Nagarjuna: ‘‘12 ఏళ్ల వయసులో ప్రేమలో పడతాం... తర్వాత 15 ఏళ్లు కలుసుకోం’’

‘నా సామిరంగ’ ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున విలేకర్లతో మాట్లాడారు.

Updated : 12 Jan 2024 17:54 IST

‘నా సామిరంగ’ (Naa Saamiranga)తో అలరించడానికి సిద్ధమయ్యారు అగ్ర కథానాయకుడు నాగార్జున. ఆయన హీరోగా విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) కథానాయిక. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. సంక్రాంతి పురస్కరించుకొని ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగార్జున విలేకర్లతో ముచ్చటించారు.

మూడు నెలల్లో సినిమాను ఎలా పూర్తి చేశారు?
నాగార్జున: షూటింగ్‌కు మూడు నెలల సమయం పట్టింది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు 5 నెలలు చేశాం. నా పార్ట్‌ 60 రోజుల్లో పూర్తి చేశారు. సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుంటే తప్పులు ఎక్కువవుతాయి. అలాంటివి జరగకుండా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఎక్కువ రోజులు చేశాం. ఇది పెద్ద సినిమా. చాలా పాత్రలున్నాయి. ఇంత త్వరగా పూర్తి చేయడానికి కీరవాణి ప్రధాన కారణం. పాటలు, నేపథ్య సంగీతం అన్నీ షూట్‌కు ముందే కంపోజ్‌ చేశారు.

ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి?
నాగార్జున: స్నేహం, ప్రేమ, త్యాగం, ద్వేషం.. ఈ నాలుగు అంశాలు నచ్చాయి. ఇవి కథకు మూల స్తంభాలు. ఇది పూర్తిస్థాయి రీమేక్‌ చిత్రం కాదు. మాతృకలోని నాలుగు అంశాలను తీసుకుని ఇక్కడి ప్రేక్షకులకు తగినట్లు మార్పులు చేశారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో జరిగే కథ. అందుకే సంక్రాంతికి విడుదల చేస్తున్నాం.

మామూలు వాటి కంటే రీమేక్‌ సినిమాలు చేయడం కష్టమా?
నాగార్జున: మాతృకలో ఉన్న సోల్‌ కనిపించేలా సినిమా తీయాలి. ఇక్కడి ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేయాలి. దీనికి సంబంధించిన పూర్తి క్రెడిట్‌ దర్శకుడు విజయ్‌ బిన్నీకే దక్కాలి. ఈ స్క్రిప్ట్‌ను ఎంతోమందికి చూపించి సలహాలు తీసుకున్నారు. ప్రసన్న కూడా డైలాగ్‌లు బాగా రాశారు.

అషికా రంగనాథ్‌తో చేయడం ఎలా అనిపించింది?
నాగార్జున: మా ఇద్దరి కాంబినేషన్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంలో మేమిద్దరం 12 ఏళ్లు ఉన్నప్పుడే ప్రేమలో పడతాం. ఆ తర్వాత 15ఏళ్లు కలుసుకోం. చాలా భిన్నమైన ప్రేమకథ.

ఈ సినిమా పాటల గురించి చెప్పండి?
నాగార్జున: ఇందులో మొత్తం ఏడు పాటలున్నాయి. ప్రతి పాట ప్రత్యేకమైనదే. సినిమా షూటింగ్‌ త్వరగా పూర్తి చేసేసరికి పాటలను విడుదల చేయడానికి కూడా మా వద్ద సమయం లేదు.

అల్లరి నరేశ్‌ పాత్రను ఎవరు ఎంపిక చేశారు?
నాగార్జున: అందరం కలిసి సెలెక్ట్‌ చేశాం. ఆ పాత్రకు అతడు కచ్చితంగా సరిపోతాడు.

‘నా సామిరంగ’ అనే టైటిల్‌ పెట్టడానికి కారణం? 
నాగార్జున: కథకు ఈ టైటిల్ కచ్చితంగా సరిపోతుంది. ఈ సినిమాలో నా ఊతపదం ఇది. అందుకే పెట్టాం. దీని రన్‌టైమ్ 2 గంటల 20 నిమిషాలు. మొత్తం 2 గంటల 35 నిమిషాలు షూట్‌ చేశాం. అందులో నుంచి పావుగంట కట్‌ చేయడానికి చాలా కష్టపడ్డాం. ప్రతి సీన్‌ ముఖ్యమైనదిగానే కనిపించింది.

ఎడిటింగ్‌ విషయంలో మీరేమైనా సలహాలిచ్చారా?
నాగార్జున: నాకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులంటే ఆసక్తి ఎక్కువ. ఎడిటింగ్ జరిగాక సినిమా చూస్తాను. ఎక్కడైనా అవసరం అనుకుంటే సలహా ఇస్తానంతే. కచ్చితంగా మార్చాలని చెప్పను. అలా చెబితే వాళ్ల క్రియేటివిటీని మనం తక్కువ చేసినట్లవుతుంది.

ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు ఎలా ఉంటాయి?
నాగార్జున: కథకు అవసరం కాబట్టి ఇందులో చాలా రోజుల తర్వాత మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నా. గతంలో నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇందులో ఎక్కువ యాక్షన్ సన్నివేశాలుంటాయి. సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. గత ఏడాది సెప్టెంబర్‌ 20న నాన్న విగ్రహావిష్కరణ జరిగింది. అదే రోజు ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టాం.

వెబ్‌ సిరీస్‌ ఆఫర్లు వస్తున్నాయా?
నాగార్జున: సినిమాకు వెబ్‌సిరీస్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ‘దూత’ను సినిమాగా తీయలేరు. ఈ సిరీస్‌ కోసం నాగచైతన్య చాలా కష్టపడ్డారు. నాకు అలాంటి కథ దొరికితే చేస్తాను.

తమిళ డైరెక్టర్‌ నవీన్‌తో తీస్తోన్న కథ ఎలా ఉంటుంది?
నాగార్జున: అదొక ప్రపంచం. షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ను పోలి ఉంటుంది.

ప్రస్తుతం ఎన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు?
నాగార్జున: శేఖర్‌ కమ్ముల, నవీన్‌ల దర్శకత్వంలో సినిమాలకు ఓకే చెప్పా.

సంక్రాంతి బరిలో పోటిపడటం ఎలా అనిపిస్తోంది?
నాగార్జున: మేము అనుకున్నన్ని థియేటర్లు దొరకలేదు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సమయంలోనూ ఇదే సమస్య. అప్పుడూ 300 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడూ అంతే.

మీ కుమారులతో కలిసి మల్టీ స్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నారా?
నాగార్జున: ఇంకా ఏం అనుకోలేదు.

100వ సినిమా స్టార్‌ హీరోతో కలిసి తీసే అవకాశం ఉందా?
నాగార్జున: ల్యాండ్‌ మార్క్‌ సినిమాలు స్టార్ హీరోలతో కలిసి తీయాలని అనుకుంటే నా కెరీర్‌లో ‘శివ’, ‘అన్నమయ్య’, ‘నిన్నే పెళ్లాడతా’.. వచ్చేవి కావు.

మహేశ్‌తో కలిసి మల్టీస్టారర్‌ తీస్తారా?
నాగార్జున: గతంలో  ఈ విషయంపై నేను పోస్ట్ పెట్టాను. ఇప్పుడు మహేశ్‌ బిజీగా ఉన్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఆలోచిద్దాం.

‘బ్రహ్మస్త్ర 2’ ఎప్పుడు ఉంటుంది?
నాగార్జున: అయాన్‌ ముఖర్జీ ప్రస్తుతం ‘వార్‌3’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది అయ్యాక మొదలు పెట్టే అవకాశం ఉంది. నాకు రికార్డులు, వసూళ్లపై పెద్ద ఆసక్తి లేదు. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలనుకుంటాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు