?

Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Published : 29 Apr 2024 17:12 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తన అరెస్టు, కస్టడీని సవాల్‌ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. 

తాము ఎలాంటి పిటిషన్‌ వేయలేదని సింఘ్వీ తెలపగా.. బెయిల్‌ కోసం ముందు ట్రయల్‌ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని అడిగింది. అయితే, ఈ కేసులో కేజ్రీవాల్‌ అరెస్టు అక్రమమని, అందుకే తాము ఎలాంటి పిటిషన్లు వేయలేదని న్యాయవాది తెలిపారు. కేవలం సమన్లకు హాజరుకాలేదన్న కారణంతో అరెస్టు చేయడం సరికాదని వాదించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎలా వస్తుంది..?

జైల్లో కేజ్రీవాల్‌ను కలిసిన సతీమణి..

ఈ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్‌.. ఏప్రిల్‌ 1 నుంచి తిహాడ్‌ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, సీఎంను కలిసేందుకు ఆయన సతీమణిని జైలు అధికారులు అనుమతించడం లేదని ఈ ఉదయం ఆప్‌ వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలోనే సునీత అభ్యర్థనను అధికారులు అంగీకరించారు. దీంతో ఈ మధ్యాహ్నం మంత్రి ఆతిశీతో కలిసి ఆమె తిహాడ్‌ జైలుకు వెళ్లారు.

అనంతరం ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చూడగానే సీఎం ఒకటే అడిగారు. పనులు ఎలా జరుగుతున్నాయి? స్కూల్‌ పిల్లలకు పుస్తకాలు అందాయా? మొహల్లా క్లినిక్‌లలో ఔషధాలు సరిపడా ఉన్నాయా? అని ఆరా తీశారు. తాను కచ్చితంగా బయటకు వస్తానని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ప్రజలకు చెప్పాలని సందేశం పంపారు’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు