Sriram Aditya: మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని పవన్‌ కల్యాణ్ సినిమాకు వెళ్లాడు: ప్రియాంక గ్రేస్

సెలబ్రిటీ టాక్‌ షో ‘అలా మొదలైంది’కి దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య (Sriram Aditya) ఆయన భార్య ప్రియాంక గ్రేస్‌తో (Priyanka grace) కలిసి వచ్చారు. వారి జీవితంలో జరిగిన సరదా సన్నివేశాలను పంచుకున్నారు. 

Updated : 25 May 2023 10:05 IST

‘భలే మంచి రోజు’తో అందరి మనసులు గెలిచిన దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య (Sriram Aditya) తన భార్య ప్రియాంక గ్రేస్‌తో (Priyanka grace) కలిసి  ‘అలా మొదలైంది’ (ala modalaindi) కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ల జీవితంలో జరిగిన మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. సినిమాల్లో సన్నివేశాలకు మించి జరిగిన వాళ్ల పెళ్లి నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. ఫ్రెండ్స్‌ లేకపోతే పెళ్లి జరిగేది కాదంటూ వాళ్లందరికీ థ్యాంక్స్‌ చెప్పారు. వెన్నెల కిషోర్‌కు ఈ జంట చెప్పిన సరదా ముచ్చట్లు మీరు చదివేయండి. 

మీరు ఎప్పుడు కలిశారు.. మీ కథ ఎలా మొదలైంది?
ప్రియాంక: మేమిద్దరం ఫేస్‌బుక్‌లో ఉద్యోగం చేసేవాళ్లం. ఒకసారి మీటింగ్‌కు వెళ్లినప్పుడు ఇద్దరం అనుకోకుండా పక్కపక్కన కూర్చున్నాం. తను నాకు ఇష్టమైన పర్‌ఫ్యూమ్‌ కొట్టుకుని వచ్చారు. అప్పుడు మొదటిసారి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మా ఆఫీస్‌లో ఏదో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దాని కోసం నేను, నా ఫ్రెండ్‌ కలిసి ఆదిత్యకు మేకప్‌ వేశాం. అలామొదలైంది మా ప్రయాణం.
శ్రీరామ్‌ ఆదిత్య: స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ప్రియాంక నాకు జూనియర్‌. నేను తనకు తెలుసు కానీ, నాకు తను తెలీదు. 

ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది?
ప్రియాంక: అసలు మేమిద్దరం ప్రేమించుకుంటామని అనుకోలేదు. ఇద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. శ్రీరామ్‌ అమ్మాయిలతో మాట్లాడడానికి నేను సాయం చేసేదాన్ని. (వెన్నెల కిషోర్‌: మీలా సపోర్ట్‌ చేసే ఫ్రెండ్‌ ఉండడం చాలా అరుదు)
శ్రీరామ్‌ ఆదిత్య: అందుకనే పెళ్లి చేసుకున్నాను.

మీ ఇద్దరిలో ముందు ఎవరు ప్రపోజ్‌ చేశారు?
శ్రీరామ్‌ ఆదిత్య: మా ఇద్దరికీ ఫుడ్‌ అంటే ఇష్టం. ఒకే ఆఫీస్‌ అవ్వడంతో భోజనం సమయంలో కలిసే వాళ్లం. అలా మాట్లాడుకుంటూ ఉండే వాళ్లం. నేను ఎవరికీ చెప్పని విషయాలు తనతో పంచుకునే వాడిని. అలా ఒకరోజు ప్రపోజ్‌ చేశాను. నాకు వచ్చిన జీతంలో 70 శాతం పెట్టి తనిష్క్‌లో ఓ ఉంగరం కొని ప్రపోజ్‌ చేశాను. తను వావ్‌ అంటుందేమో అనుకున్నా.. కానీ ఏం స్పందించలేదు.
ప్రియాంక: నేను షాక్‌ అయ్యాను. ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. కానీ వెంటనే ఓకే చేశాను.

ఇంట్లో ఎప్పుడు చెప్పారు?
ప్రియాంక: తన సినిమా విడుదలయ్యే వరకు నాకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ ఏదో ఒక కారణంతో తిరస్కరించాను. డైరెక్టర్‌ అయ్యాక మా అమ్మ వాళ్ల దగ్గరకు వెళ్లి మా ప్రేమ విషయం చెప్పాను. మా ఇంట్లో ఇప్పటి వరకు ఎవరూ ప్రేమ వివాహం చేసుకోలేదు. 
శ్రీరామ్‌ ఆదిత్య: నేను దీపావళి రోజు మా ఇంట్లో వాళ్లతో చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు. కానీ ప్రియాంక వాళ్లింటికి వెళ్లినప్పుడు మాత్రం ఒక ఇంటర్వ్యూ లా జరిగింది. మాట్లాడేసి వచ్చాను. వాళ్లు అంగీకరించలేదు.

పెళ్లి ఎలా జరిగింది?
ప్రియాంక: శ్రీరామ్‌ మా ఇంట్లో వాళ్లతో మాట్లాడాక నాకు ఫోన్‌ చేసి ఓకే అన్నారు అని చెప్పాడు. మా నాన్న ‘అయిపోయింది మేము చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకో’ అన్నారు. నాకేం అర్థం కాలేదు. 
శ్రీరామ్‌ ఆదిత్య: మాకు రెండు పెళ్లి రోజులుంటాయి. వాళ్లింట్లో వాళ్లు అంగీకరించరు అని తెలిశాక వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ఫ్రెండ్స్‌ చాలా సాయం చేశారు. ఇప్పుడు నవ్వుతున్నాం కానీ ఆ టైమ్‌లో మాత్రం చాలా కంగారు పడ్డాం. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో చూపించినట్లు కార్లు మారి వేరే ప్రాంతానికి వెళ్లాం. పెళ్లి చేసుకున్నానని మా ఇంట్లో వాళ్లకు ఫోన్‌ చేసి చెప్పాను. వాళ్లు ఇంటికి వచ్చేయండన్నారు. మా బంధువులందరినీ పిలిచి మళ్లీ పెళ్లి చేశారు.  (ప్రియాంక: ఉదయం పెళ్లి చేసుకుందాం అనుకుని.. తెల్లవారుజామున ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’కు వెళ్లాడు. పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) సినిమా కదా మిస్‌ అవ్వకూడదని)

మీరు పెళ్లి చేసుకున్నారని తెలిశాక మీ ఇంట్లో వాళ్లు ఎలా స్పందించారు?
ప్రియాంక: రెండు నెలల తర్వాత మా అమ్మవాళ్లు ఫొన్‌ చేసి ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్లాక కొన్ని రోజులకు శ్రీరామ్‌ను కూడా పిలిచారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు మా తల్లిదండ్రులు నాకంటే శ్రీరామ్‌నే ఎక్కువ ఇష్టపడతారు. 

పెళ్లికి ముందు ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకాన్ని చెప్పండి
ప్రియాంక:  శ్రీరామ్‌ ఎప్పుడు నాతో ఒకే మాట చెబుతుండేవాడు. ‘నేను ఎప్పటికైనా సినిమా తీస్తాను. నువ్వు నా పక్కన కూర్చుని చూస్తావు’ అని. తను తీసిన మొదటి సినిమా ప్రీమియర్‌కు నన్ను తీసుకెళ్లాడు. అది జీవితంలో మర్చిపోలేను. ఆ సినిమా నాకు నచ్చలేదు. హిట్‌ అవ్వదేమో అని భయపడ్డాను.
శ్రీరామ్‌ ఆదిత్య: సినిమా సగం చూశాక తన ఫేస్‌ అంతా మారిపోయింది. ప్లాప్‌ అని నిర్ణయించుకుంది. కానీ ఆ సినిమా సూపర్‌ హిటైంది. 

శ్రీరామ్‌ ఆదిత్య మీద మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా?
ప్రియాంక: చాలా ఉన్నాయి. అసలు ఇంట్లో ఉండడు. ఇంట్లో ఉన్న గంట కూడా ఫోన్‌ చూసుకుంటూ ఉంటాడు. మా అబ్బాయి కూడా పిలిచి పిలిచి విసుగు వచ్చి..‘ఏ శ్రీరామ్‌’ అని అరుస్తాడు. ఒకరోజు ఫోన్‌ చూస్తే అన్నీ అమ్మాయిల ఫొటోస్‌ ఉన్నాయి. ఏంటని అడిగితే సినిమాలో పాత్ర కోసం ఎంపిక చేయాలని చెప్పాడు. (శ్రీరామ్‌ ఆదిత్య: వాళ్ల ఫొటోస్‌ నిజంగానే సినిమాల కోసమే పెట్టాను)(నవ్వులు)
శ్రీరామ్‌ ఆదిత్య: నేను ఒకేసారి రెండు పనులు చేస్తుంటాను. ఫోన్‌ చూస్తూనే స్టోరీ కోసం ఆలోచిస్తుంటాను(నవ్వులు). 

ప్రియాంక మీద ఏమైనా కంప్లైంట్స్‌ ఉన్నాయా?
శ్రీరామ్‌ ఆదిత్య: షాపింగ్‌ ఎక్కువ చేస్తుంది. కోపం ఎక్కువ.
ప్రియాంక: అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఎంత కోపమెచ్చినా భోజనం సమయానికి తగ్గిపోతుంది. ఇద్దరం కలిసి భోజనం చేస్తాం.

సర్‌ప్రైజ్‌లు ఎక్కువగా ఎవరు ప్లాన్‌ చేస్తారు?
ప్రియాంక: తనేనండీ. చాలా సార్లు సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేస్తారు. ఒక్కోసారి నాకు తెలిసిపోతుంటుంది. ఒకటి మాత్రం హిట్‌ అయింది. నా పుట్టినరోజుకు రెండు రోజుల ముందు బ్యాగ్‌ సర్దుకో ఊరు వెళ్దాం అన్నాడు. నాకు తెలియకుండానే గోవా తీసుకెళ్లాడు. రెండు రోజులు నాకు ఇష్టమైనవన్నీ చూపించాడు. చాలాసార్లు సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసినా నాకు దొరికిపోతాడు. పుట్టినరోజు వస్తుందనుకోండి ప్లానింగ్‌ కోసం ఒక వాట్సప్‌ గ్రూప్‌ పెడతాడు. దాని పేరు ‘ప్రియాంక బర్త్‌డే’ అని పెడతాడు. నేను ఫోన్‌ చూడగానే నాకు తెలిసిపోతుంది. పెళ్లికి ముందు ఒకసారి నా ఫొటో పెయింటింగ్‌ వేయించి ఇచ్చాడు. అది చూసి నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. 

మీ ఇద్దరిలో ప్లానింగ్‌ ఎవరు చేస్తారు?
ప్రియాంక: తనేనండీ. ఇంట్లో ఏ ఫంక్షన్‌ అయినా చాలా బాగా ప్లాన్‌ చేస్తాడు. 
శ్రీరామ్‌ ఆదిత్య: నాకు అలా అందరితో ఉండడం ఇష్టం. అందుకే ఇంటికి వచ్చిన వాళ్లని త్వరగా వెళ్లనివ్వను. మా పెళ్లికి సాయం చేసిన 15 మంది ఫ్రెండ్స్‌ను ఇప్పటికీ మా పెళ్లిరోజు నాడు పిలుస్తాం. ఆరోజంతా ఎంజాయ్‌ చేస్తాం.

ఇద్దర్లో ఎవరు సపోర్టివ్‌గా ఉంటారు?
శ్రీరామ్‌ ఆదిత్య: ప్రియాంక నాకు చాలా సపోర్ట్‌ ఇస్తుంది. ఇంట్లో ఏం కావాలన్నా అన్ని విషయాలు తనే చూసుకుంటుంది. అంతేకాదు.. నా ఫీలింగ్స్‌ను కూడా అర్థం చేసుకుంటుంది. ఎమోషనల్‌గా కూడా చాలా సపోర్ట్‌ చేస్తుంది. 

మీ భాగస్వామి కోసం నచ్చకపోయినా చేసిన పని ఏంటి?
ప్రియాంక: ఆయనే ఎక్కువగా చేస్తుంటారు. తననే అడగండి
శ్రీరామ్‌ ఆదిత్య: ఫంక్షన్స్‌కు వెళ్లడం. నాకు ఫంక్షన్స్‌కు వెళ్లడం అసలు నచ్చదు. అయినా వెళ్తుంటా.

ఈ సమయంలో మీ భాగస్వామి పక్కన ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా?
ప్రియాంక: నా డెలివరీ కొవిడ్‌ టైంలో జరిగింది. ఆ సమయంలో ఎవరినీ లోపలికి రానివ్వలేదు. అప్పుడు శ్రీరామ్‌ పక్కన ఉంటే బాగుండనిపించింది. చాలా ఫీలయ్యాను. కానీ సరిగ్గా ఆపరేషన్‌ సమయానికి డాక్టర్‌ను ఒప్పించి లోపలికి వచ్చారు. 

శ్రీరామ్‌ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం చెప్పండి?
ప్రియాంక: కలవరిస్తుంటారు. సడెన్‌గా నిద్రలో అరుస్తుంటారు. ‘వాసు కాస్ట్యూమ్స్ వచ్చాయా, షాట్‌ ఓకేనా..’అని కలవరిస్తారు. మొదట్లో ఏంటిలా అంటున్నారు అనుకున్నాను. ఇప్పుడు అలవాటైంది. 

శ్రీరామ్‌ ఆదిత్యకు వెన్నెల కిషోర్‌ సరదాగా ఏం కౌన్సిలింగ్‌ ఇచ్చాడు. అలాగే ఓ నిర్మాతకు శ్రీరామ్‌ ఆదిత్య లవ్‌ యూ అని ఎందుకు చెప్పాడు.. ఇలాంటి సరదా కబుర్లతో సాగిన వీళ్ల ‘అలా మొదలైంది’ ఎపిసోడ్‌ను  ‘ఈటీవీ విన్‌’ యాప్‌లో వీక్షించండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని