Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్‌

భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Updated : 05 Mar 2024 15:50 IST

హైదరాబాద్‌: ప్రతినాయకుడిగా కెరీర్‌ ప్రారంభించి ప్రస్తుతం కథానాయకుడిగా రాణిస్తున్నారు హీరో గోపీచంద్‌ (Gopichand). విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ఎ. హర్ష దర్శకత్వంలో ‘భీమా’(Bhimaa) చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 

భీమా ప్రయాణం ఎలా మొదలైంది? ఇంతకు ముందు పోలీస్‌ పాత్రలు చేశారు. వాటికీ, ఈ సినిమాకీ తేడా ఏంటి?
కో ప్రొడ్యూసర్‌ శ్రీధర్‌, హర్షను పరిచయం చేయడంతో ఆయన్ని ఒక పోలీస్‌ స్టోరీ కావాలని అడిగాను. ఆయన భీమా స్టోరీ చెప్పారు. ఇందులో ఉన్న సెమీ ఫాంటసీ ఎలిమెంట్ బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఇంతకుముందు నేను చేసిన ‘గోలీమార్‌’ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో ఉంటే, ‘ఆంధ్రుడు’ ప్రేమపై డిపెండై ఉంటుంది. కానీ భీమా పూర్తిగా పోలీస్‌ స్టోరీ. ఇందులో ఉన్న రెండు క్యారెక్టర్స్ కథపై ఆధారపడి ఉంటాయి. భీమా పాత్ర నాకు బాగా నచ్చింది. రాక్షసుడిని చంపే బ్రహ్మరాక్షసుడు భీమా. సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్‌ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఇది పూర్తిగా కమర్షియల్ మూవీ. ఇందులో అన్ని ఎమోషన్స్‌ ఉన్నాయి.  

ఈ సినిమాతో హిట్ కొట్టే అవకాశం ఉందా? మీ తర్వాత కథను ఎంపిక చేసుకోవడంలో ఈ సినిమాల ప్రభావం ఉంటుందా?
హిట్‌ కొట్టాలనే అందరం సినిమాలు చేస్తాం. చేసినవన్నీ విజయం సాధిస్తాయని చెప్పలేం కదా. అది థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌పై ఆధారపడి ఉంటుంది. కథ, చిత్రీకరణ టైమ్‌లో బాగానే చేశాం అనుకుంటాం. కానీ సినిమా చూశాక ఎక్కడ మనం తప్పు చేశామో తెలుస్తుంది. తర్వాత చేయబోయే చిత్రాల్లో ఆ పొరపాట్లు రాకుండా చూసుకుంటా. ‘రామబాణం’ ప్రెజెంటేషన్‌ లోపం కారణంగా హిట్‌ అవలేదు. కానీ భీమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.

ఈ సినిమా ‘అఖండ’లా ఉంది అంటున్నారు. ప్రస్తుతం కమర్షియల్‌ మూవీస్‌ హిట్‌ అవడం లేదు. దీనిపై మీ అభిప్రాయం? 
అఘోరాలు ఉన్నారని ‘అఖండ’తో పోల్చుతున్నారు.  కానీ ఈ చిత్రం అలా ఉండదు. పరశురామ క్షేత్రాన్ని బ్యాక్‌డ్రాప్‌లో తీసుకుని చేశాం. ఇది కమర్షియల్‌ సినిమా అయినా ఎమోషనల్‌గా ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారు. ఎందుకంటే ఎంత యాక్షన్‌ ఉన్నా, ఎమోషన్‌ లేనిదే సినిమా హిట్‌ అవదు. 

‘ఒంటరి’, ‘ఒక్కడున్నాడు’ లాంటి సినిమాలు మళ్లీ చేసే అవకాశం ఉందా?
అలాంటి జోనర్‌లో ఒక కథ కుదిరింది. త్వరలోనే సినిమా చేస్తా. ప్రేక్షకులు ఇప్పటికీ ‘సాహసం’ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతోనే వరుస సినిమాలు చేస్తున్నా. కథ బాగున్నా, దానిని తెరకెక్కించేటప్పుడు ఇబ్బంది ఎదరవుతుంది. అలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. 

ఈ సినిమాలో ఎద్దును చూసి మీకు ఎలా అనిపించింది? ప్రస్తుతం మీరు కామెడీ సినిమాలు చేయడం లేదు ఎందుకు?
అందరూ గుర్రాలు ఉపయోగిస్తుంటే మీరేంటి ఎద్దుని వాడుతున్నారని డైరెక్టర్‌ని అడిగాను. ‘భీమా పాత్ర చాలా బలమైనది నేను ఇలానే ఊహించుకుని కథ రాశాను’ అన్నారు.  దాంతో సరే అన్నాను. అవుట్‌పుట్‌ చూశాక బాగా తీశారు అనిపించింది. కామెడీ జోనర్‌లో సినిమాలు చేయాలని ఉన్నా అన్ని సందర్భాల్లో అది కుదరదు. ‘లౌక్యం’ సూపర్‌ హిట్‌ అయితే,  ‘సౌఖ్యం’ ఫ్లాప్‌ అయింది. ఎందుకంటే కామెడీ కొంతవరకే బాగుంటుంది. భీమాలో యాక్షన్‌తో పాటు, కామెడీ కూడా ఉంటుంది.

ప్రస్తుతం తెలుగు కథలు రావటం లేదు. ఎందుకంటారు?
మా నాన్న కాలంలో ఉన్న రచయితలు ప్రజలతో ఉండి, వారి నుంచి కథలను ఎంచుకునేవారు. ఇప్పుడున్న వారు అలా కాదు. చాలా తక్కువమంది అలా ఉంటున్నారు. ప్రజల సమస్యలు కరెక్ట్‌గా చెప్పగలిగితే ఆ సినిమాలు సూపర్‌ హిట్‌ అవుతాయి. నా వద్దకు అలాంటి కథలు వస్తే కచ్చితంగా చేస్తా.

దర్శకత్వం కానీ, ప్రభాస్‌తో సినిమా చేసే ఆలోచనలు కానీ ఉన్నాయా?  
నటించడం కంటే దర్శకత్వం వహించడం చాలా కష్టం. డైరెక్టర్‌కి అన్ని విషయాలపై అవగాహన ఉండాలి. నేపథ్య సంగీతం ఎలా ఉండాలో తెలుసుండాలి. నటుడిగానే కొనసాగుతాను. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేయాలనుంది. ప్రభాస్‌తో కలిసి నటించాలని అనుకుంటున్నాం. టైమ్‌ వస్తే ఇద్దరం మరో సినిమా చేస్తాం. ప్రస్తుతానికి శ్రీనూవైట్ల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. ఆయన మార్క్‌తోపాటు కథ బాగుందని ఈ ప్రాజెక్ట్‌ అంగీకరించాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని