Chiranjeevi: చరణ్‌, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌ చేయాలన్నది నా కల: చిరంజీవి

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్‌చరణ్‌, జాన్వీకపూర్‌ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు.

Published : 13 Apr 2024 09:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్‌చరణ్‌ (Ram Charan), జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. అది త్వరలోనే జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2024లో భాగంగా జరిగిన కార్యక్రమంలో రాజీవ్‌ మసంద్‌ అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాధానం ఇచ్చారు.

నాకు క్లాసికల్స్‌ ఇష్టం!

‘‘సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నప్పుడు నేనెప్పుడూ మెగాస్టార్‌ అవుతానని అనుకోలేదు. కానీ, మంచి స్థానంలో ఉంటానని అనుకున్నా. ఎందుకంటే నా ప్రతిభపై నమ్మకం ఉంది. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నా. దాని ఫలితమే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. నాకు మంచి పాత్రలు ఇచ్చిన దర్శకులకు ధన్యవాదాలు. అభిమానుల ప్రేమను కొలవలేను. నా అభిమానులు మాస్‌ సినిమాల్లో నన్ను చూడాలనుకునేవారు. నాకేమో క్లాసికల్‌ సినిమాలు చేయాలని ఉండేది. ‘ఖైదీ’ నాకు స్టార్‌ స్టేటస్‌ ఇచ్చింది. నన్ను చాలా పైకి తీసుకెళ్లింది. అందులోని యాక్షన్‌ సీన్స్‌, డ్యాన్స్‌లు, భావోద్వేగ సన్నివేశాలు మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘శుభలేఖ’లాంటి చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించారు.

అందుకే కమర్షియల్స్‌

‘‘ప్రేక్షకులు రెండు రకాల సినిమాలు చూడటానికి ఇష్టపడతారని అర్థమైంది. కె.బాలచందర్‌ దర్శకత్వంలో ‘రుద్రవీణ’ చేశాం. నాకు మంచి పేరు వచ్చింది. అయితే, ప్రొడ్యూసర్‌గా నా తమ్ముడికి లాభాలు రాలేదు. నేను బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, ప్రతీ దాన్నీ బ్యాలెన్స్‌ చేసుకోవాలి. అందుకే నిదానంగా కమర్షియల్‌ వైపు వెళ్లాల్సివచ్చింది.  ‘దంగల్‌’ లాంటి సినిమాలు చేయొచ్చుగా అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేవారు. కానీ, నిర్మాతలు సంతోషంగా ఉండలేరు. నేను చేసే కమర్షియల్‌ సినిమాలు చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు నేనూ ప్రతిరోజూ వ్యాయామం చేస్తా. ఏదైనా ఒకరోజు కుదరకపోతే ఆ రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. ఆహారపు అలవాట్ల విషయంలోనూ నియమాలు పాటిస్తా’’

ఇప్పుడు ఉన్నదంతా ఇండియన్‌ సినిమా!

‘‘షూటింగ్‌ ఉన్న రోజు నేను చాలా హుషారుగా ఉంటాను. లేకపోతే ఆ రోజంతా నిస్సారంగా ఉంటుంది. పని చేయడాన్ని ఇష్టపడతాను. అందుకే రోజూ పని చేయమని నా భార్య సలహా ఇస్తుంది. మెయిన్‌ క్యారెక్టర్‌ సెట్‌లో ఉంటే సినిమా బాగా వస్తుంది. నటీనటులు క్యార్వా‌న్‌లు ఎక్కువగా వాడకండి. సెట్‌లోనే ఉండండి. అప్పుడు దర్శకులు, టెక్నీషియన్ల కష్టం తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రెడిట్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళికి దక్కుతుంది. ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నదంతా ఇండియన్‌ సినిమా. రాజమౌళి, సుకుమార్‌, రిషబ్‌శెట్టి, అట్లీ, లోకేష్‌ కనగరాజ్‌ దక్షిణాది సినిమాకు మంచి పాపులారిటీ తెచ్చారు. నిర్మాతలు, దర్శకులు కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితం వస్తుంది’’

‘సైరా’ నష్టాలనే మిగిల్చింది!

‘‘చరణ్‌తో కలిసి జాన్వీ ఓ సినిమా చేస్తోంది. ఇటీవల ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కొంచె భావోద్వేగంగా అనిపించింది. శ్రీదేవి గుర్తుకువచ్చింది. ఇండస్ట్రీ మంచి నటిని కోల్పోయింది. ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ రెండో భాగంగా చరణ్‌, జాన్వీ నటిస్తే చూడాలని ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు, సినిమాలతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. మనం ఎదురుచూసే పాత్రలు ప్రతిసారీ రావు.  వాటంతట అవే స్వయంగా రావాలి. నాకు ఫ్రీడమ్‌ ఫైటర్‌గా చేయాలని ఉండేది. ‘సైరా’ చేశాను. ఆంధ్రప్రదేశ్‌లో యావరేజ్‌గా నిలిచింది. మిగిలినచోట్ల బాగానే ఆడింది. నాకు బాధ లేదు. ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాం. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే, ప్రొడ్యూసర్‌  జేబు ఖాళీ అవుతుంది. మంచి కంటెంట్‌ కోసం ఎదురుచూస్తున్నా. నాకు ఎలాంటి అంచనాలు లేవు. యువ దర్శకులకు నా గురించి, నేను ఏ సినిమాలో, ఏ స్టైల్‌లో నటిస్తే బాగుంటుందో వాళ్లకు తెలుసు’’

అభిమానులు దర్శకులైతే..

‘‘కొన్ని రోజుల కిందట రజనీకాంత్‌ నాతో ఒక మాట చెప్పారు. ‘మనం పని చేయాలనుకున్న లెజండరీ దర్శకులంతా ఇప్పుడు లేరు. ఇప్పుడు అంతా కొత్త దర్శకులు ఉన్నారు. ఇలాంటప్పుడు మన అభిమానులు దర్శకులు అయితే, వారిపైనే ఆధారపడటమే. మనల్ని ఎలా చూపించాలో వాళ్లకు బాగా తెలుసు’ అన్నారు. బాబీతో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ చేశా. అభిమానులకు బాగా నచ్చింది. కమర్షియల్‌గానూ బాగా హిట్టయింది. ఇప్పుడు ‘విశ్వంభర’ చేస్తున్నా.  వశిష్ట కూడా నాకు పెద్ద అభిమాని. వాళ్లు కచ్చితంగా మంచి అవుట్‌పుట్‌ ఇస్తారు.

ఆ సంతృప్తి చాలు

‘మీకు అవకాశం వస్తే ఎలాంటి సినిమాలో నటిస్తార’ని అడగ్గా.. ‘‘మీరు అక్కడ కూర్చొన్న వ్యక్తి (తేజ సజ్జను చూపిస్తూ..)ని చూశారా.? అతను హను-మాన్‌’ చేశాడు.  25 ఏళ్ల కిందట బాలనటుడిగా తను కెరీర్‌ను ప్రారంభించాడు. నాతోనూ సినిమాలు చేశాడు. ‘ఇంద్ర’లోనూ నటించాడు. తనకు ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. నన్ను చాలా ఇష్టపడేవాడు. నా సినిమా చూసి ఇన్‌స్పైర్‌ అయ్యేవాడు. అలాగే తను పెరిగి పెద్దవాడయ్యాడు.  ఇప్పుడు ‘హను-మాన్‌’ మూవీ చేశాడు. అదే పేరుతో నేను ఒక సినిమా చేయాలని ఎప్పుడో అనుకున్నా. కానీ, అతను ఈ సినిమా చేశాక నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఎందుకంటే నేను తనని వేరుగా చూడటం లేదు. అతను నా ప్రయాణంలో ఒక భాగం. తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు యావత్‌ భారతదేశం అతడి నటనను మెచ్చుకుంటోంది’’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు