Krithi Shetty: మా చేతుల్లో ఉండేది కథల ఎంపిక ఒక్కటే!

తొలి సినిమా నుంచే ఎక్స్‌ప్రెస్‌ వేగం ప్రదర్శించింది కృతిశెట్టి. ‘ఉప్పెన’ తర్వాత ఆమెకి ఆ సినిమా పేరుకు తగ్గట్టే అవకాశాలు వెల్లువెత్తాయి.

Updated : 01 Jun 2024 14:30 IST

తొలి సినిమా నుంచే ఎక్స్‌ప్రెస్‌ వేగం ప్రదర్శించింది కృతిశెట్టి. ‘ఉప్పెన’ తర్వాత ఆమెకి ఆ సినిమా పేరుకు తగ్గట్టే అవకాశాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తమిళ, మలయాళ భాషల్లోనూ నటిస్తోంది. ఇటీవల ‘మనమే’ చిత్రంలో శర్వానంద్‌తో కలిసి నటించింది. ఆ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కృతిశెట్టి శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. 

ఈ కథలో మిమ్మల్ని ప్రేరేపించిన విషయాలేమిటి?

రొమాంటిక్‌ కామెడీ కథే అయినా...  బలమైన భావోద్వేగాలు ఉంటాయి.  చిన్నారి, ఓ జంట నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి. అవి అందరికీ కనెక్ట్‌ అవుతాయి. ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ ఈ కథ సాగుతుంది. ‘మనమే’ అనే పేరు వెనక కథే కారణం.

మీ పాత్ర ఎలా ఉంటుంది?

సుభద్ర అనే యువతిగా కనిపిస్తా. గతంలో చేసిన పాత్రలు చాలా వరకు అందంగా, నాజూగ్గానే సాగుతున్నట్టు అనిపిస్తాయి. కానీ సుభద్ర ఆ పాత్రలకి పూర్తి భిన్నం. నిక్కచ్చిగా వ్యవహరించే అమ్మాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు భార్యలు ఎలా ఉంటారో... అలా కనిపించాల్సి వచ్చింది. పాత సినిమాల్లో చేసిన పాత్రల్ని మరిచిపోయి ఇందులో నటించమని అని చెప్పారు శ్రీరామ్‌ ఆదిత్య. ఈ పాత్ర ప్రయాణం చాలా తృప్తినిచ్చింది. ఇందులో నేను చిన్నారికి తల్లిగా కనిపిస్తానా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవల్సిందే. 

గతంలో మీ సినిమాలు తరచూ వచ్చేవి. ఇప్పుడు కాస్త విరామం తర్వాత వస్తున్నారు...కారణం ఏంటి?

ఈ విరామం తీసుకున్నది కాదు, వచ్చింది. తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నా. మలయాళంలో ఓ సినిమా చేశా. అన్ని చోట్లా ఒకే వేగంతో సినిమాలు చేయలేం కదా. అయితే తెలుగు సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకం. నాకు ఇంత పేరు, ప్రేమ దక్కిందంటే తెలుగు ప్రేక్షకులే కారణం. మొదటి నుంచీ బాధ్యతగా భావిస్తూ తెలుగులో కథల్ని ఎంపిక చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తున్నా. 

కెరీర్‌ ఆరంభంలోనే మంచి విజయాల్ని, అలాగే పరాజయాల్నీ చవిచూశారు. కెరీర్‌లో ఈ ఆటుపోట్లని ఎదుర్కోవడం కష్టంగా అనిపించిందా?

నాణేనికి రెండు వైపుల్నీ చూశానని చెప్పాలి. మంచి కథల్ని ఎంపిక చేసుకోవడం తప్ప నా చేతుల్లో ఏమీ ఉండదు. సినిమా విజయానికి నేనొక్కటే కారణం కాదనే విషయాన్ని తొలి సినిమాతోనే తెలుసుకున్నా. అందుకే పరాజయాలు ఎదురైనా అవి నాపై పెద్దగా ప్రభావం చూపలేదు. మన చేతుల్లో లేని విషయాలపై ఆందోళన ఎందుకనే విషయాన్ని ఈ ప్రయాణంలో తెలుసుకున్నా. కష్టపడ్డాను అనడం కంటే నేర్చుకున్నానని చెబుతాను.  

సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాల్ని ఎంతవరకు పట్టించుకుంటారు?

ఎవరు ఏమన్నా నేను పెద్దగా పట్టించుకోనని ఇక్కడ కూర్చుని  చెప్పలేను. ఇబ్బంది కలిగించేలా  వ్యాఖ్యలు చేస్తే ఎవరినైనా తప్పకుండా బాధపెడతాయి. కాకపోతే ఇప్పటివరకూ నాపై ఎవ్వరూ అంత దారుణంగా వ్యాఖ్యలు చేయలేదు.

శర్వానంద్‌తో కలిసి నటించారు. ఆ అనుభవాల్ని పంచుకుంటారా?

శర్వానంద్‌ అనుభవం ఈ సినిమాపై మరింత ప్రభావం చూపించింది. ప్రతి సన్నివేశంలోనూ అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఆయన నటనని అందుకోవడం కష్టమేమో కానీ, ఆయనతో కలిసి పనిచేయడం మాత్రం చాలా సులభం. తోటి నటులకి మంచి సహకారం అందిస్తారు. ఇందులో నాకు బాగా ఇష్టమైన ఓ సన్నివేశం ఉంది. దానికోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ, ప్రత్యేకంగా సన్నద్ధమయ్యా. కానీ శర్వానంద్‌ మాత్రం చాలా సాదాసీదాగా వచ్చి ఒక్క నిమిషంలోనే ఆ సన్నివేశం పూర్తి చేశారు. అది చూసి ఆశ్చర్యపోయా. ఇందులో చిన్నారి విక్కీ పాత్ర కీలకం. ఈ సినిమా చిత్రీకరణ  ఎక్కువగా లండన్‌లో జరిగింది. అక్కడి వాతావరణాన్ని అస్సలు ఊహించలేం. ఆ పరిస్థితుల మధ్య పనిచేయడం ఓ ప్రత్యేకమైన అనుభవం. మేం లండన్‌లో ఉన్నప్పుడు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్‌ సర్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాపైన ఆయనకున్న ప్రేమ చాలా గొప్పది.

భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?

‘బాహుబలి’లో అనుష్కలా కనిపించాలని ఉంది. రాకుమారి పాత్రలంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే యాక్షన్, మార్షల్‌ ఆర్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తా. నా పాత్ర పరిధి ఎంత అనే విషయం కంటే, అది ఎంత వైవిధ్యంగా ఉందనేదే చూస్తా. ‘ఉప్పెన’ తర్వాత ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో ఓ చిన్న పాత్రనే చేశా. కారణం... ఆ పాత్ర బేబమ్మ పాత్రకి భిన్నంగా, మోడ్రన్‌ అమ్మాయిగా కనిపించే పాత్ర. అందుకే అది ఎంపిక చేసుకుని నటించా. అలా సినిమా సినిమాకీ వైవిధ్యాన్నే కోరుకుంటా. చేసిన పాత్రల్నే మళ్లీ మళ్లీ చేయడం నచ్చదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని