Allu Arjun: పుష్ప-3... క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్‌

‘పుష్ప: ది రూల్‌’ సీక్వెల్‌పై అల్లు అర్జున్‌ స్పందించారు.  

Updated : 17 Feb 2024 15:24 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా, సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప: ది రూల్‌ (Pushpa:The Rule). ఆగస్టు 15న విడుదల కానుంది. గతంలో పుష్ప 3కు సీక్వెల్‌ రానుందనే వార్తలు వచ్చాయి. జర్మనీలో జరుగుతున్న బెర్లిన్‌ యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘పుష్ప: ది రైజ్‌’ను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్‌ సీక్వెల్‌పై స్పందించారు. 

‘‘విదేశాల్లోని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలనుకుంటున్నా. అక్కడి వారు ఎలాంటి సినిమాలు చూస్తారో, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. పార్ట్‌ 3కి అన్నీ అనుకూలంగా ఉంటే తీసే అవకాశాలున్నాయి. కథను కొనసాగించాలని అనుకుంటున్నాం. దీనిని తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే ఈ చిత్రంలో పాత్రలు వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటుంది. ముఖ్యంగా పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ల క్యారెక్టరైజేషన్‌, తెరపై వాటి ఎగ్జిక్యూషన్‌, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్‌ ఉంటాయి. ఈ సినిమా తర్వాత చాలా ఆసక్తికర ప్రాజెక్ట్‌లు వరుసలో ఉన్నాయి. ప్రతి సినిమా భారీదనంతో ఉంటుంది’’ అని వెల్లడించారు. 

మరోవైపు రష్మిక (Rashmika) ఓ ఇంటర్య్వూలో పుష్ప2 గురించి మాట్లాడారు. ‘‘పుష్ప 2 అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నా. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయని తెలుసు. మీ ఆలోచనలకు తగ్గట్టుగా చేయాలనే తపన మాలో ఉంది. పుష్ప ముగింపు లేని కథ, ఎలా అయినా దీనిని రూపొందించవచ్చు’’ అని అన్నారు. 

2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa: The Rise)కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’. ఈ చిత్రంలో నటనకుగానూ అల్లు అర్జున్‌ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని