Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్‌ పూరి

తన తండ్రి పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

Published : 10 Mar 2024 15:47 IST

హైదరాబాద్‌: తన తండ్రి, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) డైరెక్షన్‌లో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్‌ (Akash Puri) అన్నారు. పూర్తిస్థాయి హీరోగా తనని తాను నిరూపించుకున్న తర్వాతే ఆయనతో సినిమా చేస్తానని తెలిపారు. తన వద్దకు వచ్చే స్టోరీలను ఆయన విని సూచనలిస్తారని చెప్పారు. ఓ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఎంపికైన సందర్భంగా ఆకాశ్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘ఏదో ఒకటి చేసేయాలని కాకుండా మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనుకుంటా. అందుకే గ్యాప్‌ వస్తోంది. చాలా స్క్రిప్టులు వింటున్నా. మూడు కథలు ఎంపిక చేశా. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తా. నా స్నేహితుడు తేజ సజ్జా ‘హనుమాన్‌’తో ఘన విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. అతడు ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. ‘కార్తికేయ 2’, ‘హనుమాన్‌’లాంటి చిత్రాలను ఆస్వాదించా. అలాంటి వాటిలో నటించేందుకు నేనూ ప్రయత్నిస్తున్నా. దర్శకత్వంపై ఆసక్తి ఉంది. భవిష్యత్తులో డైరెక్టర్‌ని అవుతా. రామ్‌ హీరోగా నాన్న తెరకెక్కిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమా అప్‌డేట్స్‌ కోసం నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. కొన్ని రోజుల క్రితమే రఫ్‌ టీజర్‌ కట్‌ చూశా. రామ్‌ అభిమానులు కోరుకునే అంశాలన్నీ అందులో ఉన్నాయి. కొందరు అనుకుంటున్నట్లు నేను ఈ సినిమాలో ఏ రోల్‌ ప్లే చేయలేదు’’ అని తెలిపారు.

‘బుజ్జిగాడు’ సీక్వెల్‌లో మీరు నటించే అవకాశాలున్నాయా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. అది ప్రేక్షకులకు బాగా నచ్చిన చిత్రమని, మళ్లీ టచ్‌ చేయకపోవడమే బెటర్‌ అని అన్నారు. జగన్నాథ్‌ తెరకెక్కించిన సినిమాల్లో తనకు ‘నేనింతే’ అంటే ఇష్టమని.. దానికి సీక్వెల్‌ ఉంటే అందులో యాక్ట్‌ చేస్తానని మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతానికి తాను రిలేషన్‌షిప్‌లో లేనని, సింగిల్‌గా ఉన్నానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘చిరుత’, ‘బుజ్జిగాడు’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన ఆకాశ్‌ ‘ఆంధ్రాపోరి’తో హీరోగా మారారు. ఆ తర్వాత ‘మెహబూబా’, ‘రొమాంటిక్‌’, ‘చోర్‌ బజార్‌’ సినిమాల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని