Ajay Ghosh: అందుకే ‘ఆచార్య’లో నటించలేదు..: అజయ్‌ ఘోష్‌

విలన్‌ పాత్రల్లోనే కాకుండా కామెడీ పాత్రల్లోనూ తనదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్‌ ఘోష్‌. ఆయన సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, చూసిన విజయాలను ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో పంచుకున్నారు.

Updated : 07 Nov 2022 06:31 IST

రంగస్థల నటుడిగా తన జీవితాన్ని ప్రారంభించి సినిమా నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన మరెవరో కాదు  అజయ్‌ ఘోష్‌. ప్రస్థానం సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత పూరీ జగన్నాథ్‌ ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో విలన్‌గానూ రాణించారు. రంగస్థలం, పుష్ప సినిమాల్లో నటించి తన కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకున్నారు. తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అజయ్ ఘోష్‌ అంటే విలన్‌ పాత్రలకు మాత్రమే పరిమితం అని కాకుండా కామెడీ పాత్రల్లోనూ నటిస్తూ ఆయన నటనా ప్రతిభను చాటుకుంటున్నారు. చెప్పాలని ఉంది కార్యక్రమంలో అజయ్‌ ఘోష్‌ చెప్పిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

మీ బాల్యమంతా ఎక్కడ జరిగింది?ఒకప్పుడు చిన్న చిన్న అవకాశాల కోసం ఎదురుచూసిన మీరు ఇప్పుడు బిజీ ఆర్టిస్టు అయ్యారు. దీన్ని ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు?

అజయ్ ఘోష్‌: కష్టపడుతూ ఉంటే అవకాశాలు వస్తూ ఉంటాయి. మన లక్ష్యాన్ని మరచిపోకుండా పనిచేసుకుంటూ వెళ్తుంటే ఎదో ఒక రోజు కళామతల్లి కరుణిస్తుంది. మాది చీరాల దగ్గర వేటపాలెం. మేము ముగ్గురం అన్నదమ్ములం. మా నాన్నకు కమ్యూనిజం అంటే ఇష్టం. అందుకే మా ముగ్గురికీ కమ్యూనిస్ట్‌ల పేర్లు పెట్టారు. మా పిల్లల పేర్లు కూడా అలానే పెట్టాం. నాకు కమ్యూనిజం అంటే ఇష్టం కానీ కుటుంబ పరిస్థితులు అటువైపు వెళ్లకుండా చేశాయి. నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడే నాకు నటనపై ఆసక్తి వచ్చింది. అప్పుడు మా స్నేహితులందరం కలిసి ఓ నాటకం వేశాం. అప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలని మనసులో పడింది. కాలేజీకు వెళ్లకుండా నాటకాలకు వెళ్లేవాడిని. మా ఇంట్లో వాళ్లు నా డ్రస్‌లు దాచేసేవారు. ఒక్క డ్రస్‌ మాత్రమే బయట ఉంచేవాళ్లు. అయినా ఏ గూటిపక్షులు ఆ గూటికే చేరుతాయంటారు కదా.. అందుకే ఎటుపోయినా చివరకు ఇలా సినిమాల్లో స్థిరపడ్డాను. 

మొట్టమొదటి సారి మీరు వేసిన నాటకం ఏంటి?

అజయ్ ఘోష్‌: నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ‘రక్తపిపాసి’ అని నాటకం వేశా. మొదటిసారి స్టేజి మీద ఎక్కడం అదే. ఆ తర్వాత ఆరో తరగతి నుంచి తరచుగా నాటకాలు వేస్తూ వచ్చాను. నాకు రేడియోల్లో ఎనౌన్స్‌మెంట్‌ ఇవ్వాలని కూడా కోరిక ఉండేది. కానీ దానికి చాలా అర్హతలు కావాలని తెలిసి అటువైపు వెళ్లలేదు.

జీవితంలో త్వరగా స్థిరపడాలని ఎప్పుడు అనిపించింది?

అజయ్ ఘోష్‌: నేను చాలా రోజులు డబ్బు గురించి ఆలోచించ లేదు.  కానీ ఏదో సాధించాలన్న తపన ఉండేది. నాకు నా స్నేహితులు ఎంతో సహాయం చేశారు. నన్ను ఎంతగానో ప్రొత్సహించారు. నాకు ప్రతి ఊరిలో ఫ్రెండ్స్‌ ఉండేవారు. ఏదైనా వాళ్లతోనే పంచుకుంటాను. నా జీవితంలో నాకు మంచి మనుషులు పరిచయమయ్యారు. వాళ్ల వల్లే ఈరోజు ఈమాత్రమైనా గుర్తింపు వచ్చింది.

మీ పెళ్లి కూడా మీ స్నేహితులే  చేశారట నిజమేనా?

అజయ్ ఘోష్‌: నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన లేదు. మా అమ్మ ఇంట్లో గోల చేసింది. అప్పుడు మా స్నేహితులు అందరూ కలిసి ఊరు తీసికెళ్లి అక్కడ పెళ్లిచూపులు ఏర్పాటుచేశారు. మొదట నేను మా ఆవిడకు నచ్చలేదు. అంతా కలిసి ఆమెను ఒప్పించి పెళ్లి చేశారు. కానీ, ఆమె నా జీవితంలోకి వచ్చాక నాలో ఎంతో మార్పు వచ్చింది. ఒకానొక దశలో మా ఇంట్లో అందరినీ ఆమెనే పోషించింది. చాలా మంచి వ్యక్తి. ఆమె అంటే ఇప్పటికీ నాకు భయమే.     

హైదరాబాద్‌ ఎలా వచ్చారు? దాని వెనుక ఉన్న కథ ఏంటి?

అజయ్ ఘోష్‌: పెళ్లి అయ్యాక స్నేహితులంతా కలిసి ఒంగోలులో నాతో కిళ్లీ షాపు పెట్టించారు. అక్కడ టీడీపీ ఆఫీసు ఉండేది. రాత్రిపూట అక్కడే నిద్రపోయేవాడిని. తెల్లవారుజామున మూడు గంటల వరకు ఈనాడు పేపర్‌లో వచ్చే ఎడిటోరియల్స్‌ పెద్దగా చదివేవాడిని. అలా చదవడం వల్ల భాష మీద పట్టు వచ్చింది. ఆ తర్వాత చీరాల సిటీకేబుల్‌లో వార్తలు చదవడానికి మనిషి కావాలంటే నా స్నేహితులు నన్ను తీసుకువెళ్లారు. మనిషి ఎలా ఉన్నా గొంతుబాగుందని అవకాశం ఇచ్చారు. అలా విజయవాడ సిటీ ఆఫీసుకు నా గొంతు చేరింది. అక్కడ పర్వతనేని శివప్రసాద్‌ గారు నన్ను ప్రొగ్రామ్‌ డైరెక్టర్‌ని చేశారు. అంత్యాక్షరితో పాటు మరికొన్ని ప్రొగ్రామ్‌లు దగ్గరుండి చూసుకునేవాడిని. అక్కడకు సెలబ్రెటీలు వచ్చేవారు. ‘ఇక్కడుంటే ఇలానే ఉంటావు హైదరాబాదు వెళ్లు’ అని కుంచేరాజుగారు నాతో పదే పదే చెప్పేవారు. అప్పుడు రూ.5వేలు అప్పుచేసి మా ఆవిడకు ఇచ్చి హైదరాబాద్‌ వచ్చాను. 

సీరియల్లో మొదటి అవకాశం ఎలా వచ్చింది?

అజయ్ ఘోష్‌: సీరియల్స్‌, సినిమాల్లో అవకాశాలు రావడం అంత సులభం కాదని నాకు హైదరాబాద్‌ వచ్చిన 3నెలలకే అర్థమైంది. తిరిగి మా ఊరు వెళ్లిపోదాం అనుకున్నా. ఆ టైంలో ఓ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. 4 రోజులు షూటింగ్‌ చేశా. రోజుకు రూ.500 ఇచ్చారు. దాని తర్వాత మళ్లీ అవకాశాలు రాలేదు. వెళ్లిపోదామని నిర్ణయించుకుని చందనా స్టూడియోస్‌కు వెళ్లి మురళిగారికి చెబుదాం అనుకున్నా. ఆయన ఒకసారి స్టూడియోకు వచ్చి కలవమన్నారు. అప్పుడు స్టూడియోకు వెళ్లా 6 సంవత్సరాలు అక్కడే ఉన్నా. అక్కడ మంచి స్నేహితులు పరిచయమయ్యారు. వాళ్లే ఈటీవీలో భాగవతం సీరియల్‌లో నరకాసురుడి పాత్ర ఉందని వెళ్లమంటే వెళ్లి బాపుగారిని కలిశాను. నేను ఎవరి ముందైనా భయం లేకుండా మాట్లాడతాను అలాంటిది బాపు గారిని చూసినప్పుడు కాళ్లు చేతులు వణికిపోయాయి. డైలాగ్‌ చెప్పమంటే భయంతోనే చెప్పేశా. మధ్యాహ్నం వచ్చి కాస్ట్యూమ్స్‌ వేసి బాగున్నారు అని చెప్పి వెళ్లారు. త్వరలోనే డేట్స్‌ చెబుతామన్నారు. అలా ‘భాగవతం’లో అవకాశం వచ్చింది. అప్పుడు నన్ను ఒక ఆర్టిస్టుగా గుర్తించారు. ఆ తర్వాత ఈటీవీ సుమన్‌గారు ఏ పౌరాణిక సీరియల్స్‌ తీసినా నాకు అవకాశం ఇచ్చేవారు. 

బుల్లితెర నుంచి వెండితెరకు ప్రయాణం ఎలా సాగింది?

అజయ్ ఘోష్‌: నేను సీరియల్స్‌లో చేసేటప్పుడు అక్కడ తోటినటులు అందరూ సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించేవారు. అప్పుడు సినిమాల్లో పాత్రల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాను. వాళ్లు చూద్దాం అనేవారు. కొన్నిరోజుల తర్వాత దేవా కట్టా గారు ప్రస్థానం సినిమాలో ‘గౌడ్‌’ పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు.  ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.    
 
‘రామచిలకమ్మా’ సినిమాలో మొదటిసారి వెండితెరపై కనిపించారు. అక్కడి నుంచి ప్రస్థానం దాకా ఎలా సాగింది?

అజయ్ ఘోష్‌: తెలిసిన స్నేహితుడు ఒకరు భరద్వాజ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయన రామచిలకమ్మాలో లాయర్‌ క్యారెక్టర్‌ ఇచ్చారు. మొదటిసారి వెండితెర మీద నేను కనిపించింది అప్పుడే. ఆ తర్వాత చాలా రోజులు ఖాళీగా ఉన్నా. తర్వాత ప్రస్థానం సినిమాలో నటించా. దేవా కట్టా గారు ఏదైనా సూటిగా చెప్పేస్తారు. ఆ సినిమాలో నటించేప్పుడు ఆయన ‘నువ్వేం కొండవీటిసింహం కాదు. ఓవర్‌ చెయ్యకు మాములుగా చేస్తే చాలు’ అన్నారు. ఆయన దగ్గర నటనకు సంబంధించి చాలా పాఠాలు నేర్చుకున్నా. ఆ తర్వాత గుర్తింపు వచ్చినా కానీ అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో అవకాశం కోసం వెళితే హేళనగా మాట్లాడే వాళ్లు. ‘హీరో ఖాళీగా లేరు. నువ్వు చేస్తావా’, ‘ఎన్నిసార్లు చెప్పాలి నీకు’ అని విసుగ్గా మాట్లాడేవాళ్లు. అక్కడి నుంచి మౌనంగా వచ్చేసేవాడిని.       

జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత ఎందుకు రాలేదు అవకాశాలు?

అజయ్ ఘోష్‌: పూరీజగన్నాథ్‌ ‘జ్యోతిలక్ష్మి’ సినిమా తర్వాత అందరూ నన్ను పొగిడారు. ఇంకేముంది నేను నిలదొక్కుకున్నా అనుకున్నా. కానీ సంవత్సరం దాటినా ఎవరూ పిలవలేదు. అప్పుడు మాములు పనులకు వెళ్లిపోయేవాడిని. నాకు తెలిసిన ఓ వ్యక్తి నాతో మాట్లాడుతూ..‘అవకాశాలు రావట్లేదని బాధపడకు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే దర్శకులు నీకు కచ్చితంగా పాత్రలు ఇస్తారు’ అని చెప్పాడు. ఆయన చెప్పింది నిజం ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఎక్కువశాతం కొత్త దర్శకులవే. కొరటాల శివ గారు ఆచార్య సినిమాలో విలన్‌ పాత్ర కోసం పిలిచారు. కానీ నాకు ఆ సమయంలో కొన్ని ఆరోగ్యసమస్యలు ఉండడం వల్ల చేయలేకపోయాను. 

మీ వాయిస్‌ బాగుంటుంది కాదా.. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా అవకాశాలు రాలేదా?

అజయ్ ఘోష్‌: చాలా మందికి డబ్బింగ్ చెప్పమని అడిగారు. కానీ ఒక్క సినిమాకు మాత్రమే చెప్పా. బి.జయ సినిమాలో తమిళ పాత్రకు డబ్బింగ్‌ చెప్పా. ఆ తర్వాత దేవగారి మీద ఉన్న గౌరవంతో ఆటోనగర్‌ సూర్య సినిమాలో విలన్‌కు డబ్బింగ్ చెప్పాను. డైరెక్టర్‌ సతీష్‌ రామదండు సినిమాలో ప్రెసిడెంట్‌ పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు పిలిచారు కానీ నాకు డేట్స్‌ ఖాళీలేక వెళ్లలేదు.  

తెలుగు కాకుండా వేరే భాషల సినిమాల్లో నటించారా?

అజయ్ ఘోష్‌: వెట్రిమారన్‌ గారు అని నేషనల్‌ డైరెక్టర్‌. ఆయన 'విసారణై' సినిమా చేస్తూ నాకు అందులో అవకాశం ఇచ్చారు. ఆయనతో కలిసి 28 రోజులు పనిచేశా. ఆ సినిమా 2016 సంవత్సరం ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. అది నాకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత తమిళంలో ఏ అవకాశం వచ్చినా వాళ్లనే అడిగేవాడిని. వాళ్లు చేయమంటే చేసేవాడిని.  

రంగస్థలం సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?ఆ సినిమా విశేషాలు చెప్పండి?

అజయ్ ఘోష్‌: సుకుమార్‌ నా జీవితాన్ని మలుపు తిప్పారు. రంగస్థలం తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుకుమార్‌ను నేను స్నేహితుడు, గురువు, దర్శకుడు అని అనను నా దృష్టిలో ఆయన అంతకన్నా గొప్ప. పుష్ప సినిమా సమయంలో నాకు కరోనా వచ్చింది. బాగా డీలా పడిపోయా. టీవీ చూడాలంటే భయంవేసింది. మానసికంగా చాలా కుంగిపోయా. తెల్లవారితే చనిపోతా అని ప్రతిరోజు అనుకునేవాడిని. ఆ సమయంలో పుష్ప అవకాశం వచ్చింది. కరోనా భయం వల్ల చేయను అని చెప్పా. ఆ సమయంలో సుకుమార్‌ నాలో భయాన్ని పొగోట్టడానికి ఎంత చేశారో. 200మంది ముందు నా కోసం నాలో మనోధైర్యాన్ని నింపడం కోసం డాన్స్‌ కూడా వేశారు. పుష్ప తర్వాత ఫోన్‌ చేస్తే ‘ఇకపై నేను తీసే ప్రతి సినిమాలో నువ్వు ఉంటావు’ అన్నారు. అంతకన్నా ఏమికావాలి నాకు సుకుమార్‌కు నిజంగా రుణపడి ఉంటాను.        

 

మంచిరోజులు వచ్చాయి సినిమా మీకు ఎలాంటి అనుభవాలు ఇచ్చింది?

అజయ్ ఘోష్‌: లండన్‌బాబులు అని ఓ సినిమా చేశా. అప్పుడే మారుతీ గారు పరిచయమయ్యారు. విజయవాడలో ఓ హోటల్‌లో నన్ను చూసి ‘మీకు మంచి వేషం ఇస్తాను’అని చెప్పారు. సంవత్సరం తర్వాత కూడా ఆయన నాకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని పిలిచారు. నాకు ఆ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. కరోనా అప్పుడు నేను ఎలా భయపడ్డానో ఆ సినిమా క్యారెక్టర్‌లో ప్రతిబింబించింది. అందుకే నాకు బాగా కనెక్ట్ అయ్యింది.   

నయనతార ‘అమ్మోరు తల్లి’ సినిమాలో పాత్ర గురించి చెప్పండి?

అజయ్ ఘోష్‌: మొదట ఆ పాత్ర కోసం హిందీ నటుడుని అనుకున్నారు. తర్వాత నేను అయితే బాగుంటుందని అనిపించి నన్ను పిలిచారు. నయనతార చాలా మంచి నటి. నన్ను ఎంతగానో గౌరవించింది. ఒకసారి నాకు సెట్‌లో చెమటలు పోస్తే.. ఫ్యాన్‌ వేయలేదని అందరినీ అరిచింది. 

నటుడిగా చేస్తూనే రచయితగా మారారని విన్నాం.. నిజమేనా?

అజయ్ ఘోష్‌: నాకు జనాలతో సంబంధాలు ఎక్కువ. జనం మధ్య తిరుగుతూ వాళ్ల జీవితాలను దగ్గరి నుంచి చూశాను. ఆ కథలే ఎవరైనా అడిగితే చెప్తాను. 

మిమ్మల్ని ఎవరో ఒకావిడ చాలా ఇబ్బంది పెట్టిందని విన్నాం?

అజయ్ ఘోష్‌: నాకు ఫోన్‌ చూడడం సరిగ్గా రాదు. ఎవరెవరో ఫోన్‌ చేసేవాళ్లు. అర్ధరాత్రి ఫోన్‌ చేసి ఏదేదో చెప్పేవాళ్లు. మొదటిలో భయపడే వాడిని. తర్వాత తెలిసింది.. ఇలాంటి ఓ బ్యాచ్‌ ఉంటుందని. మా ఫ్రెండ్స్‌ అందరూ కలిసి నన్ను ఆటపట్టించే వాళ్లు.   

కష్టం విలువ గురించి చెప్పండి? మీకు ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?

అజయ్ ఘోష్‌:ప్రతి మనిషి తన జీవితంలో కష్టాలు అనుభవిస్తారు. దానికి నేనేమీ అతీతం కాదు. మంచి స్నేహితుడు ఉండడం అదృష్టం. అన్ని అతనితో పంచుకుంటాం. కానీ ఒక్కోసారి అతనితో కూడా పంచుకోలేని విషయాలు ఉంటాయి. అలాంటివి నా జీవితంలో చాలా ఉంటాయి. నాకు నటనలో కోట శ్రీనివాసరావుగారు రోల్‌మోడల్‌. ఆయన లెజెండ్‌. ఆయన చేసిన లాంటి పాత్రలు వస్తే చాలు.  ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నా.. 53ఏళ్ల వ్యక్తి అనుకున్నది ఎలా సాధించాడు అన్నదే సారాంశం. నాకు చాలా నచ్చింది ఆ పాత్ర. చాలా సినిమాల్లో పోలీసు పాత్రలు చేశాను. పోలీసులకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.  

ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి. భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉండనున్నాయని అనుకుంటున్నారు?

అజయ్ ఘోష్‌: ప్రతి మనిషి జీవితంతో రాజకీయం ముడిపడి ఉంటుంది. నిద్ర లేచిన దగ్గరి నుంచి ప్రతి దానికి పన్ను కడుతున్నాం. అదే పన్ను సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారు. ఉచితాలు కాదు కావాల్సింది పని కావాలి.  మనిషి మరో మనిషిని గౌరవించాలి. ఆకలి లేని సమాజం రావాలి. ఒక కన్నీటి బొట్టును వెయ్యి చేతులు తుడిచేరోజు రావాలి. ఆ ఆశయం కోసం పనిచేయాలి. అది ఏ పార్టీ అయినా పర్వాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు