Shah Rukh Khan: ఆ క్షణం ప్రపంచానికి రాజునయ్యాననిపించింది: షారుక్‌

తన తదుపరి చిత్రం ‘డంకీ’ (Dunki) ప్రమోషన్స్‌లో భాగంగా నెటిజన్లతో ట్విటర్‌ చాట్‌ నిర్వహించారు నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan). నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా బదులిచ్చారాయన.

Published : 07 Dec 2023 02:09 IST

ముంబయి: షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), విక్కీ కౌశల్‌ (Vicky Kaushal), తాప్సీ (Taapsee Pannu) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డంకీ’ (Dunki). రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకుడు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని షారుక్‌ తాజాగా ట్విటర్‌ చాట్‌ నిర్వహించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారిలా..!

‘దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే’లో షారుక్‌ రన్‌ చేస్తున్న వీడియో, ‘డంకీ’లో షారుక్‌ రన్‌ చేస్తున్న ఓ సీన్‌ను కలిపిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అవి చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది?

షారుక్‌: జీవితం ఒక పరుగుపందెం లాంటిది. 11 సర్జరీల తర్వాత కూడా అంతే యాక్టివ్‌గా పరుగెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నా.

‘డంకీ’ చిత్రానికి ఈ విధమైన ప్రమోషన్‌ అవసరమా?

షారుక్‌: ప్రమోషన్‌ కాదు.. నా ప్రతి చిత్రానికీ మీ ప్రేమాభిమానాలు ఎంతో అవసరం.

‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాల్లో లేనిది.. ‘డంకీ’ సినిమాలో ఉన్నది ఏమిటి?

షారుక్‌: చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ. అలాగే, మన కుటుంబ సభ్యుల్లో కనిపించే కొన్ని అందమైన పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి.

ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూడొచ్చా?

షారుక్‌: మై ఫ్రెండ్‌.. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో కలిసి ఈ సినిమా చూడొచ్చు. సెలవు రోజున కుటుంబ సభ్యులందరినీ సినిమాకు తీసుకెళ్లండి. 

సినీ కెరీర్‌లో ఇప్పటివరకూ మీరు నేర్చుకున్న జీవితపాఠం ఏమిటి?

షారుక్‌: కుటుంబం, స్నేహితులకు మించి అందమైనవి మరేవీ ఉండవు.

మీ నుంచి కొన్ని పంజాబీ డైలాగ్స్‌ కోరుకుంటున్నాం?

షారుక్‌: నాకు పంజాబీ మాట్లాడటం అంతగా రాదు. అందుకే, ఆ బాధ్యతను తాప్సీ, విక్కీకి వదిలేశా. వాళ్లు అద్భుతంగా మాట్లాడతారు.

‘డంకీ’ అంటే అసలు అర్థం ఏమిటి?

షారుక్‌: దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ జర్నీ అంటారు. పంజాబీ వాళ్లు దానిని ‘డంకీ’ అని పిలుస్తుంటారు.

ఈ సినిమాలో ఏదైనా రొమాంటిక్‌ సాంగ్‌ ఉందా?

షారుక్‌: ఎస్‌. నా సినిమాలో రొమాంటిక్‌ సాంగ్‌ లేకపోవడమంటే.. మనసు ఉండి గుండెచప్పుడు లేకపోవడంతోనే లెక్క.

(ది ఆర్చీస్‌ ప్రీమియర్‌ షో ఈవెంట్‌ ఫొటో షేర్‌ చేస్తూ..) కాజోల్‌ అంతలా నవ్వుతున్నారు. ఇంతకీ ఏం జోక్‌ చేశారు?

షారుక్‌: ఇంట్లో క్రిస్మస్‌ చేసుకుంటున్నానని.. కాబట్టి బహుమతులు పంపించడం మర్చిపోవద్దని చెప్పా. ఆమె ప్రతి ఏడాది పంపిస్తుంది. కాకపోతే, ఈ ఏడాది కాస్త ఖరీదైన బహుమతి పంపించమని చెప్పా.

‘ది ఆర్చీస్‌’తో సుహానా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడంపై మీ ఫీలింగ్‌ ఏమిటి?

షారుక్‌: పిల్లలు ఎదిగి.. కెరీర్‌లో తొలి అడుగువేయడం తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

‘ది ఆర్చీస్‌’ ప్రీమియర్‌లో సుహానాతో కలిసి నడుస్తోన్న ఫొటోని షేర్‌ చేస్తూ.. ఆ సమయంలో మీ ఫీలింగ్‌ ఏమిటి?

షారుక్‌: ఆ క్షణం ఈ ప్రపంచానికి రాజునయ్యాననే భావన కలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని