faria abdullah: ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్‌ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!

faria abdullah interview: అల్లరి నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు..

Published : 27 Apr 2024 18:08 IST

వైవిధ్యమైన పాత్రలతో మాస్ మసాలా మూవీ చేయాలని ఉందని నటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) అంటోంది. ‘అల్లరి’ నరేశ్‌ కథానాయకుడిగా మల్లి అంకం దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’ (aa okkati adakku). రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా ఇందులో కథానాయికగా నటించిన ఫరియా అబ్దుల్లా ఆసక్తికర విషయాలను పంచుకుంది.

రెండు పాత్రల మధ్య సంఘర్షణ ఉంటుంది

ఇందులో నేను సిద్ధి అనే పాత్ర పోషిస్తున్నా. అన్నీ ప్లాన్ చేసి, నిబంధనలు పెట్టుకొని అందులోనే బతకడం సిద్ధికి ఇష్టం ఉండదు. హీరో పాత్ర నా పాత్రకు భిన్నంగా ఉంటుంది. తను అన్నీ ప్లాన్ ప్రకారం చేస్తాడు. ఈ రెండు పాత్రల మధ్య మంచి సంఘర్షణ ఉంటుంది. కథ పెళ్లి అనే అంశం చుట్టూ ఉంటూ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ‘ఆ ఒక్కటీ అడక్కు' కథ, కాన్సెప్ట్ బ్యూటీఫుల్‌గా ఉంటాయి. నాకు చాలా కనెక్ట్ అయిన పాత్ర ఇది. దర్శకుడు కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఈ రోజుల్లో అందరికీ అవసరమయ్యే కంటెంట్ ఇది.

ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి

జాతి రత్నాలుతో పోలిస్తే ఇందులో కామెడీ చాలా డిఫరెంట్‌గాను, కథానుగుణంగా ఉంటుంది. ఇందులో కంటెంట్ ప్రేక్షకులని సహజంగా నవ్విస్తుంది. నరేశ్‌తో వర్క్ చేయడం చాలా మంచి అనుభూతి. ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులని మరోసారి కడుపుబ్బా నవ్విస్తారు. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చేశాయి. పెళ్లి సంబంధాలను మ్యాట్రీమొనీల్లో ఎలా డీల్ చేస్తారనే అంశాలు ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించాం.

ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా

సినిమాల ఎంపిక విషయంలో పాత్ర, ప్రాధాన్యం, నిడివి అన్నీ చూస్తా. కొన్ని అతిథి పాత్రలు కూడా చేశా. రవితేజతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ‘రావణాసుర’లో అవకాశం వచ్చింది. అది హీరోయిన్ పాత్ర అని చెప్పలేను కానీ ఆ పాత్ర చేయడం చాలా ఆనందంగా అనిపించింది. మాస్ మసాలా సినిమా చేయాలని ఉంది. ఇప్పుడు పరిశ్రమలో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా ఉన్నారు. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా.    ఆ తరహా చిత్రాలు నాకు సరిపోతాయనుకుంటున్నా.  ప్రస్తుతం ‘మత్తు వదలరా 2’ చేస్తున్నా. గోపీ దర్శకత్వంలో ‘భగవంతుడు’ అనే సినిమా చేస్తున్నాను. అలాగే ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘కల్కి’ తర్వాత ‘జాతిరత్నాలు 2’ ఉంటుందేమో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు