Nani: ఆ విషయంలో అల్లరి నరేశ్‌ను పట్టుబట్టా: నాని

నరేశ్‌ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌లో నాని సందడి చేశారు.

Published : 22 Apr 2024 22:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్నేహితులైన టాలీవుడ్‌ హీరోలు అల్లరి నరేశ్‌ (Allari Naresh), నాని (Nani).. ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) ట్రైలర్‌ విడుదల వేడుకలో సందడి చేశారు. నరేశ్‌ హీరోగా నూతన దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమిది. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్‌. మే 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ఈవెంట్‌కు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

‘‘నరేశ్‌ ఎక్కువగా తన చిత్రాల ఈవెంట్లకు నన్ను రమ్మని అడగడు. ఈ సినిమాకి పిలిచాడంటే అది తన మనసుకు ఎంత దగ్గరైందో అర్థమైంది. ఈ సినిమా టైటిల్‌తోనూ తనకు ఎమోషనల్‌ కనెక్షన్‌ ఉంది. నరేశ్‌ని కామెడీ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకోమని ఒకానొక సమయంలో పట్టుబట్టా. తను ప్రతిభావంతుడు. అలాంటివాడు విభిన్న నేపథ్య కథల్లో నటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే అలా చెప్పా. కానీ, ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ చూశాక ‘ఇతడి కామెడీని నేను మిస్‌ అయ్యానా?’ అని అనిపించింది. ఇతర జానర్‌ చిత్రాల మధ్యలో హాస్య ప్రధాన సినిమాలు ప్లాన్‌ చేసుకో’’ అని నాని నరేశ్‌కు సూచించారు. అభిమానులు ‘జెర్సీ’ సీక్వెల్‌ గురించి అడగ్గా.. ‘జెర్సీలో నా పాత్ర పూర్తయింది కదా. జెర్సీ 2 ఎవరితో చేస్తారో చేసుకోండి’ అంటూ నవ్వులు పూయించారు.

నరేశ్‌ మాట్లాడుతూ.. ‘‘అన్ని విభాగాల వారు కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. చాలాకాలం తర్వాత కామెడీ ఫిల్మ్‌తో మీ ముందుకొస్తున్నా. ఈ వేసవిలో మిమ్మల్ని తప్పకుండా నవ్విస్తా’’ అని అన్నారు. ‘సుడిగాడు’ సీక్వెల్‌ వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. మరికొన్ని విశేషాలివీ..

* మళ్లీ కామెడీ చిత్రంలో నటించడం ఎలా అనిపించింది?

నరేశ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు (ఐపీఎల్‌) ఉప్పల్‌ స్టేడియంలో ఆడితే ఎలా ఉంటుందో మళ్లీ కామెడీ చిత్రంలో నటించడం నాకు అలానే అనిపించింది.

* ఏదైనా పాత్రను ఫీలై చేసినప్పుడు సినిమా పూర్తయ్యాక దాన్నుంచి ఎలా బయటకు రాగలుగుతారు?

నరేశ్‌: నటులు స్విచ్ఛాన్‌, స్విచ్ఛాఫ్‌ మోడ్‌లో ఉండాలి. అది కూడా అనుభవం మేరకు వస్తుంది.

* ఈ సినిమా.. మీ ఫాదర్‌ తెరకెక్కించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ని మించి ఉంటుందా? అసలు ఆ పేరు పెట్టడానికి కారణమేంటి?

నరేశ్‌: రెండు కథలు పూర్తిగా విభిన్నం. ఈ సినిమాకి టైటిల్‌గా ఎన్నో పేర్లు అనుకున్నాం. హీరో పాత్ర వ్యవహారశైలిని దృష్టిలో పెట్టుకుని ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని పెట్టాం.

* ఎన్నికల దృష్ట్యా చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి. మీరు విడుదల చేయడానికి కారణం?

నరేశ్‌: దేని దారి దానిదే. వినోదం తెలుగు వారి జీవితంలో ఓ భాగం. బాధలో ఉన్నా, సంతోషమైనా మనలో చాలామంది సినిమాలు చూస్తాం. పైగా సమ్మర్‌ హాలీడేస్‌. 18 ఏళ్లలోపు వారికైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలి కదా.

* మీ కాలిపై ఉన్న టాటూ అర్థమేంటి?

ఫరియా: అది రూట్‌ (వేరు) టాటూ. వేరు ఎంత బలంగా ఉంటే చెట్టు అంత బలంగా ఉంటుంది. మనిషి జీవితంలోనూ అంతే. స్ఫూర్తి కోసమే ఆ టాటూ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని