Siva Nageswararao: అప్పుడు నాగార్జున, అమల నాపై కోప్పడ్డారు..: శివనాగేశ్వరరావు
ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు (Siva Nageswararao) ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఆయన సినిమాలకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.
కామెడీ సినిమాలకు ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు శివనాగేశ్వరరావు (Siva Nageswararao). ఆయన ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi) కార్యక్రమానికి అతిథిగా వచ్చి తన సినీ ప్రయాణ విశేషాలను పంచుకున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా ‘దోచేవారెవరురా’ (Dochevaarevarura) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఐడియా ఎలా వచ్చింది?
శివనాగేశ్వరరావు: అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలుగా ఈ సినిమా తీశాను. ఇందులో అజయ్ ఘోష్ డబుల్ యాక్షన్. బిత్తిరి సత్తి ఓ ప్రొఫెషనల్ కిల్లర్. ఈ సినిమా ఆడియో రిలీజ్‌లో సుకుమార్ మాట్లాడుతూ.. నాకు అభిమాని అని అన్నారు. ఆ మాట చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా యూట్యూబ్ ఛానల్‌లో ప్రతి వీడియో చూస్తానని సుకుమార్ అనడం ఎప్పటికీ మర్చిపోలేను.
మీ బాల్యం గురించి చెప్పండి.. సినిమాల మీద ఆసక్తి ఎప్పుడు కలిగింది?
శివనాగేశ్వరరావు: మాది గుంటూరు దగ్గర ఉప్పలపాడు గ్రామం. మేము ఐదుగురం. డిగ్రీ హిందూ కాలేజీలో చేశాను. అక్కడి నుంచి చెన్నై వెళ్లిపోయాను. చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం. చాలా నాటకాలు వేశాను. నాటకాల కోసం 25 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లే వాడిని. నేను ఇంటర్ చదువుతున్నప్పుడే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. కొత్తగా సినిమాలు తీయాలి అనుకున్నాను. డిగ్రీ తర్వాత వ్యాపారాలు చేశాను కానీ, అన్ని నష్టాలు వచ్చాయి. ఏది చేస్తున్నా దృష్టంతా సినిమాలపైనే ఉండేది. ఇంట్లో చెప్పకుండా లారీ ఎక్కి చెన్నై వెళ్లిపోయా. ఆరు నెలల తర్వాత ఇంట్లో వాళ్లకు లేఖ రాశాను.
మొదట ఎవరి దగ్గర ఉద్యోగం చేశారు? రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎలా చేరారు?
శివనాగేశ్వరరావు: నేను మొదట కృష్ట గారు హీరోగా తెరకెక్కిన ‘అమ్మాయి మొగుడు- మామకు యముడు’ సినిమాకు పనిచేశాను. దానికి డబ్బులు ఇవ్వలేదు. కానీ పని మాత్రం బాగా నేర్చుకున్నా. అలా కొన్ని సినిమాలకు పనిచేయడంతో అనుభవం వచ్చింది. అప్పుడు రామ్ గోపాల్ వర్మ పిలిచి అవకాశం ఇచ్చారు. అలా ‘శివ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను.
‘మనీ’ కాన్సెప్ట్‌తో కామెడీ థ్రిల్లర్ తీయాలని ఎందుకు అనిపించింది?
శివనాగేశ్వరరావు: ‘మనీ’ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. అలా ట్రెండ్ సెట్ చేయాలని ప్రయత్నపూర్వకంగా సినిమా తీస్తే అది సక్సెస్ అవుతుందో లేదో చెప్పలేం. మనపని మనం చేస్తూ ఉండాలి. అది ప్రేక్షకులకు నచ్చితే హిట్ అవుతుంది. బాగా నచ్చితే ట్రెండ్ సెట్ చేస్తుంది. మొదట ఆ సినిమాను కొనడానికి ఎవరూ ముందుకురాలేదు. విడుదలయ్యాక సూపర్ సక్సెస్ అయింది. నేను, జేడీ చక్రవర్తి మంచి స్నేహితులం. తనతో నేను రెండు సినిమాలు తీశాను.
జంధ్యాల గారు లాంటి వాళ్లు ఉన్నప్పుడే మీరు ఇండస్ట్రీకి వచ్చి కామెడీ సినిమాలు తీశారు. ఎలా ధైర్యం చెయ్యగలిగారు?
శివనాగేశ్వరరావు: నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే జంధ్యాల గారు, ఈవీవీ గారు.. ఇలా కామెడీ సినిమాలు తీసే వాళ్లు చాలామంది ఉన్నారు. నేను తీసిన ‘మనీ’ సినిమా హిట్ అవ్వడంతో నాకు గుర్తింపు వచ్చింది. సీ ఎస్ రావుగారు, విజయనిర్మల గారు, మధుసూదనరావు గారు వీళ్ల నుంచి చాలా నేర్చుకున్నాను.
‘మనీ’ సినిమా తీశాక వెంటనే ‘మనీ మనీ’ తీశారు.. ఆ సినిమా మీకు తృప్తినిచ్చిందా?
శివనాగేశ్వరరావు: ‘మనీ మనీ’ సినిమా నేను తియ్యలేదు. కానీ నా పేరు ఉంటుంది. ‘మనీ’ సినిమా హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే నేను వేరే సినిమాకు అడ్వాన్స్ తీసుకొన్నాను. దీంతో రామ్ గోపాల్ వర్మ వేరే దర్శకుడితో ‘మనీ మనీ’ తీయించారు. కానీ పేరు మాత్రం నాది పెట్టారు. నా సినిమా టైటిల్స్ చాలా విభిన్నంగా ఉంటాయి. అన్నిటికంటే ముందే నేను టైటిల్ అనుకుంటాను. 90 శాతం అదే ఫైనల్ అవుతుంది. ఒక్కోసారి కథ రాసే క్రమంలో వేరే టైటిల్ అయితే బాగుంటుందనుకుంటే మారుస్తాను.
‘రమణ’ అనే ఓ సినిమా తీశారు కదా.. ఆ సినిమా ఎలాంటి అనుభూతినిచ్చింది?
శివనాగేశ్వరరావు: ఆ సినిమాకు వేరే హీరో అయితే ఇంకా మంచి హిట్ అయ్యేదనిపించింది. అందులోని కొన్ని పాత్రలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దానిలో గుండుసూది శ్రీను అని బ్రహ్మానందం పాత్ర బాగా ఫేమస్ అయింది.
‘మనీ’ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ఎలా అనిపించింది?
శివనాగేశ్వరరావు: థియేటర్‌లో ప్రేక్షకుడు సినిమా చూస్తున్నప్పుడు పాట రాగానే బయటకు వెళ్లి సిగరెట్ తాగి వద్దాం అని అనిపించకూడదు. ఈ పాట చూడాలి అనుకోవాలి. అందుకే సాహిత్యంలోనూ జాగ్రత్తలు తీసుకుంటా.
కొత్త వాళ్లతో.. తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి హిట్‌లు కొట్టారు.. దీనికి కారణాలు ఏంటి?
శివనాగేశ్వరరావు: నేను చేసిన ప్రయత్నం విజయమైంది. నాకు కొత్త వాళ్లను పరిచయం చేయడం ఇష్టం. సోనూసూద్‌ను నేను పరిచయం చేశాను. అలా చాలా మంది అర్టిస్టులను వెండితెరకు పరిచయం చేశా. అలాగే ‘హ్యాంట్సప్’ (Hands Up) సినిమాలో చిరంజీవి గారు స్పెషల్ రోల్ చేశారు. ఆ సినిమాకు జయసుధ గారు నిర్మాత. ఆవిడ చిరంజీవి (Chiranjeevi) గారిని అడిగారు. పాత్ర గురించి విన్న తర్వాత ఆయన ఓకే అన్నారు. నా సినిమాలో పెద్ద హీరోలు ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు.
‘సిసింద్రీ’ (Sisindri) సినిమా గురించి చెప్పండి?
శివనాగేశ్వరరావు: ఆ సినిమా మొదలుపెట్టినప్పుడు అఖిల్ వయసు 10 నెలలు. పూర్తయేటప్పటికీ 12నెలలు వచ్చాయి. ఆ సినిమాలో అఖిల్ (Akhil)ను అడగడం కోసం నాగార్జున వాళ్లింటికి వెళితే అమల గారు, నాగార్జునగారు ఇద్దరూ కోప్పడ్డారు. తర్వాత సినిమాకు సంబంధించిన క్యాసెట్ ఇచ్చి.. ఇది చూశాక మీ అభిప్రాయం చెప్పండి అని వచ్చేశా. ఆవిడకు కథ నచ్చి.. ఓకే అన్నారు. నాగార్జున గారు నిర్మాత కాకపోయి ఉంటే ఆ సినిమా విడుదలయ్యేది కాదు.
‘ధనలక్ష్మీ ఐ లవ్ యూ’ సినిమా ఎలాంటి లాభాన్ని తెచ్చింది?
శివనాగేశ్వరరావు: ‘ధనలక్ష్మీ ఐ లవ్ యూ’ హిందీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించాను. సినిమాలో నేను అనుకున్న తారాగణం వేరు. సినిమాలో ఉన్న వాళ్లు వేరు. నేను మొదట జేడీ చక్రవర్తి, శ్రీకాంత్, కోట శ్రీనివాసరావులతో తీద్దామనుకున్నా. కానీ కొన్ని కారణాల వల్ల మార్పులు చేయాల్సి వచ్చింది. నేను ‘ఫొటో’ అని ఓ సినిమా తీశాను. అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అది హర్రర్ సినిమా. దానికి ఆ పేరు కాకుండ వేరే పేరు అయితే ఆడేదేమో అనిపించింది. లవ్ స్టోరీలు, హర్రర్ జోనర్లకు సంబంధించిన సినిమాలు చాలా తక్కువ తీశాను. కామెడీ సినిమాలు చాలా తీశాను.
కథ రాసేటప్పుడు ఎలాంటి కసరత్తు చేస్తారు. నటీనటులు మీకెప్పుడైనా సలహాలు ఇచ్చారా?
శివనాగేశ్వరరావు: కొన్ని సందర్భాల్లో మనుషులను చూసి స్ఫూర్తి పొందుతాను. ఒక్కోసారి చిన్న వార్తతో కూడా కథ రాసుకుంటాను. దేన్నైనా చూసినప్పుడు నాకు వచ్చిన ఐడియాలను రాసుకుంటాను. సినిమా తీసేటప్పుడు నటీనటులు ఇచ్చే సలహాలను వందశాతం తీసుకుంటాను. మా నాన్న నేను తీసిన మొదటి సినిమా చూడాలని చాలా కోరుకున్నారు. కానీ ఆయన నా మొదటి సినిమా విడుదలవ్వక ముందే క్యాన్సర్ కారణంగా చనిపోయారు.
‘భూకైలాస్’, ‘నిన్ను కలిశాక’ ఈ రెండు సినిమాల తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ఎందుకు?
శివనాగేశ్వరరావు: నేను ఇప్పటి వరకు ఏ నిర్మాత దగ్గరకు వెళ్లి సినిమా తీస్తాను అని అడగలేదు. 2009లో ‘నిన్ను కలిశాక’ (Ninnu Kalisaka) చేశాను. ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత 2015లో ‘భూకైలాస్’ తీశాను. ఇప్పుడు ‘దోచేవారెవరురా’ తీశాను. మధ్యలో ఓ సినిమా తీశా కానీ అది విడుదలవ్వలేదు. నా సినిమాలకు విమర్శలు చాలా తక్కువ వస్తాయి. ప్రశంసలే ఎక్కువగా వస్తాయి.
రైటర్‌కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి?
శివనాగేశ్వరరావు: ఏది రాసినా పక్కవారి సలహాలు తీసుకోవాలి. నాలో రైటర్, దర్శకుడు ఇద్దరూ ఉన్నారు. ఒక సీన్ రాసినప్పుడు ఐదుగురికి చెబుతాను. నలుగురు బాగుందంటే కొనసాగిస్తా లేదంటే తీసేస్తాను. ఓటీటీలో సినిమాకు ప్లాన్ చేశాను. త్వరలో దాని వివరాలు చెబుతాను. ఇప్పటి సినిమాల్లో సీరియస్‌నెస్ ఎక్కువైంది. ఓవర్ బిల్డప్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. హాస్యం కూరలో కరివేపాకులా మారిపోయింది. దానికి కారణం ఇది.. అని చెప్పలేం. ఎన్నో కారణాలున్నాయి.
మీ కుటుంబం గురించి చెప్పండి?
శివనాగేశ్వరరావు: మా భార్య హౌస్ వైఫ్. మాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమెరికాలో ఉంటారు. మా అబ్బాయి సినీ రంగంలోకి రావాలని ఆసక్తి చూపాడు.. కానీ నేను వద్దని చెప్పా. ఇప్పటి దర్శకులకు నేను ఏమీ సందేశం ఇవ్వను. వాళ్లకు ఏది అనిపిస్తే అది తీయాలి అంతే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: ‘అప్పీల్ చేసుకునే స్థితిలోనే..’: రాహుల్ అనర్హతపై జర్మనీ స్పందన
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: మద్యం మత్తులో భార్య, కుమార్తె హత్య
-
Ap-top-news News
AP Govt: మార్చి నెల జీతాలు ఎప్పుడొస్తాయో?
-
Crime News
Duranto Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్..