Prabhas sreenu: ప్రభాస్‌ రాజైతే.. నేను మంత్రినట...: ప్రభాస్‌ శ్రీను

కొన్ని వందల సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు తులసి, ప్రభాస్‌ శ్రీను. వీళ్లిద్దరూ కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమంలో కొన్ని విశేషాలు పంచుకున్నారు.

Published : 17 Nov 2022 09:57 IST

బాల నటిగా మొదలై.. హీరోయిన్‌గా, సహాయనటిగా తులసిది ఓ అద్భుతమైన నట ప్రస్థానం. కామెడీతోపాటు నెగెటివ్‌ పాత్రల నటుడిగా ప్రభాస్‌ శ్రీనుది ఓ వినూత్న సినీ ప్రయాణం. వారి సహజసిద్ధమైన నటనతో ఆడియన్స్‌ను అలరిస్తూ.. ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ టాలెంటెడ్‌ నటులిద్దరూ ఆలీతో కలిసి పంచుకున్న విషయాలెంటో చూద్దాం..

మీరిద్దరికి ఏ సినిమా  నుంచి పరిచయం?

తులసి: ఆ ‘డార్లింగ్‌’ వల్ల ఈ డార్లింగ్‌ దొరికాడు(సరదాగా).  డార్లింగ్‌ సినిమాలో కలిసి నటించాం. ఆ సినిమాలో శ్రీను చాలా బాగా నటించాడు. ఫైటింగ్‌ సన్నివేశాల్లో కూడా కామెడీ చేశాడు. వెంటనే తనకు ఫోన్‌ చేసి అభినందించాను. అప్పటి నుంచి మా ప్రయాణం అలాగే కొనసాగుతోంది.

ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించడం లేదేంటి? మీకు భక్తి ఎక్కువట నిజమేనా?

ప్రభాస్‌ శ్రీను: అలా ఏమి లేదు. కొవిడ్‌ వల్ల కొంచెం గ్యాప్‌ వచ్చింది అంతే. ప్రస్తుతం ప్రభాస్‌తో ఉంటున్నా. మంచి క్యారెక్టర్స్‌ వచ్చినప్పుడు చేస్తున్నాను. నాకు భక్తి చాలా ఎక్కువ. వినాయకుడి భక్తుడిని. చిన్నప్పటి నుంచి నాకు చదువుపై ఆసక్తి లేదు. నన్ను డాక్టర్‌ని చేయలన్నది మా నాన్న కల. నేను డాక్టర్‌ కాకుండా యాక్టర్‌ అయ్యానని ఆయనకు బాధలేదు. నా విజయాన్ని ఆయన ఎంజాయ్‌ చేస్తున్నారు.

ప్రభాస్‌తో పరిచయం ఎలా అయింది?

ప్రభాస్‌ శ్రీను: నేను సత్యానంద్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయినప్పుడు ప్రభాస్‌ కూడా ఉన్నారు. ఆయన బ్యాచ్‌లో మేము కో-ఆర్టిస్టులం. అలా ఏర్పడిన పరిచయం ఇప్పటి దాకా కొనసాగుతోంది. ఇప్పుడు ఆయనకు సహాయకుడిగా ఉంటున్నా.

సినీపరిశ్రలోకి అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యింది?

తులసి: నాకు 56 ఏళ్లు. నేను ఇండస్ట్రీకి వచ్చి 56 సంవత్సరాలైంది. నాకు 3 నెలలు ఉన్నప్పుడు నటించాను. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు డైలాగ్‌ చెప్పాను. ఇక అప్పటి నుంచి అలా కొనసాగుతూ పోతుంది ఈ జర్నీ. మా అమ్మకు సావిత్రిగారికి బెస్ట్‌ ఫ్రెండ్‌. నన్ను చూడడానికి ఒకసారి మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత రోజు షూటింగ్‌కు ఓ బాబు కావాల్సి వచ్చింది. వెంటనే సావిత్రి గారు నన్ను తీసుకుని వెళ్లారు. అలా మొదటిసారి ‘భార్య’ సినిమాలో నాకు 3నెలలు ఉన్నప్పుడు తెరపై కనిపించా. తెలుగులో 76 సినిమాలు చేశా. కన్నడలో 18, మలయాళంలో 36, హిందీలో ఒక సినిమా హీరోయిన్‌గా చేశాను.

ప్రభాస్‌ శ్రీను: నేను ఇప్పటివరకూ 300 సినిమాల్లో చేశాను. పెద్దసినిమానా, చిన్న సినిమానా అని చూడను. రోజు షూటింగ్‌కు వెళ్లాలి అంతే. రెమ్యునరేషన్‌ కూడా ఇంత ఇవ్వండి అని నేను ఎప్పుడూ డిమాండ్‌ చేయను. పనిపై శ్రద్ధతో చేయాలి. నేను ఓసారి పేజీ డైలాగ్‌ను సింగిల్‌టేక్‌లో చెప్పాను. అందరూ లేచి క్లాప్స్‌ కొట్టారు. 

నెగెటివ్‌ అనే పదం పలకడానికి కూడా ఇష్టపడవట ఎందుకు? మీ సాయి ఎలా ఉన్నాడు? ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు?

తులసి: మనం ఒక మాట మాట్లాడితే అది ఎక్కడకు వెళ్లినా తిరిగి మన దగ్గరకే వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు నేను పాజిటీవ్‌గానే మాట్లాడతాను. కార్తికేయ2 సినిమా ఫంక్షన్‌లో స్పీచ్‌ వల్ల నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. సాధ్యమైనంత వరకు నేను మంచిమాటలే మాట్లాడతాను. మా అబ్బాయి సాయి చాలా బాగున్నాడు. విక్రమ్‌ సినిమాకు హిందీలో డబ్బింగ్‌ చెప్పాడు. ప్రస్తుతం నేను జయం రవితో ఓ పాన్‌ ఇండియా సినిమాలో చేస్తున్నా. హిందీలో రెండు సినిమాలు చేస్తున్నా. 


మీరు దెయ్యమట నిజమేనా? చిన్నప్పుడే లెజెండరీ దర్శకుడికి సినిమాలకు సంబంధించిన సలహాలు ఇచ్చేవారటగా?

తులసి: ఇండస్ట్రీలో చాలా మంది నన్ను దెయ్యం అనే పిలుస్తారు. జయసుధ, మంజుల, శోభానాయుడు వీళ్లందరూ నన్ను ఆటపట్టిస్తుంటారు. ఆ సలహాల విషయమేమిటంటే.. దాసరి నారాయణరావుగారు చాలా నెమ్మదస్తులు. నన్ను చాలా మురిపెంగా చూసుకునే వారు. ఒకసారి పిలిచి ఒళ్లో కూర్చొబెట్టుకుని షాట్‌ చెప్పమన్నారు. చెప్పేశాను. 

జాతకాలు చెబుతారా?ఎవరో దర్శకుడికి జాతకం చెబితే.. మీరు చెప్పినట్లే జరిగిందట?

తులసి: నేను మనిషిని చూసి వాళ్ల గురించి కొంచెం అంచనా వేయగలను. ఎక్కువగా పాజిటీవ్‌ విషయాలనే చెబుతాను. కోడి రామకృష్ణ పెద్దమ్మాయికి జాతకం చెప్పాను. నేను చెప్పిందే జరిగిందని ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చింది. అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ అనుకుంటుంటాను. నాకు మంచి మాటలు చెప్పడానికి ఒకప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు నేను ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్నాను. నాకు తెలిసిందే అందరికీ చెబుతాను. మంచి విషయాలు చెప్పేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.  


  
మీ ఎడమ కన్ను దెబ్బకు, వెంకటేశ్వర స్వామికి ఏంటి సంబంధం?

తులసి: మేము శ్రీనివాస కల్యాణం అని ప్రోగ్రామ్స్‌ చేసేవాళ్లం . దానికోసం మేకప్‌ వేసుకుని అలానే ఇంటికి వచ్చి రెస్ట్‌ తీసుకుంటుంటే మా ఇంట్లో వాళ్లు బీరువా కదిలించారు. దాని తాళం నా కంటికి గుచ్చుకుంది. కుట్లుపడ్డాయి. అంతే తిరుపతికి రిహార్సల్స్‌కు వెళ్లాను. అక్కడ పెద్దపూజారి నా దగ్గరకు వచ్చి వెంకటేశ్వర స్వామికి కట్టిన వస్త్రాన్ని కంటి మీద పెట్టారు. నేను అప్పుడు నమ్మలేదు. తర్వాత డాక్టర్‌ దగ్గరకు వెళితే ‘నువ్వు అదృష్టవంతురాలివి.. కన్ను పోతుందనుకున్నాం. కానీ ఏమీ జరగలేదు’ అన్నాడు. ఆ వస్త్రం వల్లనే నాకు కన్ను ఉందని నేను ఇప్పటికీ అనుకుంటుంటా. 
  
మీరు జంతువులతో మాట్లాడతారట? మీది ప్రేమ వివాహమా?

ప్రభాస్‌ శ్రీను: ఇంట్లో ఎవరూ మాట్లాడకపోతే ఏం చేస్తాం(నవ్వుతూ). మా ఇంట్లో చేపలతొట్టి(అక్వేరియం) ఉంది. అందులో 6 చేపలు ఉన్నాయి. రాత్రి పూట వాటితో మాట్లాడుతూ ఉంటా. షూటింగ్‌లో జరిగిన విషయాలన్ని వాటికి చెబుతుంటా. మాది ప్రేమ వివాహమే. ముందు నేను ప్రేమించాను. తర్వాత మా ఆవిడ నన్ను ప్రేమించాల్సి వచ్చింది(నవ్వుతూ). 

నిన్ను మంత్రి అని పిలిచేది ఎవరు? ఫోన్‌లో ఏదోమాట మాట్లాడితే నీకు నచ్చదటగా ఏంటది?

ప్రభాస్‌ శ్రీను:  కృష్ణంరాజు గారు నన్ను మంత్రి అని పిలుస్తారు.  ప్రభాస్‌తో ఉంటాను కాబట్టి ఆయన రాజుగారు, నేను మంత్రిని.  ఎవరైనా ఫోన్‌చేసి ‘నేను వైజాగ్‌ నుంచి మాట్లాడుతున్నా, తూర్పు గోదావరి నుంచి మాట్లాడుతున్నా..’ ఇలా అంటే నాకు నచ్చదు. పేరేంటో చెప్పకుండా ఊరి పేరు చెబితే నాకు కోపం వస్తుంది. డ్యాన్స్‌ కూడా అంతే పాట పెట్టి వేయమంటే ఎంతసేపైనా వేస్తా. ఇలానే వేయాలి.. అలానే వేయాలి అంటే నాకు రాదు.

చిన్నప్పుడు దాదాగిరి చేసేవారా?

తులసి: దాదాగిరి ఏంటి..అన్ని గిరీలు చేశాను(నవ్వుతూ). కోపమెస్తే కొట్టేదాన్ని.   

ప్రభాస్‌ శ్రీను:  ఊర్లో సెకండ్‌ షో సినిమా చూడడానికి పక్క ఊరి వాళ్లు వచ్చేవాళ్లు. సైకిల్‌ మీద వెళ్లేవాళ్లని ఆపి డబ్బులు వసూలు చేసేవాడిని.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని