Chiranjeevi: ఆ మాటలతోనే స్టార్‌నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్‌లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి

కెరీర్‌ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi).  

Updated : 01 Apr 2024 12:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు డిజిటల్‌ మీడియా ఫెడరేషన్‌ వేడుకలు హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం జరిగాయి. ఈ కార్యక్రమంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi), నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయ్‌ దేవరకొండ.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. కెరీర్‌, విమర్శలు, కుటుంబం గురించి పలు ప్రశ్నలు అడిగారు.

ఈ స్థాయికి వస్తారని, పద్మభూషణ్‌ అందుకుంటారని ఎప్పుడైనా ఊహించారా?

చిరంజీవి: ఈ స్థాయికి రావాలని కలులు కన్నాను. అది ఒక్కరోజులో మొదలైంది కాదు. స్కూల్‌, కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవాడిని. అప్పట్లో బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు అందుకున్న రోజులు ఉన్నాయి. తోటి విద్యార్థులు నాపై ప్రశంసలు కురిపించేవారు. వారి మాటలు విని నేనెంతో గర్వపడేవాడిని. నటుడిగా మారాలనే బీజం అప్పుడు పడింది. సెలబ్రిటీ అయితే అందరూ మనల్నే చూస్తారని అర్థమైంది. దాని కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు అడుగులు వేశా.

సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు ఇంట్లోవాళ్లు ఎలా ఫీలయ్యారు?

చిరంజీవి: నా అదృష్టం కొద్దీ మా నాన్న గారికి సినిమా రంగం అంటే ఇష్టం. నా నిర్ణయం ఆయనకు నచ్చింది.. కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని కాస్త సందేహించారు. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడంతోపాటు ఐసీఏడబ్ల్యూ చేయమన్నారు. ఆయన కోసం నైట్‌ కాలేజీలో చేరా. ఆరు నెలలు చదువు పక్కనపెట్టేసి.. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ కొనసాగించా. అక్కడ ఉన్నప్పుడే మొదటి ఛాన్స్‌ వచ్చింది. ఆ వెంటనే వరుస అవకాశాలొచ్చాయి. ఫొటోలతో ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పరిస్థితి మాత్రం భగవంతుడు నాకు కల్పించలేదని గర్వంగా చెప్పగలను.

మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది?

చిరంజీవి: ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు నా స్నేహితుడు సుధాకర్‌కు భారతీరాజా చిత్రంలో మంచి అవకాశం వచ్చింది. అదే సమయంలో వాడికి ‘పునాదిరాళ్లు’లోనూ ఆఫర్‌ వచ్చింది. ఇందులో యాక్ట్‌ చేస్తే.. తన చిత్రంలో ఛాన్స్‌ ఇవ్వనని భారతీ రాజా చెప్పడంతో సుధాకర్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. ‘పునాదిరాళ్లు’ టీమ్‌తో మాట్లాడి నో చెప్పడానికి నన్ను కూడా వెంట తీసుకువెళ్లాడు. వాళ్లతో మాట్లాడి వచ్చేస్తుంటే.. ‘‘సరే.. నువ్వు యాక్ట్‌ చెయ్‌. మాకు ఎవరూ దొరకడం లేదు’’ అని నన్ను అడిగారు. ఇంటికి కూడా వచ్చేశారు. నా పేరు మార్చుకుని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చా. అది చేస్తున్న సమయంలోనే నా నటన చూసి ‘ప్రాణం ఖరీదు’లో అవకాశం ఇచ్చారు.

కెరీర్‌లో మీరు ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి?

చిరంజీవి: జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టనష్టాలు, ఎత్తుపల్లాలు, సవాళ్లు ఉంటాయి. అవన్నీ తట్టుకుని నేనూ ఇక్కడికి వచ్చిన వాడినే. ‘న్యాయం కావాలి’ సెట్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన నన్నెంతో మార్చింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత శారద రీఎంట్రీ ఇచ్చారు. చిత్రీకరణలో భాగంగా అందరూ పొజిషన్స్‌లో నిల్చొన్నారు. క్రాంతికుమార్‌ కెమెరా ఆపరేట్‌ చేస్తున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చెప్పడంతో నేను కూడా పొజిషన్‌లో నిల్చొన్నా. దీంతో క్రాంతికుమార్‌ నాపై కేకలు వేశారు. ‘‘పిలిస్తే గానీ రారా? వచ్చి ఇక్కడ పడి ఉండలేరా? సూపర్‌స్టార్‌ అనుకుంటున్నారా?’’ అని అందరి ముందు నన్ను తిట్టారు. చాలా బాధగా అనిపించింది. ఆరోజు భోజనం చేయలేదు. ఆయన మాటలు నా మనసుని తాకాయి. సూపర్‌స్టార్‌ అయ్యి చూపించాలనుకున్నా. అవమానాలను కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నా. ఈస్థాయికి వచ్చా.

మీరెప్పుడైనా ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారా? వాటిని ఎలా అధిగమించారు? 

చిరంజీవి: కెరీర్‌లో తొలి అడుగులు వేసే సమయంలో.. ‘‘మనం రాణించగలమా? లేదా’’ అని బిక్కుబిక్కుమని ఉంటాం. అలాంటి సమయంలో సానుకూల వాతావరణం ఉన్న చోటే ఉండాలి. సినిమాల్లోకి నేనింకా రాలేదు. మద్రాస్‌లో ఉన్నప్పుడు స్నేహితుడితో కలిసి పాండిబజార్‌ వెళ్లా. అక్కడి వాళ్లు నన్ను చూసి.. ‘‘ఏంటి సినిమాల్లో చేయడానికి వచ్చావా? హీరోగా చేస్తావా?’’ అని హేళన చేశారు. వాళ్ల మాటలు విని ఎంతో బాధపడ్డా. ఆ సంఘటన తర్వాత నేను మళ్లీ అక్కడికి వెళ్లలేదు. నెగెటివిటీ ఉన్న చోటకు వెళ్తే మనం మరింత కుంగుబాటుకు గురి అవుతాం.

మీ ‘ఫ్యామిలీ స్టార్‌’ ఎవరు?

చిరంజీవి: మా నాన్న. ఒక కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనే దాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా. మా అమ్మకు ఐదుగురు చెల్లెళ్లు. మా తాతయ్య చనిపోయాక.. నాన్నే వారి బాధ్యత తీసుకుని వచ్చిన జీతంలోనే వారికి పెళ్లిళ్లు చేశారు. మా కుటుంబంలో ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా.. పలు సందర్భాల్లో అందరూ ఒకచోట కలిసేలా నేనూ సురేఖ ప్లాన్‌ చేస్తుంటాం. అలా కలవడం వల్ల మనలో ఉండే చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయనిపిస్తుంది.

ఎలాంటి చిత్రాలు చూడటానికి ఇష్టపడుతుంటారు?

చిరంజీవి: చెబితే నవ్వుతారు. ‘మిక్కీ హౌస్‌’ కామిక్‌ చిత్రాలు చూస్తా. జాకీ చాన్‌ చిత్రాలు, మనసుకి ఆహ్లాదంగా అనిపించే చిత్రాలే చూస్తా.

మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పటికీ నాకు షాంపూ అయిపోతే నీళ్లు పోసి వాడే అలవాటు ఉంది. అలా, మీకు కూడా అలవాట్లు ఉన్నాయా? 

చిరంజీవి: మావాళ్లు ఇంట్లో లైట్స్‌ అని ఆన్‌ చేసి వెళ్లిపోతుంటారు. నేనే వాటిని ఆఫ్‌ చేస్తుంటా. గీజర్‌ ఆన్‌ చేస్తారు.. మర్చిపోతారు. వీటన్నింటికి సంబంధించి నా ఫోన్‌లో యాప్‌ పెట్టుకున్నా. చరణ్‌ ఉదయాన్నే బ్యాంకాక్‌ వెళ్లాడు. తన ఫ్లోర్‌లో లైట్స్‌ అన్ని ఆన్‌లో ఉన్నాయి. వాటన్నింటినీ ఆఫ్‌ చేశా. దీన్నే మధ్యతరగతి మెంటాలిటీ అంటారు. ఇది అవసరం. షాంపూ అయిపోతే ఆ బాటిల్‌లో నీళ్లు పోసి వాడుతుంటా. సోప్‌ చివరకు వచ్చాక.. చిన్న చిన్న ముక్కలన్నింటినీ కలిపి వాడుతుంటా. పొదుపు చేయడం అవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని