Venkatesh:‘సైంధవ్‌’ తర్వాత ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి: వెంకటేశ్‌

‘సైంధవ్’ సినిమా విడుదల సందర్భంగా వెంకటేశ్ విలేకర్లతో ముచ్చటించారు.

Updated : 11 Jan 2024 18:59 IST

శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన వెంకటేశ్‌ 75వ చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వెంకటేశ్ (Venkatesh) విలేకర్లతో ముచ్చటించారు. ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.

75వ సినిమా కదా ఒత్తిడిగా భావించారా?
వెంకటేశ్: ఒత్తిడి ఏమీ లేదు. 75 అనేది నంబర్ మాత్రమే. కెరీర్‌లో 50, 75, 100 నంబర్లు సహజంగానే ఒక మైల్ స్టోన్‌లా అనుకోవచ్చు.  నాకు ప్రతి సినిమా ప్రత్యేకమే. కష్టపడి పని చేయాలి. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.

‘సైంధవ్’లో మీకు నచ్చిన అంశం ఏమిటి ? 
వెంకటేశ్: తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌. రెగ్యులర్‌గా కాకుండా కథకు అవసరమయ్యే ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. యాక్షన్ చాలా సహజంగా ఉంది. ఇది నాకు ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అవుతుందనిపించింది. దర్శకుడు శైలేశ్‌ కొలనుతో పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది.

బేబీ సారా నటన ఎలా అనిపించింది ? 
వెంకటేశ్: పిల్లలతో కలసి పని చేయడం నాకు చాలా ఇష్టం. బేబీ సారా చాలా చురుగ్గా ఉంటుంది. అద్భుతంగా నటించింది.

‘సైంధవ్’ కథకు సంబంధించి మీరేమైనా సూచనలు చేశారా ? 
వెంకటేశ్: దర్శకుడు శైలేశ్‌ మంచి కథతో వచ్చారు. ఒకసారి ప్రాజెక్ట్‌ మొదలుపెట్టాక.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా టీంతో కలిసిపోతాను. సాధారణమైన చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. ఎక్కడైనా మెరుగుపరిచే అవకాశం ఉందనిపిస్తే చెబుతాను.

ఈ సినిమా క్లైమాక్స్‌ గురించి చెప్పండి? 
వెంకటేశ్: ‘సైంధవ్’ చాలా మంచి కథ. కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్‌ సినిమాకే హైలైట్‌. భావోద్వేగంతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా చాలా బాగా డిజైన్ చేశారు.

ప్రచారంలో భాగంగా స్టేజ్ పై డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది?
వెంకటేశ్: నాకు సహజంగానే సౌండ్ వింటే కాళ్ళు ఆడుతాయి. ‘వాసు’లో పాట వినేసరికి అలా వచ్చేసింది. ఆ బీట్ అలాంటిది (నవ్వుతూ).

‘సైంధవ్’ పాత్రలో మీ ‘ధర్మచక్రం’ పోలికలు ఉన్నాయా ? 
వెంకటేశ్: లేదు. రెండూ పూర్తి భిన్నమైనవి. ‘సైంధవ్’ తర్వాత ఈ తరహాలో ఇంకొన్ని కథలు వచ్చే అవకాశం ఉంది.

నవాజుద్దీన్ సిద్ధిఖీతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? 
వెంకటేశ్: నవాజుద్దీన్ సిద్ధిఖీతో పని చేయడం చాలా మంచి అనుభూతి. మంచి నటుడు.  ఆయన సినీ ప్రయాణం చాలా విలక్షణంగా సాగుతోంది. ‘సైంధవ్’లో అద్భుతంగా నటించారు. ఇందులో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

‘సైంధవ్’లో మ్యూజిక్ గురించి చెప్పండి?
వెంకటేశ్: సంతోష్ నారాయణ్ మంచి సంగీతాన్ని అందించారు. నేపథ్య సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది.  పాటలు అద్భుతంగా వచ్చాయి. లిరిక్స్ కూడా చాలా చక్కగా కుదిరాయి.

75 సినిమాల కెరీర్‌లో ఒక్క వివాదం కూడా లేకుండా మీ ప్రయాణం సాగడం ఎలా సాధ్యమైంది? 
వెంకటేశ్: అది ఎలా అని తెలుసుంటే అందరికీ చెప్పేవాడిని (నవ్వుతూ). నిజంగా నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఎవరికీ అసౌకర్యం కలిగించకూడదనే మనస్తత్వం నాది. స్కూల్, కాలేజీలో కూడా ఇలానే ఉండేవాడిని.

నానితో సినిమా చేస్తున్నారని విన్నాం నిజమేనా?
వెంకటేశ్: చేద్దాం. అన్నీ చేసేద్దాం (నవ్వుతూ).

‘స్వామి వివేకానంద’ సినిమా గురించి ? 
వెంకటేశ్: ఆ స్క్రిప్ట్ ఒక లెవల్ వరకు వచ్చింది. ఇద్దరు మేకర్స్ చేస్తున్నారు. స్క్రిప్ట్ పై ఇంకా వర్క్‌ జరగాల్సి ఉంది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీక్వెల్ చేసే ఆలోచన ఉందా ?
వెంకటేశ్: ఈ మధ్య ఫ్యాన్ మేడ్ పోస్టర్ చూశా. చాలా బాగుంది.

తర్వాతి సినిమా గురించి ? 
వెంకటేశ్: కొన్ని కథలు విన్నాను. ఇంకా ఏదీ అంగీకరించలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని