మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’

‘హారర్‌ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

Published : 04 Mar 2024 13:19 IST

‘హారర్‌ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే ట్రైలర్‌, పోస్టర్లతో సినీప్రియులను ఆకట్టుకున్న ఈ సినిమా ఈ నెల 6న ఈటీవీ విన్‌లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకురాలు మ్రితికా ఈనాడు సినిమాతో ముచ్చటించారు.

అసలు ఈ సినిమా ఎలా  మొదలైంది?

ఓ నిర్మాత కుమార్తె అయిన నా స్నేహితురాలు నన్ను ఈటీవీకి పరిచయం చేశారు. ఎన్నో చర్చల తరవాత ఈటీవీ బృందానికి నా స్క్రిప్ట్‌ నచ్చి దర్శకురాలిగా నాకు అవకాశం ఇచ్చారు.

ఈ చిత్రంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అంశాలేంటి?

‘‘మూఢనమ్మకాలు లేని దెయ్యం సినిమా ఇది. మతపరమైన ఆచారాలు లేని భయానక చిత్రం. అన్ని రకాల ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హారర్‌ చిత్రమిది. ఈ సినిమా మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాముఖ్యత గురించి తెలుపుతుంది. ఇందులో ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలను చూపించలేదు. సినిమాలో హీరోహీరోయిన్లు ఎలాంటి నమ్మకాలు, ఆచారాలు లేని ఒక హేతువాద జంట. ఇందులో దెయ్యం తలకిందులుగా వేలాడడం, భయానకమైన నవ్వులు, ఒంట్లో వణుకు పుట్టించే చీకటి..లాంటి ఆసక్తికర అంశాలు ప్రేక్షకులకు ఎంతో థ్రిల్‌ను పంచుతాయి. ద్వితీయార్ధంలో మన మూలాలు, ఆచార సంప్రదాయాల గురించి చూపించాము’’.

మహిళా దర్శకుల సంఖ్య పరిమితంగా ఉన్న తరుణంలో మీరు దర్శకత్వం వైపు రావడం మంచి పరిణామం. సినిమాల్లోకి మీ ప్రయాణం ఎలా మొదలైంది?

‘‘మా అమ్మమ్మ నన్ను విఠలాచార్య తీసిన ‘గంధర్వ కన్య’ సినిమా తమిళ వెర్షన్‌కి తీసుకెళ్లడంతో నా సినిమాల ప్రయాణం మొదలైంది. నా జీవితంలో చాలా మంచి క్షణాలు నేను ఎంతో ప్రేమించే మనుషులతో కలిసి గొప్ప సినిమాలు చూడటంతోనే గడిచిపోయాయి. అలా చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. కృషి, చిత్తశుద్ధి లాంటి మనలో ఉన్న నైపుణ్యాలే పెట్టుబడి అయినప్పుడు ఎంత సమయం పట్టినా మనం కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము. ఈ విధంగా నేను అనుకున్న గమ్యానికి కొంచెం ఆలస్యమైనా చేరుకున్నాను. కచ్చితంగా ఇది నాకు ఒక మంచి పరిణామం అనుకుంటున్నాను. 2010లో నేను దర్శకుడు క్రిష్‌ సర్‌ దగ్గర ‘వానం’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను. ఆయన రూపొందించిన ‘వేదం’ రీమేక్‌ చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగింది. ఇదే నా మొదటి అవుట్‌డోర్‌ లొకేషన్‌. ఇప్పుడు ఈటీవీ నుంచే నా తొలి చిత్రం రావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది’’.

ఈ చిత్రంలోని పాత్రల గురించి చెప్పండి?

‘‘ఈ సినిమాలో దివ్య నవీన్‌ అనే పాత్రలో రితికా సింగ్‌ కనిపిస్తుంది. ఆమె భర్త కెప్టెన్‌ నవీన్‌ నాయుడు పాత్రను శ్రీరామ్‌ పోషించారు. నవీన్‌ నాయుడు ఇండియన్‌ నేవీ కెప్టెన్‌. చాలా సార్లు ఉద్యోగం పని మీద బయటికి వెళ్తాడు. కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అతను తన భార్య, కొడుకు కోసం సమయాన్ని వెచ్చిస్తాడు. వీళ్ల కుమారుడే మాధన్న. ఈ సినిమాలో ఇంకో ప్రత్యేక విషయం ఉంది. మన నేటివీటికి కట్టుబడి.. ఇందులో పిల్లలకు పేర్లు పెట్టడంలో మన చరిత్రను కదిలించాలని నిర్ణయించుకున్నాను. అందుకే మన మూలాలను గుర్తు చేసేలా సినిమాలో పాత్రల పేర్లు పెట్టాను. ఈ సినిమాలో పాత్రలే కాకుండా కథను ముందుకు నడిపించే ప్రధాన పాత్రలో వళరి, ప్రసాదిని, ఐరన్‌ లాకర్‌ లాంటి కొన్ని అంశాలు కూడా ఉంటాయి. మీరు ఈ సినిమా చూసినప్పుడు వీటన్నింటి గురించి తెలుసుకుంటారు’’.

ఈ సినిమాని ఓటీటీలోనే విడుదల చేయడానికి  ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయి?

‘‘కచ్చితంగా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ప్రేక్షకుల సమయాన్ని, ఖర్చును దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాము. అంతేకాకుండా ఓటీటీ కారణంగా కుటుంబంతో గడుపుతూ సినిమాని చూసే ఓ గొప్ప అవకాశం మన ముందు ఉంది. అందుకే ఈటీవీ విన్‌ వేదికగా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’.

దర్శకురాలిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి?

‘‘ప్రస్తుతం నా పూర్తి ధ్యాస అంతా ‘వళరి’ సినిమా మీదనే. ఇది విడుదలయ్యే వరకూ ఏ సినిమా గురించి చర్చించను. మా నిర్మాత, చిత్రబృందం ‘వళరి’ సినిమా విడుదలైన రోజు గర్వంగా నవ్వడం చూసిన తర్వాత నా తదుపరి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తాను’’.


సినిమా పేరుతోనే ఆసక్తి రేకెత్తిస్తున్నారు... ఇంతకీ ‘వళరి’ అంటే ఏంటి?

‘వళరి’ అనేది తమిళ ప్రజల పదునైన ఆయుధం. దీన్ని ఎంత దూరం నుంచి విసిరినా విపరీతమైన వేగంతో దూసుకుపోతుంది. 1801లో బ్రిటిష్‌ వారు వళరి ఆయుధాల వినియోగాన్ని నిషేధిస్తూ ఆయుధ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లోనే ఈ ఆయుధాల్ని సుమారు 15000 వరకు జప్తు చేశారు. కొన్ని బ్రిటిష్‌ మ్యూజియంలకు పంపించారు. తెలుగు, హిందీ, తమిళ సినిమాలకి మన భాష కాని ఇంగ్లీషు పదాల పేర్లు పెట్టినప్పుడు.. తెలుగు సినిమాకి భారతీయ భాషలో ఉన్న తమిళ పదాన్ని ఎందుకు పెట్టకూడదనే ఆలోచన వచ్చింది. అందుకే ‘వళరి’ అని పేరు పెట్టాను. మన ఏం చేసినా కర్మ మనల్ని వదిలి పెట్టదనే కథాంశంతో రూపొందించాము.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని