SP Sailaja: ఆ హీరోని కాలుతో తన్నాల్సి వచ్చింది ..: ఎస్పీ శైలజ

ప్రముఖ గాయని ఎస్పీ శైలజ (SP Sailaja) ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి వచ్చారు. ఆవిడ సంగీత ప్రయాణానికి సంబంధించి, బాలుగారి గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు.

Updated : 06 Mar 2023 15:19 IST

నాలుగున్నర దశాబ్దాలకు పైగా.. ఆ స్వరం ఆపాత మధురమై.. మదిమదిని మంత్రమై.. బంధమై అల్లుకుంటోంది. ఆ గొంతులో రాగమేదైనా తాళబద్ధంగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు.. ఎస్పీ శైలజ (SP Sailaja). తన గళంలో ఎలాంటి పాటలైనా ఒదిగిపోతాయి. ఆమె పాటల్లో ఎంత మాధుర్యం ఉంటుందో.. ఆమె పలకరింపులో అంతే లాలిత్యం ప్రకటితమవుతుంది. ఇక పాటల్లోనే కాకుండా డబ్బింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు శైలజ. సుమనోహర పాటల పూదోటలో రాగాల విరించి ఎస్పీ శైలజ ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi) కార్యక్రమానికి అతిథిగా వచ్చి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆ సంగతులేంటో చూసేద్దాం.

బాలు గారి(S. P. Balasubrahmanyam) చెల్లెలిగా కాకుండా మీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎలాంటి కృషి చేశారు?

ఎస్పీ శైలజ: ప్రత్యేకమైన కృషి ఏమీ చెయ్యలేదు. నేను అసలు ఇంత పెద్ద సింగర్‌ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా ఒక్క పాట పాడతానేమో సినిమాలో అనుకున్నా. మా ఇంట్లో నేను, అన్నయ్య తప్ప మిగతా వాళ్లందరూ సంగీత వాయిద్యాలు నేర్చుకున్నారు. మా అమ్మకు ఒక్క ఆడపిల్ల అయినా స్టేజ్‌మీద పాడాలని కోరిక ఉండేది. నాన్నగారు అలా బయటకు వెళ్లి పాడడానికి మొదట అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత ఆయన కూడా ఓకే అన్నారు. మా అమ్మ చాలా ప్రోత్సాహం అందించేది. అలా మొదటిసారి ‘మార్పు’ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ఒక్కటే పాట. చక్రవర్తిగారు ఆ పాట మాతో పాడించారు.

మీ బాల్యం గురించి చెప్పండి..

ఎస్పీ శైలజ: నేను నాలుగో తరగతి వరకు చెన్నైలో చదివా. తర్వాత తొమ్మిదో తరగతి వరకు నెల్లూరులో చదివాను. అప్పుడే మొదటిసారి పాడే అవకాశం వచ్చింది.  పదో తరగతి కూడా ప్రైవేటుగా రాశాను. బాల్యమంతా సగం స్కూలు, సగం పాటల పోటీల్లో గడిచింది. ఆటల్లోనూ మొదట ఉండేదాన్ని. కోకో ఆటకు స్టేట్‌ లెవల్ పోటీలకు ఎంపికయ్యా. మా నాన్నగారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఇద్దరు పిల్లలు పుట్టాక చనిపోయారు. అప్పుడు మా అమ్మను చేసుకున్నారు.

మొదటి పాట తర్వాత అవకాశాలు వచ్చాయా?

ఎస్పీ శైలజ: నేను మొదటి పాట పాడి చదువుకోవడానికి వెళ్లిపోయా. ఆ తర్వాత ఆరు నెలలకు నేను పాడగలను అని మా అన్నయ్యకు(S.P.B) నాపై నమ్మకం వచ్చింది. అప్పటి నుంచి తనతో పాటు ప్రోగ్రామ్స్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత చక్రవర్తిగారు వరుసగా అవకాశాలు ఇచ్చారు. 1978 నుంచి చెన్నైలో ఉండిపోయా. అలా పాడుతున్నప్పుడే అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి. ఇళయరాజా గారు చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు.

త్యాగరాజు కీర్తన సరిగా పాడలేదని మీ నాన్నగారు తిట్టారట..

ఎస్పీ శైలజ: మా నాన్నకు త్యాగరాజ స్వామి అంటే ప్రాణం. ఆ కీర్తనలు పాడేటప్పుడు ప్రతిదాన్నీ గమనిస్తారు. సుశీల గారు పాడిన ఓ త్యాగరాజ కీర్తన నేను పాడుతుంటే.. మా నాన్నగారు పిలిచి అలా పాడకూడదు. ఏ తాళంలో ఉంది.. ఏ రాగంలో ఉందో.. అలానే పాడాలి అని దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పించారు. అలాంటి కీర్తనలు పాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని పాడేదానిని. నేను, అన్నయ్య (s.p balu) ఇద్దరిలో ఎవరో ఒకరు హరికథ చెప్పాలని మా తల్లిదండ్రుల కోరిక. కానీ ఎందుకో మా ఇద్దరికీ కుదరలేదు. నేను భరత నాట్యంలోకి అరంగేట్రం చేసినప్పుడు తీసిన ఫొటోలను కె.విశ్వనాథ్‌గారు చూశారు. అలా ‘సాగరసంగమం’ సినిమా అవకాశం వచ్చింది.

‘సాగరసంగమం’ (Sagara Sangamam) సినిమాను ఇంట్లో వాళ్లు అంగీకరించారా?

ఎస్పీ శైలజ: అందరూ ఓకే అన్నారు. నేను మాత్రం మొదట అంగీకరించలేదు. ఇంట్లో అందరూ చెప్పినా.. నేను చెయ్యనంటే చెయ్యనని పట్టుపట్టాను. అప్పుడు విశ్వనాథ్‌గారు మా నాన్నగారి దగ్గరకు వెళ్లి ఆయనతో చెప్పారు. అప్పుడు అంగీకరించాను.

విశ్వనాథ్‌గారితో మీ అనుబంధం?

ఎస్పీ శైలజ: ఆయనతో ఒక దర్శకుడిగా కంటే కూడా ఓ అన్నయ్యగా నాకు అనుబంధం ఎక్కువ. చాలా విషయాలు పంచుకునేవారు. ‘సాగరసంగమం’ సినిమాలో కమల్‌హాసన్‌ గారిని కాలుతో తన్నే సన్నివేశం ఉంది. దానికి నేను ఎంత ప్రయత్నించినా నా కాలు వెనక్కి వచ్చేసేది. అప్పుడు విశ్వనాథ్‌గారు(K.Viswanath) ఇవి కేవలం పాత్రలు మాత్రమేనని వివరంగా చెప్పారు. ఆయనకు కొత్త విషయాలు నేర్చుకోవాలని చాలా ఆశ.

బాలు గారితో కలిసి మొదటిసారి ఎప్పుడు పాడారు..?

ఎస్పీ శైలజ: గుంటూరులో ఓ కచేరిలో పాడాను. అన్నయ్యతో పాడాల్సిన సింగర్‌కు ఆరోగ్యం బాలేక ఆగిపోవాల్సి వచ్చింది. అప్పుడు నన్ను తీసుకువెళ్లారు. నా వయసు పన్నెండేళ్లు. ఎలా పాడతానో అని అందరూ భయపడ్డారు. ఆ ప్రోగ్రామ్‌ ఆర్గనైజర్‌ అయితే నేను పాడలేనేమో అనుకున్నాడు. నన్ను చూసి మా అన్నయ్యతో ‘నా కొంపముంచావు కదయ్యా’ అన్నాడు. కచేరీలో పాడిన పాటలన్నీ నాకు వచ్చినవే అవ్వడం వల్ల పాడేశాను. నాకు సుశీల గారంటే ఇష్టం. మా ఇంట్లో అందరికీ మహ్మద్‌ రఫీ అంటే ఇష్టం. ఆయన ప్రాణం పెట్టి పాడతారు. నా మీద ఎక్కువ సుశీల గారి ప్రభావం ఉంటుంది.

మీరు ఎలాంటి పాటలైనా పాడగలరు. కానీ అవకాశాలు ఎందుకు రాలేదు..?

ఎస్పీ శైలజ: నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా గొప్ప వాళ్లు ఉన్నారు. సుశీల గారు, జానకీ గారు, ఎల్‌.ఆర్‌ ఈశ్వరీ ఇలా.. వాళ్ల మధ్యలో నేను వచ్చి నాకంటూ ఓ పేరు తెచ్చుకోవడమే పెద్ద విషయం. నేను 7 వేల పాటలు పాడాను. గుర్తింపు విషయంలో సంతృప్తిగా ఉన్నాను. విశ్వనాథ్‌గారి దర్శకత్వంలో ‘సిరిమువ్వల సింహనాదం’ అనే సినిమాలో సిరివెన్నెల రాసిన ఓ పాట నేను, అన్నయ్య పాడాం. అది ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇప్పటికైనా అది విడుదలైతే బాగుండు అనిపిస్తుంటుంది. 

చిత్రగారి గురించి చెప్పండి..

ఎస్పీ శైలజ: మేము చాలా సరదాగా ఉంటాం. అన్ని విషయాలు పంచుకుంటాం. ‘మీరిద్దరూ పక్కపక్కన కూర్చోవద్దు’ అని అన్నయ్య చెబుతుండేవాడు. ఎందుకంటే మేమిద్దరం కలిస్తే ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం. వాగుతూనే ఉంటాం (నవ్వుతూ). నేను, చిత్ర కలిసి మనోని ఏడిపిస్తాం.

డబ్బింగ్‌లోకి ప్రవేశం ఎలా జరిగింది?

ఎస్పీ శైలజ: ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాలో రాధికకు డబ్బింగ్‌ కోసం కొత్త వాళ్లని చూశారు. నా వాయిస్‌ ఒకసారి చెక్‌ చేశారు. మరీ చిన్న పిల్ల గొంతులా ఉంది వద్దన్నారు. ఆ తర్వాత చాలా మంది వాయిస్‌లు విని చివరికి నా గొంతే బాగుందని ఓకే చేశారు. అలా మొదలైంది నా డబ్బింగ్‌ ప్రయాణం. తెలుగులో ‘నాంపల్లి స్టేషన్‌ కాడీ రాజాలింగో..’ పాట గుర్తింపు తెచ్చింది. తమిళంలో ఇళయరాజాకు పాడిన మొదటిపాటే బాగా ఫేమస్‌ అయింది. అలాగే కన్నడ, మలయాళంలోనూ కొన్ని పాటలు మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం సినిమాల్లో చాలా తక్కువ పాడుతున్నా. ప్రైవేటు ఆల్బమ్స్‌లో పాడుతున్నాను.

శుభలేఖ సుధాకర్‌ని ఎప్పుడు కలిశారు. పెళ్లి ఎలా కుదిరింది?

ఎస్పీ శైలజ: మా పక్క ఇంట్లో షూటింగ్స్‌ జరుగుతూ ఉండేవి. ఆ ఇంట్లో మా ఫ్రెండ్‌ ఉండేది. తనకోసం వాళ్లింటికి వెళ్లినప్పుడు సుధాకర్‌ గారు పరిచయం అయ్యారు. అంతకు ముందు నేను కచేరి చేస్తున్నప్పుడు ఆయన నన్ను చూశారట. ఇక నా పెళ్లి చాలా సడెన్‌గా నిర్ణయించారు. మా నాన్న చనిపోయాక సంవత్సరంలో పెళ్లి చెయ్యాలని అనుకున్నారు. అన్నీ అమెరికా సంబంధాలే వచ్చాయి. నేను చెన్నైదాటి వెళ్లను అని చెప్పేశా. అప్పుడు జంధ్యాల గారు మా అన్నయ్యతో సుధాకర్‌ గురించి చెప్పారు. మా అమ్మవాళ్లు ఆయన్ని చూడడానికి వెళ్లారు. వాళ్లు వచ్చేసరికి నేను నిద్రపోయా. పొద్దున్నే మా అక్క నిద్రలేపి ఇవాళ నీ నిశ్చితార్థం అని చెప్పింది. నాకు కోపం వచ్చింది. అందుకే నా ఎంగేజ్‌మెంట్‌ ఫొటోల్లో నేను కోపంగా ఉంటాను.

పాటలు, డబ్బింగ్‌ ఈ రెండింటిలో మీకు ఏది కష్టంగా అనిపిస్తుంది?

ఎస్పీ శైలజ: ఏ వృత్తిలో విజయం సాధించాలన్నా కష్టపడాలి. ఆ కష్టాన్ని ఎదుర్కొంటేనే విజయాన్ని చూస్తాం. పాటల్లో ఒక్కోసారి కష్టంగా ఉన్న పాటలు పాడాల్సి వస్తుంది. అలాగే డబ్బింగ్‌లోనూ కొన్ని డైలాగులు సవాళ్లుగా ఉంటాయి. ‘వసంతకోకిల’ సినిమాలో శ్రీదేవికి డబ్బింగ్‌ చెప్పా. అది పూర్తిగా విభిన్నమైన గొంతుతో చెప్పాల్సి వచ్చింది. అలా కష్టం ఏదైనా సరే దాన్ని ఎదుర్కోవాలి.

కొన్ని కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు కదా.. అందులో పాడే వాళ్లని చూస్తే ఏమనిపిస్తుంది?

ఎస్పీ శైలజ: ఇప్పటి పిల్లల్లో ఎంత టాలెంట్‌ ఉందో. వాళ్లు అన్ని రకాల పాటలు పాడగలరు. ఇప్పటి వాళ్లకు తెలుగు భాషపై పట్టు విషయం చూస్తే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. భాషను సరిగ్గా పలికితేనే బాగుంటుంది. అలాకాకుండా.. నాకు రాదు ఇలానే పలుకుతా అంటూ పోతే కొన్నిరోజులకు మన మూలాలు మనం మర్చిపోతాం. మన పురాణాలు ఇప్పటి పిల్లలకు తెలుసో లేదో కూడా నాకు తెలియడం లేదు. ఒక పాట పాడుతున్నాం అంటే దాని లిరిక్స్‌ అర్థాన్ని తెలుసుకుని పాడాలి. పాటకు ఈ విషయంలో ఎప్పటికీ అన్యాయం చేయకూడదు.

బాలు గారు మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భాల గురించి చెప్పండి.

ఎస్పీ శైలజ: అసలు మెచ్చుకోరు. కానీ ఆయన ముఖంలో మనపై ఉన్న ప్రేమ కనిపిస్తుంటుంది. స్టేజ్‌పై పాడినప్పుడు చేయి పట్టుకోవడంలో తెలిసిపోతుంది. అప్పుడప్పుడు ప్రశంసిస్తారు. ‘ఈ ప్రొగ్రామ్ నీదే.. అంత బాగా పాడావు’ అనే వాళ్లు. ఆయన నుంచి చిన్న ప్రశంస వస్తే పెద్ద స్ఫూర్తిగా తీసుకునేదాన్ని. ఇప్పుడు తలచుకుంటే బాధగా ఉంటుంది. గొప్ప వాళ్లందరూ వెళ్లిపోయారు. విశ్వనాథ్‌ గారు, సిరివెన్నెల, వేటూరి, అన్నయ్య.. వీళ్లందరూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. ప్రస్తుతం వాళ్లు మన మధ్య లేకపోయినా..  వాళ్లు ఇచ్చిన కొన్ని వేల పాటలు ఉన్నాయి. వాటిని చూసి స్ఫూర్తి పొందవచ్చని అనుకుంటుంటా.

వేటూరి , సిరివెన్నెల.. ఈ ఇద్దరి సాహిత్యంలో మీరు గమనించిన తేడా ఏంటి?

ఎస్పీ శైలజ: తేడా అంటే నేను చెప్పలేను. వేటూరి గారు ఎలాంటి బాణీకైనా లిరిక్స్‌ రాయగలరు. అవి వింటే ఈ పదం మనకు తెలుసు కదా అనిపిస్తుంది. అలాగే సిరివెన్నెల గారి పాటలు వింటే ఆయన పడిన కష్టం మనకు అర్థమవుతుంది. ఆ పదాల అర్థాలు తెలుసుకోవాలనే తాపత్రయం వస్తుంది. వాళ్లిద్దరు ఒకరు పోతన అయితే మరొకరు శ్రీనాథుడు. 

ఎస్పీ చరణ్‌(S.P.Charan)తో మీ అనుబంధం ఎలా ఉంటుంది?

ఎస్పీ శైలజ: చిన్నప్పుడు అంతా కలిసి పెరిగాం. చరణ్‌కు మొదట పాటలపై ఆసక్తి లేదు. ఈ రంగంలోకి రాను అని చదువుకోవడానికి అమెరికా వెళ్లిపోయాడు. అక్కడి వాళ్లందరూ అన్నయ్య పాటలు పాడడం, వాటి గురించి చర్చించుకోవడం చూసి చరణ్‌కు పాటలపై ఆసక్తి వచ్చింది. అప్పుడు ‘నేను వచ్చేస్తాను.. పాటలు పాడతాను’ అని అన్నయ్యతో చెప్పాడు. కానీ ఒక పెద్ద వృక్షం ఉంటే దాని కింద పిల్ల మొక్కలు రావడం కష్టం. ప్రేక్షకులు బాలుగారి దగ్గర నుంచి ఏది ఆశిస్తారో ఆయన పిల్లల నుంచి కూడా అదే స్థాయిలో ఆశిస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయేమోనని చరణ్‌ సినిమాలకు సంబంధించి చాలా పనులు చేశాడు. ప్రొడక్షన్‌ వైపు వెళ్లాడు. సినిమాలు తీశాడు. ‘ఎస్పీబీ50’ (#spb50) అని మేము వరల్డ్‌ టూర్‌ చేశాం. అది చరణ్‌లో చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు చాలా బాగా పాడుతున్నాడు. బహుశా మా అన్నయ్య పై నుంచి ఆశీర్వాదం ఇస్తున్నాడేమో అనుకుంటా.

మీ అబ్బాయి శ్రీకర్‌ గురించి చెప్పండి

ఎస్పీ శైలజ: మా అబ్బాయికి పాటలు, సినిమాలంటే పిచ్చి. కానీ ఇటువైపు రాలేదు. చదువుకుంటానన్నాడు. వాడికి సంగీత వాయిద్యాలు నేర్పించాలని చాలా ట్రై చేశాం.. కానీ ఏదీ రాలేదు(నవ్వుతూ). ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. పాటలోని రాగాన్ని బాగా గుర్తిస్తాడు. భాషపై పట్టు ఉంది. వాడు అన్నయ్య వాళ్లింటికి వెళ్తున్నా అంటే ఒళ్లు దగ్గరపెట్టుకొని వెళ్లు అని చెబుతా. ఎందుకంటే ఆయన ప్రతిదాన్ని గమనిస్తాడు. మా కుటుంబంలో అందరికి పుస్తకాలు చదివే అలవాటు ఉంది. నేను అన్ని రకాల పుస్తకాలు చదువుతా.

మీరెప్పుడు సంగీత దర్శకురాలు అవ్వాలని అనుకోలేదా..?

ఎస్పీ శైలజ: లేదు. అవకాశాలు వచ్చాయి.. కానీ నేను చెయ్యాలని అనుకోలేదు. కొన్ని సినిమాలకు, ఆల్బమ్స్‌కు సంగీత దర్శకత్వం చెయ్యమని అడిగారు.. నేను అంగీకరించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని