Kamal Haasan: షారుక్‌ విమానం కోరిక.. కమల్‌ హాసన్‌ ఫన్నీ కామెంట్

మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌ సరదాగా అన్నారు.

Published : 30 Apr 2024 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోరికలు అందరికీ ఉంటాయి. ముఖ్యంగా చిన్నతనంలో వాటికి హద్దే ఉండదు. పెద్దయ్యాక వాటిని గుర్తు చేసుకంటే ఒక్కోసారి మనకే నవ్వొస్తుంది. ఈ కోరికల విషయంలో ప్రముఖులు కూడా ఏమీ మినహాయింపు కాదు. అలా చిన్నప్పుడు తన కోరికల గురించి అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌ గుర్తుచేసుకున్నారు. అంతేకాదు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కోరికల చిట్టా తనకు నవ్వు తెప్పించిందని చెప్పారు. తన కుమార్తె శ్రుతి హాసన్‌ ఇటీవల నిర్వహించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు.

‘నేను తెలివైన వాడినని మా నాన్న భావన. నా చిన్నతనంలో మేం ఉండే ఇంట్లోనే నాకు చిన్నగదిని కేటాయించారు. అది సౌకర్యంగా లేకపోతే మారుస్తామన్నారు. ఆ గదిలో ఉంటూ ఎన్నో కలలు కన్నాను. ఎలాగైనా నెలకు రూ.10 వేలు సంపాదించాలని అనుకున్నా. పెద్ద కారు, ఇల్లు కొనాలనుకున్నా. అవ్వన్నీ కొనాలంటే ఏం చేయాలా?అని ఆలోచించేవాడిని. వాటి గురించి ఆలోచిస్తూనే నిద్రపోయే వాడిని. ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ (Shah Rukh Khan) కోరికల లిస్ట్‌ చూసి ఆశ్చర్యపోయాను. ఆయనకు విమానం కొనాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది నాకంటే పెద్ద లిస్టే అనుకుని నవ్వుకున్నా. నిజానికి షారుక్‌కు దానవసరం లేదు. అయినా ఆయన ఓ గోల్‌ పెట్టుకున్నారు’ అని కమల్‌ ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ మూడు చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా  తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్‌ దర్శకత్వంలో ‘భారతీయుడు2’ పూర్తి చేశారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు ‘థగ్‌ లైఫ్‌’ అనే పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నారు. దీనికి మణిరత్నం (Mani Ratnam) దర్శకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని