Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్‌

‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి.

Updated : 18 Mar 2024 12:10 IST

‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. హాస్య ప్రధానమైన పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన... వైవిధ్యమైన నటనతో తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఆయన ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రంలో నటించారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యు.వి.క్రియేషన్స్‌ సమర్పణలో... వి సెల్యులాయిడ్‌తో కలిసి సునీల్‌ బలుసు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి  విలేకర్లతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలివీ..

‘‘హాస్యం ప్రధానంగా సాగే కథ ఇది. ముగ్గురు స్నేహితుల్లో ఒకరైన వినయ్‌ గుమ్మాడి అనే పాత్రలో నేను కనిపిస్తా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కోసం ముగ్గురూ చేరతారు. ఉచిత హాస్టల్‌ సౌకర్యం, ఉపకార వేతనం కోసమే తప్ప వీళ్లకి పెద్ద లక్ష్యాలేమీ ఉండవు. ఇందులో నేను సైన్స్‌ని నమ్మే వ్యక్తిగా దాని గురించే మాట్లాడుతుంటా. మిగతా ఇద్దరేమో తంత్రాలు, మంత్రాల గురించి మాట్లాడుతుంటారు. ఈ కలయికలో పండే వినోదమే ఈ సినిమా. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత నేను, శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ కలిసి చేసిన చిత్రమిదే. ఎంత సరదాగా మా ప్రయాణం సాగిందో, అంతకుమించిన సరదాల్ని సినిమా పంచుతుంది’’.

  • ‘‘దర్శకుడు శ్రీహర్ష తొలి చిత్రం ‘హుషారు’లోనే నేను నటించాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత ‘రౌడీబాయ్స్‌’ కోసం మళ్లీ మేం కలిశాం. కానీ ఆ తర్వాత మారిన తారాగణం వల్ల అప్పుడు కూడా నేనూ, శ్రీహర్ష కలిసి పనిచేయలేకపోయాం. మూడోసారి ఈ సినిమాతో కలిసి పనిచేశాం. ముగ్గురు స్నేహితుల ప్రయాణానికి తోడు, ఫాంటసీ, హారర్‌ ప్రపంచం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. మేం ఇదివరకు చేసిన ‘బ్రోచేవారెవరురా’ కానీ, ముగ్గురు స్నేహితులతోనే కలిసి తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ సినిమాతో కానీ ఈ సినిమాకి ఎలాంటి పోలిక ఉండదు. ఎలాంటి అసభ్యతకి చోటు లేకుండా సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు’’.

  • ‘‘నటుడు పారే నదిలా ఉండాలి. ‘మల్లేశం’ తర్వాత నలభై మంది దర్శకులు నాకు కథలు చెప్పారు. కానీ వాటిలో ఎక్కడా నన్ను నేను చూసుకోలేకపోయా. దాంతో వెంటనే వెళ్లి ‘జాతిరత్నాలు’ చేశా. ఆ పాత్రని కాదనడానికి నాకు కారణమే దొరకలేదు. ‘మల్లేశం’ కథ కూడా ఆ సమయంలో నేనే వేరే చిత్రాల్లో సరదా పాత్రలేవో చేస్తున్నా. అప్పుడు ఈ కథ విన్నాక, ఇంతకంటే గొప్ప హీరో కథని ఎప్పుడూ చూడలేదనిపించి చేశా.
  • ‘బలగం’ సినిమా కూడా అలాంటి అనుభవాన్నే ఇచ్చింది. ఓ గొప్ప పుస్తకం చదివాక అందులోని భావం, విలువలు మనతోపాటే ప్రయాణం చేస్తాయి కదా, అలా ఓ గొప్ప పుస్తకాన్ని చదివిన అనుభూతిని పంచాయి ఈ సినిమాలు. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. మనం చూసే సినిమాలూ మారాయి. అందుకు తగ్గట్టే ప్రయాణం చేయాలి. ప్రస్తుతం ¸గేమ్‌ ఛేంజర్‌’తోపాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నా. ప్రధాన పాత్రధారిగా కథానాయిక నభా నటేష్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నా’’.
  • ‘‘స్నేహితుల చుట్టూ తిరిగే ఇలాంటి బడ్డీ కామెడీ కథలు చేస్తున్నప్పుడు నటులు, రచయితలు చాలా అప్రమత్తంగా ఉండాలి. యువతరం మాట్లాడుకునే భాష అందులో పక్కాగా వినిపించాలి. యువతరం మీమ్స్‌తో ముడిపెట్టి మాట్లాడుతుంటారు, ఆ సందర్భంలో వచ్చిన సినిమా సంభాషణలతో ముడిపెట్టి కబుర్లు చెప్పుకుంటుంటారు. వాటన్నిటినీ పసిగడుతూ ఓ నటుడిగా సెట్లో సంభాషణల్ని మెరుగుపరుచుకుంటూ పలుకుతుంటాం. అప్పుడే టార్గెట్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతాం. అలాగని అసభ్యకరమైన సంభాషణల జోలికి వెళ్లకూడదు. 
  •  ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వచ్ఛమైన కామెడీతో సినిమా చేయడమనేది ఓ పెద్ద సవాల్‌. నటులుగా మేం కూడా ఇంతకంటే ఎక్కువ వెళ్లొద్దని హద్దులు పెట్టుకుంటుంటాం’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని