Shilpa: ఆఫ్‌ స్క్రీన్‌లో సౌందర్యని చూస్తే ఆశ్చర్యపోతారు..: శిల్ప

ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, తొలి తెలుగు సీరియల్‌ నటి శిల్ప ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన అనుభవాలను పంచుకున్నారు.

Updated : 07 Jan 2024 19:18 IST

తొలి తెలుగు టెలివిజన్‌ కథానాయిక, ఎన్నో సినిమాల్లో నటించిన చక్కటి నటి, వందల చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పి పదికి పైగా నంది అవార్డులను సొంతం చేసుకున్నారు శిల్ప. తెలుగు సినిమాలో డబ్బింగ్‌ అనేది ఒక గ్రంథమైతే.. అందులో బంగారు అక్షరాలతో లిఖించగలిగిన పేజీ ఆమె సొంతం. ఆమె ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. తన అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆమె చెప్పిన విశేషాలు మీకోసం..

తొలి తెలుగు టీవీ సీరియల్‌లో నటించడం ఎలా అనిపించింది?

శిల్ప: నా అసలు పేరు మైత్రేయి. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే. నేను నటించిన తొలి సీరియల్‌ ‘అనగనగా ఒక శోభ’. అది దూరదర్శన్‌లో టెలికాస్ట్‌ అయి గతేడాది అక్టోబర్‌కు 37 ఏళ్లు పూర్తయింది. అందులో హీరోగా ప్రదీప్‌ను ఎంపిక చేశారు. హీరోయిన్ కోసం 26 మంది అమ్మాయిలకు ఆడిషన్స్‌ నిర్వహించి నన్ను ఓకే చేశారు. ఆ సమయంలో నాకు చీరకట్టుకోవడం కూడా తెలియదు. ఇంట్లో అమ్మ ప్రోత్సహించారు. కానీ, నాన్న ఆడిషన్స్‌కు వెళ్లడానికి అంగీకరించలేదు. ‘నేను సెలక్ట్‌ కాకపోతే మీరు చెప్పింది వింటా.. ఈ రంగంవైపు చూడను’ అని నాన్నకు చెప్పి ఆడిషన్స్‌కు వచ్చా. వాళ్లు ఓకే చేశారు. అలా అందులో అవకాశం వచ్చింది. 

‘అనగనగా ఒక శోభ’ సీరియల్‌ గురించి చెప్పండి?

శిల్ప: హిందీలో ‘రజనీ’ అనే సీరియల్‌ను తెలుగులో ‘అనగనగా ఒక శోభ’ పేరుతో తీశారు. దూరదర్శన్‌లో 13వారాలు టెలికాస్ట్‌ అయింది. పద్మనాభం గారు నా తండ్రి పాత్ర వేశారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం దీనికి సంభాషణలు రాశారు. 

మైత్రేయి..శిల్పగా ఎలా మారారు? మీరు చేసిన రెండో సీరియల్‌ ఏది?

శిల్ప: మైత్రేయి.. అని పిలవడం కష్టంగా ఉంటుందన్నారు. ఆరోజుల్లో ‘ఎస్‌’ అక్షరంతో పేరు ఉంటే కెరీర్‌ చాలా బాగుంటుందని సెంటిమెంట్ ఉంది. అందుకే శిల్ప అని మార్చారు. ‘అనగనగా ఒక శోభ’ చివరి మూడు ఎపిసోడ్‌లు ఉందనగా నాకు రెండో సీరియల్‌ ‘బుచ్చిబాబు’లో అవకాశం వచ్చింది.

టెలివిజన్‌ నుంచి సినిమా రంగానికి ఎలా వెళ్లారు?

శిల్ప: సినిమాలు అంటే మా నాన్న అసలు అంగీకరించరని నాకు తెలుసు. అందుకే ఆ ఆలోచన కూడా రాలేదు. సీరియల్స్‌లో నా నటన మెచ్చి జంధ్యాల, కె.విశ్వనాథ్‌ లాంటి గొప్ప దర్శకులు సినిమాల్లో అవకాశమిచ్చారు. అలా నా దగ్గరకు వచ్చిన వాటిలో నటించాను. నేనెప్పుడూ సినిమాల్లో అవకాశం ఇవ్వమని అడగలేదు. సీరియల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చా.

హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో చేయాలని అనిపించలేదా?

శిల్ప: ఎప్పుడూ అనుకోలేదు. నాకు చేతినిండా సీరియల్స్‌ ఉండేవి. పైగా హీరోయిన్‌గా చేయాలంటే వేరే ప్రాంతాలకు వెళ్లాలి. నాకు అలా వెళ్లడం కుదరదు. అందుకే ఆసక్తి చూపించలేదు. నాకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘ఆపద్బాంధవుడు’. అందులో నేను నటించడమే కాకుండా.. ఇద్దరికి డబ్బింగ్‌ చెప్పా. 

సీరియల్స్‌, సినిమాల్లో చేస్తూనే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కావాలనే ఆలోచన ఎలా వచ్చింది?

శిల్ప: నాకు నటిగా కంటే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎక్కువ పేరు వస్తుందని జీవితంలో అనుకోలేదు. డబ్బింగ్‌ చెప్పాలని మా నాన్నే నన్ను ప్రోత్సాహించారు. ‘అమ్మ’ సినిమాలో కావ్యకు మొదట చెప్పాను. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఒక్కోరోజు మూడు సినిమాలకు డబ్బింగ్‌ చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. సింగిల్‌ టేక్‌లో చెప్పేస్తాను.  

ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు?

శిల్ప: వెయ్యి సినిమాల వరకు రికార్డు రాసుకున్నాను. ఆ తర్వాత రిజిస్టర్‌ పోయింది. 12 నంది అవార్డులు వచ్చాయి. ‘పెళ్లి చూపులు’ అనే సీరియల్‌లో ఒక్క ఎపిసోడ్‌ చేశా. దానికే నంది రావడం సంతోషాన్నిచ్చింది. నటిగా కంటే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానే ఎక్కువ నంది అవార్డులు వచ్చాయి.

సౌందర్య(Soundarya) పట్టుబట్టి మీతో డబ్బింగ్‌ చెప్పించుకునే వారట నిజమేనా?

శిల్ప: నా కెరీర్‌లో ఎక్కువ సౌందర్య సినిమాలకే డబ్బింగ్ చెప్పా. నేను ఆవిడను కలిసింది మూడుసార్లే. వాళ్ల నాన్నగారితో ఎక్కువ పరిచయం. ఆవిడ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో ఆయన స్టూడియోకు వచ్చి మాట్లాడేవారు. నా గొంతు వినిపిస్తే.. సౌందర్య వచ్చారా అనుకునే వారు.

‘అరుంధతి’ సినిమాకు డబ్బింగ్‌ చెప్పాక ఏమనిపించింది?

శిల్ప: ‘అరుంధతి’ (Arundhati)నాకెంతో పేరు తెచ్చింది. జేజమ్మ పాత్రకు డబ్బింగ్‌ చెప్పా. ఎక్కడికైనా వెళ్తే అందులోని డైలాగులు అడిగి చెప్పించుకునేవారు. ఆ సినిమాకు నంది అవార్డు వస్తుందని నేను ఆశపడ్డాను. కానీ, రాలేదు. 

డబ్బింగ్‌లో సవాలుగా అనిపించిన పాత్ర ఏది?

శిల్ప: ‘స్వరాభిషేకం’ అనే సినిమాలో విశ్వనాథ్‌ గారి భార్యగా ఊర్వశి నటించారు. ఆమె పాత్రకు డబ్బింగ్‌ చెప్పాలన్నారు. నేను వణికిపోయాను. ఊర్వశికి చెప్పొచ్చుగానీ.. విశ్వనాథ్‌గారి భార్య పాత్రకు చెప్పాలనే సరికి భయం వేసింది. అలాగే ‘వీడే’ సినిమాలో విలన్‌ పాత్రకు, ‘క్షేత్రం’లో ప్రియమణికి చెప్పినప్పుడు కష్టంగా అనిపించింది.చూడాలని ఉంది’కు డబ్బింగ్‌ చెప్పాలని పిలిచారు. సౌందర్య, అంజలా ఝవేరీ ఇద్దరుంటారు. నేను అంజలా ఝవేరీకి చెప్పాలన్నారు. ఎందుకని ఆరా తీస్తే.. హిందీ హీరోయిన్స్‌కు లిప్‌సింక్‌ బాగా చేస్తానని దర్శకనిర్మాతలు అనుకున్నారని తెలిసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది నార్త్‌ హీరోయిన్స్‌కు డబ్బింగ్‌ చెప్పా.

ఏ హీరోయిన్‌కు డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఎంజాయ్‌ చేశారు?

శిల్ప: సౌందర్య. ఆమె నటించిన చాలా సినిమాలు డబ్బింగ్‌ చెప్పాను. ఆవిడ ఆఫ్‌ స్క్రీన్‌లో చాలా తక్కువ మాట్లాడతారు. ఆమెను చూసిన వారు తెరపై సరదాగా ఉండే సౌందర్య.. విడిగా ఇంత సైలెంట్‌గా ఉంటారా అని ఆశ్చర్యపోతారు.

డబ్బింగ్‌లో మీకు స్ఫూర్తి ఎవరు?

శిల్ప: సరిత, రోజారమణి వాళ్లతో కలిసి కొన్ని సినిమాలకు డబ్బింగ్‌ చెప్పా. అప్పుడు వాళ్లను చూసి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా. 

మీకు ఆధ్యాత్మికత ఎక్కువని విన్నాం.. ఎన్ని దేవాలయాలకు వెళ్లారు?

శిల్ప: భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ చూడాలని నాకు కోరిక. ఇప్పటికి చాలా చూశాను. కొంచెం సమయం దొరికినా నేను గుడికి వెళ్తాను. హిమాలయాలకు దగ్గరగా ఉన్న గుడులన్నీ చూసేశాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు