Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్‌

నరేశ్‌ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నరేశ్‌ పాల్గొని సందడి చేశారు.

Published : 13 Mar 2024 00:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంత విరామం అనంతరం అల్లరి నరేశ్‌ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్‌. మల్లి అంకం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మార్చి 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో టీజర్‌ విడుదల వేడుకను మంగళవారం నిర్వహించింది.

అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రానికి, ఈ కొత్త సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు. జీవితంలో స్థిరపడకుండా పెళ్లి చేసుకున్న యువకుడి కథతో నాటి చిత్రం రూపొందింది. లైఫ్‌లో సెటిల్‌ అయినా పెళ్లికాని యువకుడి స్టోరీతో ఈ కొత్త సినిమా తెరకెక్కింది. ‘నాంది’ మొదలుకుని నేను సీరియస్‌ చిత్రాలు ఎక్కువగా నటిస్తుండడంతో వింటేజ్‌ నరేశ్‌ని చూడాలనుందని చాలామంది అన్నారు. అలా వచ్చిందే ఈ చిత్రం. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, పేరడీ సన్నివేశాలు లేకుండా హెల్తీ కామెడీని అందించాలని మేం ముందే నిర్ణయించుకున్నాం. హీరోయిన్‌ ఫరియాకు మంచి కామెడీ టైమింగ్‌ ఉంది. జానీ లీవర్‌ కుమార్తె జామీ లీవర్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడిగా తొలి చిత్రమే అయినా మల్లి అంకం ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు’’ అని తెలిపారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

* సీరియస్‌ సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు కామెడీ మూవీస్‌ చేయాలనుకుంటున్నారా?

నరేశ్‌: గత మూడేళ్లలో నేను నటించిన సీరియస్‌ ఫిల్మ్స్‌ మూడే. కానీ, ప్రేక్షకులు ఎక్కువ చిత్రాల్లో నటించాననుకుంటున్నారు. ‘కితకితలు’ సినిమాని ఈ రోజుల్లో తెరకెక్కిస్తే బాడీ షేమింగ్‌ ప్రస్తావన తీసుకొస్తారు. రంగు, ఎత్తు, బరువు.. ఇలాంటి సెన్సెటివ్‌ అంశాల గురించి ఇప్పుడు మాట్లాడలేం. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా కామెడీ సృష్టించడం చాలా కష్టం. అలాంటి స్క్రిప్టులను ఎంపిక చేసుకోవడానికి సమయం పడుతుంది. అందుకే నా నుంచి వినోదాత్మక చిత్రాలు ఆలస్యంగా వస్తున్నాయి.

* విజయవంతమైన సినిమా టైటిల్‌ను మళ్లీ ఇప్పుడెందుకు పెట్టాలనిపించింది?

మల్లి: కథ డిమాండ్‌ మేరకే ఆ పేరు పెట్టాం.

నరేశ్‌: ఇతరులు అడిగే ప్రశ్నల వల్ల హీరో క్యారెక్టర్‌ విసిగిపోతుంది. అన్నింటికీ ఆ ఒక్కటీ అడక్కు అనేదే సమాధానం అవుతుంది. ఆ కోణంలో ఆలోచించి పేరు పెట్టాం తప్ప క్యాష్‌ చేసుకోవాలనే ఉద్దేశంతో కాదు.

* ఈ కొత్త కంటెంట్‌ నచ్చిందా? పాత సినిమాని రీమేక్‌ చేస్తే బాగుండనిపించిందా?

నరేశ్‌: ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘జంబలకిడి పంబ’ వంటి చిత్రాలను టచ్‌ చేయకూడదనేది నా అభిప్రాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని