Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 22 Mar 2024 21:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆడుజీవితం’ (Aadujeevitham)లో నటించే అవకాశం తనకు వచ్చినందుకు మలయాళ ఇండస్ట్రీ అసూయ పడిందనుకుంటున్నానని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) అన్నారు. ‘ది గోట్‌లైఫ్‌’ పుస్తకం ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కించిన చిత్రమిది. అమలాపాల్ కథానాయిక. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వలసవెళ్లిన నజీబ్‌గా పృథ్వీరాజ్‌ నటించిన ఈ సినిమా మార్చి 28న తెలుగులోనూ విడుదల కానుంది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పృథ్వీరాజ్‌, బ్లెస్సీ, నిర్మాత యలమంచిలి రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

* సర్వైవల్‌ థ్రిల్లర్‌ స్టోరీలన్నీ దాదాపు ఒకే అంశంతో ముడిపడి ఉంటాయి. ఈ సినిమా విషయంలో మిమ్మల్ని ఏం ఆకర్షించింది?

పృథ్వీరాజ్‌: ఇది సర్వైవల్‌ స్టోరీ మాత్రమే కాదు. ఇంకా ఎన్నో ఎలిమెంట్స్‌ ఉన్నాయి. రోజుకు ఆరేడు గంటలు సముద్ర తీరాన పనిచేసే వ్యక్తి చుక్క నీరు లేని ప్రదేశానికి ఎందుకెళ్లాల్సి వచ్చింది? అక్కడెలా ఉండగలిగాడు?అనేది ఈ సినిమా కథాంశం. ఆ వ్యక్తి కొన్నాళ్లకు మనుషులకు దూరమై జంతువులతో ప్రేమగా ఉంటాడు. ఈ అంశాలే నన్ను ఆకర్షించాయి.

* నజీబ్‌ పాత్ర కోసం 31 కిలోల బరువు తగ్గారు కదా. దాని గురించి చెబుతారా?

పృథ్వీరాజ్‌: బ్లెస్సీ సర్‌ దర్శకత్వంలో ఒక్క సినిమాలోనైనా నటించాలనేది మలయాళ నటీనటులందరి డ్రీమ్‌. పలువురు అగ్ర హీరోలతో పని చేసిన ఆయన ‘ఆడుజీవితం’ కోసం యంగ్‌ యాక్టర్‌ని తీసుకోవాలనే ఉద్దేశంతో నన్ను సంప్రదించారు. నేను వెంటనే ఓకే చెప్పా. ఈ ప్రాజెక్టు నేను చేస్తున్నానని తెలియగానే మలయాళ ఇండస్ట్రీ అసూయ పడిందనుకుంటున్నా (నవ్వుతూ). వేరే వారికి ఈ ఛాన్స్‌ దక్కినా నేనూ అసూయ పడేవాణ్ని. సినిమా చూశాక ఏ ఒక్కరూ ‘పృథ్వీరాజ్‌.. ఇంకా బెటర్‌గా నటించి ఉండాల్సింది. లుక్‌ సెట్‌ అవలేదు’ అని అనకుండా ఉండాలని పాత్రకు న్యాయం చేసేందుకు నా వంతు ప్రయత్నించా. అలా బరువు తగ్గా.

*ఇలాంటి స్క్రిప్టులను ఎంపిక చేసుకోవడంలో మీకు స్ఫూర్తి ఎవరు?

పృథ్వీరాజ్‌: సినిమాపై ఉన్న ప్రేమే అందుకు కారణం. సినిమా తప్ప నాకు వేరేది తెలియదు. కొన్నాళ్లుగా ‘ఆడుజీవితం’తో ప్రయాణించా. ఈ క్రమంలో.. చిరంజీవి సర్‌ ఇచ్చిన రెండు ఆఫర్లకు (‘సైరా’లో కీలక పాత్ర పోషించడం, ‘లూసిఫర్’ను తెలుగులో తెరకెక్కించడం) ‘నో’ చెప్పా.

* ఈ సినిమా చిత్రీకరణ ఎడారిలోనే జరిగింది. బడ్జెట్‌ రూ.80 కోట్లు అంటున్నారు. సౌండ్‌, వీఎఫ్‌ఎక్స్‌ తదితర వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారా?

బ్లెస్సీ: ముందుగా రాజస్థాన్‌ ఎడారిలో షూట్ చేయాలనుకున్నాం. కానీ, అది అనువుగా లేదు. అందుకే విదేశాల్లో చిత్రీకరించాం. విదేశీ మాదక ద్రవ్యంలో హెచ్చుతగ్గులు, ప్రముఖ సాంకేతిక నిపుణల ఎంపిక వంటి వాటి వల్ల బడ్జెట్‌ పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని