Alitho Saradaga: నేను పాముతో నటిస్తుంటే సాయికుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.: ప్రేమ

ఒకప్పటి నటీనటులు ప్రేమ, నరసింహ రాజు. వీరిద్దరూ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

Updated : 05 Nov 2023 15:20 IST

జానపద చిత్రాల కథానాయకుడిగానే గాక, ఎన్నో సహాయ పాత్రలకు ప్రాణం పోసిన నిన్నటి తరం నటుడు నరసింహ రాజు. భక్తిపరమైన పాత్రలతో పాటు , గ్లామర్‌ పాత్రల్లో  హీరోయిన్‌గానే గాక సపోర్టింగ్‌ రోల్స్‌లోనూ నేటికీ ఆదరగొడుతున్న ఎవర్‌గ్రీన్‌ చార్మింగ్‌ క్వీన్‌ ప్రేమ. ఏ పాత్రల్లో అయినా జీవిస్తూ ప్రేక్షకుల్ని అలరించే ఈ నటీనటులిద్దరూ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. వీరిద్దరూ ఇటీవల నటించిన సినిమా ‘అనుకోని ప్రయాణం’. మరి ఈ ఇద్దరు ఆలీతో పంచుకున్న విషయాలేంటో చూద్దాం.

ఈ ‘అనుకోని ప్రయాణం’లో మీరిద్దరి ప్రయాణాలు ఎలా సాగుతాయి?
ప్రేమ: ఈ సినిమా కథ విన్నప్పుడు నేను నిజంగా షాక్‌ అయ్యాను. కొవిడ్‌ సమయంలో వచ్చిన ఆలోచనని దర్శకుడు సినిమా రూపంలో ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ హీరో. నేను ఈ ప్రయాణం మధ్యలో అలా వచ్చి కలుస్తాను.  
నరసింహ రాజు: ఈ అనుకోని ప్రయాణం సినిమానే నా ప్రయాణం. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు. మంచి కాన్సెప్ట్‌. 

మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది?
నరసింహ రాజు: నేను సినీ పరిశ్రమకు వచ్చి 51 సంవత్సరాలైంది. సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. బాగా చదువుకునే వాడిని. కానీ చివరిలో పరీక్షలకు సరిగ్గా చదువుకోలేదు అప్పుడు ఫెయిల్‌ అయ్యానని అనిపించుకోకూడదని తణుకు నుంచి రైలు ఎక్కి మద్రాసు వచ్చేశాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నా.  మా బాబు కెనడాలో ఉంటాడు. షూటింగ్స్‌ లేని సమయంలో మేము కెనడా వెళ్తుంటాం. 
ప్రేమ: నేను పుట్టి పెరిగింది అంతా బెంగుళూరే. సినిమాలో నటించడం కోసం మద్రాసు వెళ్లాను. ‘ఓం’ సినిమా తెలుగులో నటించడం కోసం మద్రాసు వెళ్లాను.  మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది మాత్రం కన్నడ సినిమా కోసమే. ఆ సినిమాలో శివరాజ్‌కుమార్‌ హీరో.  ఆ సినిమా టైంలో 15 టేక్స్‌ తీసుకున్నా డైలాగ్‌ చెప్పడం రాలేదని దర్శకుడు నన్ను తిట్టారు. మా అమ్మ కూడా ఎందుకు చెప్పలేవు కాస్త శ్రద్ధ పెట్టమని తిట్టింది. అంతే కోపం వచ్చి వెళ్లి చెప్పా.. వెంటనే ఓకే అయింది. 

దేవతలా నటించాల్సి వచ్చినప్పుడు ఎలా ఫీల్‌ అవుతారు?
ప్రేమ: థియేటర్‌కు వచ్చే జనాలు కూడా మనల్ని చూసి అచ్చం దేవతలానే ఉన్నారనుకోవాలి.  దేవతలా నటించాలంటే ముఖంలో ప్రశాంతత ఉండాలి. తలపైన కిరీటం ఉంటుంది. ఆ సమయంలో ఎవరితో మాట్లాడను. యాక్షన్ అని చెప్పగానే కెమెరా, నేను అంతే అనుకుంటా. ‘దేవీ’ సినిమా చేసేటప్పుడు నేను దేవతలా ఫీల్‌ అయ్యా అది అనుకోకుండా వచ్చేస్తుంది. చాలా సార్లు పాములతో కూడా నటించా. నాగదేవత సినిమాలో పామును మెడలో వేసి రోమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వమన్నారు. భయపడుతూనే చేశాను. ఓకే అయ్యింది షాట్‌. సాయికుమార్‌ గారు నేను చూడలేను అని వెళ్లిపోయారు(నవ్వుతూ). నాకు వ్యక్తిగతంగా కుటుంబతరహా పాత్రలు అంటే ఇష్టం. 

దర్శకుడు విఠలాచార్య దగ్గర నటించే అవకాశం ఎలా వచ్చింది?
నరసింహ రాజు: అప్పట్లో విఠలాచార్య గారి సినిమాలంటే ప్రేక్షకులు హీరో ఎవరు అని కూడా చూసేవాళ్లు కాదు సినిమాకు వచ్చేసేవాళ్లు అంత క్రేజ్‌ ఉండేది. ఎవరైనా ఆర్టిస్టు డేట్స్‌ ఇచ్చాక కుదరక రాలేకపోతే ఏదో ఒకదానితో షూటింగ్‌ చేసేవాళ్లు. కాంతారావు గారు ఒకసారి షూటింగ్‌కు రావడం కుదరకపోతే ఓ పాట మొత్తం హీరోయిన్‌, గులాబీ పువ్వుతో తీశారు అంత గొప్ప దర్శకుడు ఆయన. నాకు ఓ స్నేహితుడు ఉండేవాడు తనతో కలిసి ఓసారి విఠలాచార్య గారి సినిమా షూటింగ్‌కు వెళ్లా. అప్పటికే నేను కొన్ని సినిమాల్లో నటించాను. ఆయన దగ్గరకు వెళ్లి ఏమైనా ఆధ్యాత్మికతకు సంబంధించిన పాత్రలు ఉంటే ఇస్తారా అని అడిగాను. ఆయన ‘జగన్మోహిని’ అని ఓ సినిమా తీస్తున్నాం అందులో ఇస్తా అన్నారు. అందులో చాలా మంది హీరోలను అనుకున్నప్పటికీ చివరికి నన్నే తీసుకున్నారు. అలా ఇప్పటివరకు సుమారు 100 సినిమాల్లో నటించాను. 1985 వరకు బాగా అవకాశాలు వచ్చాయి. 

హీరోయిన్‌గా బీజీగా ఉన్న రోజుల్లో ‘చిరునవ్వుతో’ అనే సినిమాలో సహాయనటిగా ఎందుకు నటించారు?
ప్రేమ: నాకు ఆ పాత్ర చాలా నచ్చింది. అందులో ఒక సెంటిమెంట్‌ ఉంటుంది అందుకే అంగీకరించా. నేను ఆ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూసినప్పుడు ప్రేక్షకులు నా పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యారు. చాలా ఆనందం వేసింది. 

మీరు సినిమాల్లో చేసేటప్పుడు విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా?3 సినిమాల తర్వాత దాసరి నారాయణ రావు సినిమాల్లో ఎందుకు నటించలేదు? 
నరసింహ రాజు: నేను విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. దాసరి నారాయణరావు గారు నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. నేను ఎప్పుడు వెళ్లినా నాకు ఆయన అవకాశం ఇస్తారు అని నమ్మకం ఉండేది. తర్వాత నాకు బయట సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాలు చేశాను. 1993 లో నాకు అవకాశాలు తగ్గిపోయినప్పుడు ఆయన దగ్గరకు వెళ్లాను వెంటనే అవకాశం ఇచ్చారు. కానీ తర్వాత ఓ సినిమాలో చేయమని అడిగారు నాకు అప్పటికే కొన్ని ఆరోగ్యసమస్యలు ఉండడం వల్ల చేయలేకపోయాను. 

ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో చేశారు? మీ హైట్‌ వల్ల ఏ హీరో అయినా ఇబ్బంది పడ్డారా?
ప్రేమ: 100కు పైగా చిత్రాల్లో చేశాను. నా హైట్‌ వల్ల కొంతమంది హీరోలు ఇబ్బంది పడ్డారు. కానీ కెమెరా ట్రిక్స్‌ ఉపయోగించి షూటింగ్‌ చేసేవారు. నేను నటించిన అన్ని సినిమాల్లో నాకు నచ్చిన పాట.. చిరునవ్వుతో సినిమాలో ‘సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా..’ పాట చాలా ఇష్టం. చాలా అర్థం ఉంటుంది ఆ పాటలో. కోడి రామకృష్ణగారి వల్ల నేను తెలుగు నేర్చుకున్నాను. ఆయన సినిమాల్లో నాకు పెద్ద పెద్ద డైలాగ్స్‌ ఉండేవి. వాటి కోసం నేర్చుకున్నా. 

మోహన్‌బాబుతో చేయడం ఎలా అనిపించింది. వెంకటేష్‌ పక్కన అవకాశం ఎలా వచ్చింది?
ప్రేమ: ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలో మోహన్‌బాబుతో కలిసి నటించాను. చాలా భయం వేసింది. ఆ సినిమాలో కొన్ని సీన్స్‌ చూస్తే నా భయం నా ముఖంలో కనిపిస్తుంటుంది. వెంకటేష్ గారితో ధర్మచక్రం చేశాను. రామానాయుడు గారు నేను నటించిన ఓం సినిమా చూసి నాకు ధర్మచక్రంలో అవకాశం ఇచ్చారు. 

జగన్మోహిని సినిమా తీసేటప్పుడు అంత పెద్ద హిట్‌ అవుతుందని అనుకున్నారా?
నరసింహ రాజు: కచ్చితంగా ఆ సినిమా హిట్‌ అవుతుందని అనుకున్నాం. ఆ సినిమా కథ చాలా బాగుంటుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. అన్నిట్లో బాగా ఆడింది. తమిళంలో 100 రోజులకు పైగానే ఆడింది. ఇటీవల తీసిన ‘అనుకోని ప్రయాణం’ సినిమా కథ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లందరూ యంగ్‌స్టర్స్ చాలా కష్టపడి పనిచేశారు. కొత్త కాన్సెప్ట్‌. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా.  

మీరు సినిమాల్లోకి రాకముందు నుంచే బాగా రిచ్‌ అని విన్నాం.. నిజమేనా?
నరసింహ రాజు: బాగా కాదు కానీ పర్వాలేదు. మా నాన్న గారు కాస్త తగ్గించేశారు. నేను కూడా బాగా పోగొట్టాను. ఎవరైన వచ్చి డబ్బు కావాలని అడిగితే ఇచ్చేస్తా. రేపు వస్తుందిలే అనే ధైర్యంతో ఉన్నది ఖర్చుపెడతా. అది రాదు (నవ్వుతూ). 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని