Nani interview: వాటిని పట్టించుకుంటే మంచి కథలకు దూరం అవుతాం!

‘‘బాక్సాఫీస్‌ నంబర్లు బయటికి చెప్పుకోవడానికి....ఘనంగా ప్రకటించడానికే ఉపయోగపడతాయి. నా వరకూ నేను చేసిన సినిమా ప్రేక్షకుడికి నచ్చిందా? ఆ సినిమా లక్ష్యం నెరవేరిందా? అనేదే కీలకం’’ అన్నారు నాని.

Updated : 07 Dec 2023 07:01 IST

‘‘బాక్సాఫీస్‌ నంబర్లు బయటికి చెప్పుకోవడానికి....ఘనంగా ప్రకటించడానికే ఉపయోగపడతాయి. నా వరకూ నేను చేసిన సినిమా ప్రేక్షకుడికి నచ్చిందా? ఆ సినిమా లక్ష్యం నెరవేరిందా? అనేదే కీలకం’’ అన్నారు నాని. మాస్‌.. క్లాస్‌ అని చూడకుండా ఎప్పటికప్పుడు విభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్న కథానాయకుడు నాని. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఆయన కథానాయకుడిగా శౌర్యువ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘హాయ్‌ నాన్న’ గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ప్రచారంతోపాటు సెలవుల్ని గడపడానికి అమెరికాకు పయనమవుతూ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు నాని. ఆయన చెప్పిన విషయాలివీ...

ఒకసారి మాస్‌ కథ, ఒకసారి క్లాస్‌ కథని చేయాలనే ‘దసరా’ తర్వాత ‘హాయ్‌ నాన్న’ చేశారా?

‘దసరా’ చేస్తే మాస్‌ ఇమేజ్‌ వస్తుంది, ‘హాయ్‌ నాన్న’ చేస్తే క్లాస్‌ ఇమేజ్‌ వస్తుందనుకోను. దర్శకుడు శౌర్యువ్‌ ఈ కథ చెప్పినప్పుడే ‘ఇది కదా మనం ఈమధ్య మిస్‌ అవుతోంది’ అనే భావన కలిగింది. ఈ మధ్య గమనిస్తే అన్నీ యాక్షన్‌ సినిమాలే. ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’తో సహా. మరి మసాలాతో కూడిన భోజనం తిన్నాక చివర్లో స్వీట్‌ తినాలి కదా. అలాంటి తీయటి సినిమా ఇప్పుడు మనకు కరువైందేమో అనిపించింది. అలాంటి సినిమాని అందించే కథ కావడంతోనే ‘హాయ్‌ నాన్న’ చేశా. ఈ ఏడాది అన్ని రకాల రుచుల్ని ఆస్వాదించాం. చివర్లో స్వీట్‌ని మా సినిమాతో ఇస్తున్నాం.

భావోద్వేగాలే ప్రధానంగా సాగే కథ అనిపిస్తోంది...  

భావోద్వేగాలంటే మరీ ‘జెర్సీ’ స్థాయిలో ఉండదు. సంతోషంగా, ఆహ్లాదంగా ఆస్వాదించే కథ. అక్కడక్కడా ‘అబ్బ...’ అనిపించినా, దుఃఖం మాత్రం కలగదు. తండ్రీ కూతురు బంధం నేపథ్యంలో సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఓ అరుదైన జానర్‌ని స్పృశిస్తున్నట్టే అనిపించింది. మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా... అందరూ చాలా బాగా నటించారు.

మీరు ఓ తండ్రి కావడంతోనే ఈ భావోద్వేగానికి కనెక్ట్‌ అయ్యారా?

మీరు ఎలాంటి కథల్ని ఎంచుకుంటారనే ప్రశ్న ఎదురైన ప్రతిసారీ ఆ సమయంలో ఏదో చెప్పాలి కాబట్టి ఒక లాజిక్‌తో సమాధానం ఇస్తుంటాను. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే ఇలా చెప్పడం సరైంది కాదేమో అనిపిస్తుంది. ప్రేక్షకుడిలా ఆలోచిస్తా, కథే నాకు ముఖ్యం అంటూ ఏవేవో చెబుతుంటాం కానీ... అవేవీ నిజం కాదు. కథ విన్న తర్వాత ఆ క్షణంలో ఓ బలమైన అభిప్రాయం ఏర్పడుతుంది. దాన్ని నమ్మి సినిమా చేయడానికి అంగీకారం తెలుపుతుంటా. అందులో చాలా విషయాలు మిళితమై ఉంటాయేమో కానీ, ప్రత్యేకంగా ఇదే కారణం అని చెప్పలేను. నేను ఏదైనా కథ వింటే, ఆ క్షణమే చెప్పేస్తా. ఇక వారం తర్వాత, ఏడాది తర్వాత ఆలోచిస్తా అని చెప్పి తిప్పించుకోను. నేను సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడు తెలిసిన స్నేహితులు అలా చాలా ఇబ్బంది పడేవాళ్లు.  సమయం అనేది చాలా కీలకం. యువతరంలో ఈ రోజు ఉన్న ఉత్సాహం రేపు  ఉండదు, వాళ్లకి ఈరోజు వచ్చిన ఆలోచనలు రేపు రావు. అందుకే ఏదైనా వెంటనే నిర్ణయం తీసుకుంటా.

ఈ సినిమా కోసం ఉధృతంగా ప్రచార కార్యక్రమాలు చేశారు. దాని వెనక కారణం?

‘దసరా’ ఇచ్చిన అనుభవం అందుకు కారణం.  మేం మంచి సినిమా చేశాం, సినిమానే మాట్లాడుతుందనే ఓ నమ్మకంతో ఉంటాం. మంచి సినిమా చేయడం కాదు, దాన్ని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లాలని ‘దసరా’తో మాకు అనుభవమైంది. ప్రేక్షకుల్లోకి వెళ్లినంత మాత్రాన వాళ్లు చూస్తారా? నేను చెప్పినంత మాత్రాన చూస్తారా? అనుకునేవాణ్ని.  ఎప్పుడూ  ఓ సినిమా పేరు ప్రేక్షకులకి వినిపించేలా చేయాలని, వాళ్లలో ఆసక్తి పెంచాలనే విషయం అర్థమైంది. ‘హాయ్‌నాన్న’ తరహా సినిమాకి అది ఇంకా అవసరం. ట్రెండ్‌ అంతా ఒకవైపు ఉన్నప్పుడు, మనం మరో తరహా కథని ఎంచుకున్నప్పుడు ప్రచారం ఇంకా బలంగా చేయాలి. అది బుధవారం సాయంత్రం వరకే. గురువారం నుంచి మళ్లీ సినిమా మాట్లాడుతుంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తే ఈ జోనర్‌ సినిమాకి ఈ స్థాయిలో రావడం సంతృప్తినిచ్చింది.

కొత్త దర్శకులతో సినిమాలు చేయడమే మీకు సౌకర్యంగా ఉంటుందా?

కథ ఎవరు బాగా చెబితే వాళ్లతో చేస్తా తప్ప, కొత్త దర్శకుడు, పాత దర్శకుడు అని వ్యత్యాసమేమీ ఉండదు. కాకపోతే నాకు కొత్త దర్శకులతో బాగా కుదురుతోంది. కొత్తవాడే కదా రూ: వంద కోట్ల సినిమా ఇచ్చాడు. మంచి కథ చెప్పినప్పుడు ఆ దర్శకుడు ఎవరైతే ఏమిటనేది నా ప్రశ్న.

రూ.వంద కోట్లు వసూళ్లు సాధించిన ఓ సినిమా తర్వాత... ఆ ప్రభావం తదుపరి కథలపై తప్పకుండా ఉంటుంది. ఆ విషయాన్ని మీరెలా చూస్తారు?

ఆ లెక్కల్ని పట్టించుకుంటే మంచి కథలకి దూరం అవుతుంటాం. ఆ లెక్కలేవీ లేనప్పుడు ‘దసరా’ జరిగిపోయింది. అది వంద కోట్లు సాధించిందని, ఇప్పుడు ఆ క్లబ్‌ దిగనంటే ఎలా? అలా లెక్కలేసుకున్నప్పుడే అది కొంచెం, ఇది కొంచెం అంటూ కథల్ని వండటం మొదలుపెట్టాలి. అప్పుడే తప్పులు జరుగుతాయి. ‘ఎవడే సుబ్రమణ్యం?’కి ముందు అలా నేనూ ఎదురు దెబ్బలు తిన్నా.

బలగం వేణు దర్శకత్వంలో మీరు సినిమా చేస్తున్నారా?

తనతో సినిమా చేయడానికి నేను సిద్ధమే. వేణుతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ‘బలగం’ తర్వాత ఇంత ప్రతిభ మన పక్కనే ఉందా అని ఆశ్చర్యపోయా. తను నాతో సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నాడని నిర్మాత దిల్‌రాజు చెప్పారు. కథ కుదిరితే తప్పకుండా చేస్తాం.


‘‘ఒక సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తామనేది ఓ భ్రమ మాత్రమే. దర్శకుడు రాజమౌళి తీసే సినిమాలతోనే అది సాధ్యమనేది నా అభిప్రాయం. ప్రతి సినిమాకీ దానికంటూ ఓ నిర్దిష్టమైన ప్రేక్షకులు ఉంటారు. వాళ్లని మెప్పిస్తే చాలనుకునే రంగంలోకి దిగుతా. నాకు ఇలాంటి కథలే సౌకర్యం అని ఎప్పుడూ అనుకోను. మొదట కామెడీ సినిమాలు చేస్తున్నప్పుడు ఇవే నాని తరహా కథలు అన్నారు. ‘జెర్సీ’ చేస్తున్నప్పుడు తనకి తగ్గ కథలు ఇవే అన్నారు. ‘దసరా’ తర్వాత మాస్‌ అన్నారు. నేను ఇలా అన్ని రకాల కథలూ చేయడానికి ఇష్టపడతా. ‘యానిమల్‌’ తరహా కథ వచ్చినా చేయడానికి సిద్ధమే. ‘జైలర్‌’లో శివరాజ్‌కుమార్‌ చేసినట్టుగా ప్రత్యేక పాత్రల్లో నటించడానికీ నేను సిద్ధమే’’


‘‘పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ప్రయాణాల్లో కానీ, విమానాశ్రయాల్లో కానీ పిల్లలతో పెద్దవాళ్లు ఇబ్బందులు పడుతున్నప్పుడు ‘కాసేపు నేను చూసుకోనా?’ అని చెప్పి దగ్గరికి తీసుకుంటుంటా. వాళ్లూ నాతో అంతే సౌకర్యంగా ఉంటారు. నేను మాట్లాడాక పెద్దవాళ్లలోనూ ‘ఇతను మనవాడే’ అనే అభిప్రాయం కలుగుతుంటుంది. ‘జెర్సీ’లోనూ, ‘హాయ్‌ నాన్న’లోనూ చిన్న పిల్లలతో కలిసి నటించా. చాలా సరదాగా అనిపించింది. మా అబ్బాయి జున్ను నన్ను నాన్న అనే పిలుస్తుంటాడు. తను నాతో ఇంగ్లిష్‌ మాట్లాడటానికి ప్రయత్నిస్తే నేను వినను. ఆ తర్వాత వాడే అర్థం చేసుకుని తెలుగులో మాట్లాడుతుంటాడు’’.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని