Priyanka Chopra: ప్రియాంక దీపావళి సంబరం

వచ్చే ఏడాది దీపావళి నుంచి విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని అమెరికాలోని న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ తాజాగా ప్రకటించారు.

Updated : 24 Oct 2022 11:31 IST

వచ్చే ఏడాది దీపావళి నుంచి విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని అమెరికాలోని న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ తాజాగా ప్రకటించారు. దీనిపై నటి, నిర్మాత ప్రియాంకాచోప్రా ఆదివారం తన సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలో విద్యార్థిగా ఉన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘న్యూయార్క్‌లో మన పండగకి సెలవు ప్రకటించడంతో సంతోషంతో నా కళ్లు చెమర్చాయి’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించారు. టీనేజీలో ఉన్నప్పుడు ప్రియాంక బంధువుల ఇళ్లలో ఉంటూ లాస్‌ఏంజెల్స్‌, అయోవా, మసాచ్యుసెట్స్‌ నగరాల్లో చదువుకున్నారు. ఆ సమయంలో సహాధ్యాయులతో కలిసి దీపావళి జరుపుకున్నానన్నారు. ‘మన పండగకి ఇంత గుర్తింపు దక్కడంతో మనం సంబరాలు చేసుకోవాలి. ఈ సందర్భంగా విద్యార్థులకు దీపావళి ప్రాశస్త్యం గురించి తెలియజేయాలి. మనలోని అజ్ఞాన, అంధకారాలను పారదోలి మనలో మనం ఎలా వెలుగులు నింపుకోవాలో నేర్పించాలి’అన్నారు. ఈమధ్యే ప్రవేశపెట్టిన బిల్లు చట్టరూపం దాల్చగానే వచ్చే దీపావళి నుంచి విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటిస్తారు.


అమితాబ్‌కి గాయం

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ గాయపడ్డారు.  ఎడమ కాలి నరం తెగడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరినట్లు ఆదివారం ప్రకటించారు. రక్తస్రావాన్ని ఆపడానికి వైద్యులు కుట్లు వేసినట్టు తెలుస్తోంది. ‘శరీరంపై కొన్ని గుర్తులు ఎప్పటికీ మానిపోవు. ఇది కొంత ఇబ్బంది కలిగించినా తప్పదు. దీని నుంచి బయటపడేందుకు దేవుడు సహకరించాలి’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాలికి కట్టుతో ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ వ్యాఖ్యాతగా హాజరైన ఫొటోలను బిగ్‌ బీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.


బుడాపెస్ట్‌లో షబానా

షబానా ఆజ్మీ కీలక పాత్రలో నటించిన అమెరికన్‌ మిలిటరీ సైన్స్‌ ఫిక్షన్‌ వెబ్‌సిరీస్‌ ‘హలో’. ఇది ఘనవిజయం సాధించడంతో సీజన్‌ 2ని పట్టాలకెక్కిస్తోంది చిత్రబృందం. ఈ షూటింగ్‌లో పాల్గొనడానికి షబానా హంగెరీ రాజధాని బుడాపెస్ట్‌ వెళ్లారు. ఈ చిత్రాన్ని ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘సూర్యుడు ఉదయించాడు. జీవితం ఆనందంగా సాగుతోంది. నేను ‘హలో 2’ చిత్రీకరణ కోసం బుడాపెస్ట్‌కి వచ్చాను’ అంటూ వ్యాఖ్యానిస్తూ ఓ సెల్ఫీ జోడించారు. ఇందులో ఆమె అడ్మిరల్‌ మార్గరెట్ పరగోన్‌స్కీ పాత్ర పోషిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ని పారమౌంట్‌ ప్లస్‌ సంస్థ నిర్మిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని