Chandoo Mondeti: నా భార్యకు చెప్పిన డైలాగ్‌ ‘ప్రేమమ్‌’లో పెట్టా..: చందూ మొండేటి

సెలబ్రిటీ టాక్‌ షో ‘అలా మొదలైంది’కి దర్శకుడు చందూ మొండేటి ఆయన భార్య సుజాతతో కలిసి వచ్చారు. వారి జీవితంలో జరిగిన సరదా సన్నివేశాలను పంచుకున్నారు. 

Updated : 18 May 2023 14:15 IST

అందమైన చిత్రాలతో అందరినీ అలరించే చందూ మొండేటి తన భార్య సుజాతతో కలిసి ‘అలా మొదలైంది’ (Ala Modalaindi) కార్యక్రమానికి వచ్చి సందడి చేశారు. ఆయన విజయం వెనుక భార్య సపోర్ట్‌ ఉందంటూ తను చేసిన చిలిపి పనులను పంచుకున్నారు. ఆమెను పెళ్లిచేసుకోవడం కోసం చెప్పిన సినిమా డైలాగులతో సరదాగా గడిపారు. అలాగే చందు లేకపోతే తనకు డాక్టరేట్‌ వచ్చేది కాదని సుజాత చెప్పారు. మరి వీళ్లిద్దరు (Chandoo Mondeti - Sujatha) చెప్పిన ముచ్చట్లు మీకోసం..

మీ ఇద్దరి ప్రయాణం ఎలా మొదలైంది?

చందూ మొండేటి: నేనూ దర్శకుడు పరశురామ్‌ మంచి స్నేహితులం. ఒకరోజు వాళ్లింటికి వెళ్లినప్పుడు సుజాతను చూశాను. చూడగానే నచ్చేసింది. కాసేపు అక్కడే కూర్చున్నాను. ఈ లోపు పరశురామ్‌ వాళ్ల భార్య వచ్చి టిఫెన్‌ చేయమని చెప్పారు. హమ్మయ్య ఇంకాసేపు చూసుకోవచ్చు అనుకొని అక్కడే కూర్చుండిపోయా. (వెన్నెల కిషోర్‌: సుజాత గారు ఆయన చెప్పింది కరెక్టా కాదా.. మీరు చెప్పండి)

సుజాత: నిజమేనండీ. నేను ఉద్యోగం కోసం వచ్చి పరశురామ్‌ వాళ్లింట్లో ఉన్నాను. అక్కడే ఆయన పరిచయమయ్యాడు.

ఆ తర్వాత ఏం జరిగింది?

చందూ మొండేటి: అప్పటి వరకు పరశురామ్‌ వాళ్లింటికి వారానికి ఒకసారి వెళ్లేవాడిని. ఆ తర్వాత వారమంతా వెళ్లడం మొదలుపెట్టా. నాకు ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే చాలా ఇష్టం. నేను మొదటి సారి చూసినప్పుడు సుజాత అలా వాళ్ల చుట్టాలందరితో మాట్లాడుతూ కనిపించింది. అందుకే లాక్‌ అయ్యానేమో. మా ఇద్దరి విషయం పరశురామ్‌తోనే ఇంట్లో వాళ్లకు చెప్పించాలనుకున్నాం. ఆయన మా పెళ్లికి చాలా సపోర్ట్‌ చేశారు. మేమిద్దరం ప్రేమించుకునే సమయంలో మా విషయాన్ని బయటకు చెప్పకుండా చాలా రహస్యంగా ఉంచాం.

సుజాత: మా బ్యాచ్‌తో కలిసి ఎంజాయ్‌ చేసే వాళ్లం. అందులో చందూ కూడా ఉన్నాడు. కొన్ని రోజులకు మా పరిచయం ప్రేమగా మారింది. నాకు చాలా సపోర్ట్‌ ఇచ్చేవాడు. అలా కొన్నిరోజులకు ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని తల్లిదండ్రులకు చెప్పాం. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.

మిమ్మల్ని ఇంప్రెస్‌ చేయడానికి ఆయన ఏం చేసేవారు ?

సుజాత: సినిమాలో డైలాగులు చెప్పేవాడు. పవన్‌ కల్యాణ్‌, రజనీకాంత్‌లను ఇమిటేట్‌ చేసేవాడు. అలా ఏదో ఒకటి చేసి నేను తనవైపు చూసేలా చూసేవాడు.

చందూ మొండేటి: చాలా చేశాను. తను మాత్రం చాలా సైలెంట్‌. నేను తన కోసం ఇన్ని చేస్తున్నానని తెలిసి కూడా ఏం తెలియనట్లే ఉండేది. వైజాగ్‌ నుంచి వచ్చింది కదా.. అలానే ఉంటారు (నవ్వులు). తనని ఏడిపించడానికి నాకు ఒక్క నిమిషం చాలు. వైజాగ్‌ను ఒక్క మాట అన్నా తను వెంటనే మూతిముడిచేసుకుంటుంది. 

మీరెప్పుడైనా మీ భార్యను సరదాగా ఏడిపించారా?

సుజాత: ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు.

చందూ మొండేటి: అది ఏడిపించడం కాదు. అదో సరదా. ప్రాంక్‌ చేస్తుంటా. టీవీలో టైమర్‌ పెట్టి ఆఫ్‌ అయ్యేలా చేస్తాను. ఆ సమయంలో లైట్స్‌ అన్నీ ఆపేసి సౌండ్‌ చేస్తాను. విచిత్రమేమిటంటే ప్రతిసారీ భయపడుతుంది.

మీ ప్రేమ గురించి చెప్పగానే ఇంట్లో అంగీకరించారా?

సుజాత: వాళ్లేం వద్దని చెప్పలేదండీ. ఇలా మూవీ డైరెక్టర్‌ కావాలని ట్రై చేస్తున్నాడు. ఏదో ఒకరోజు కచ్చితంగా ఉన్నత స్థానానికి వెళ్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా మేమిద్దరం ఒకరికి ఒకరం సపోర్ట్‌ చేసుకుని బతకగలం అని చెప్పాను.

పెళ్లి తర్వాత లైఫ్‌ ఎలా ఉంది?

చందూ మొండేటి: సుజాత చాలా కష్టపడుతుంది. పొద్దునే లేచి వంట చేసి ఉద్యోగానికి వెళ్లేది. తను వెళ్లిపోగానే మా ఫ్రెండ్స్‌ ఇంటికి వచ్చేవాళ్లు. తను 5కు వస్తుందంటే 4.30కు వాళ్లంతా వెళ్లిపోయే వాళ్లు. సుజాత తొమ్మిదోనెల ప్రెగ్నెంట్‌ సమయంలోనూ ఉద్యోగం చేసింది.  వద్దు అని చెప్పినా.. డబ్బులు ఉంటే అవసరానికి పనికొస్తాయని చెప్పింది. నాకు అన్ని రకాలుగా సపోర్ట్‌ ఇస్తుంది.

మీరు తీసే సినిమా కథలను మీ భార్యకు చెబుతారా?

చందూ మొండేటి: చెబుతాను. కానీ, నేను స్టోరీ చెప్పేటప్పుడు ఒక్క నిమిషం పక్కకు వెళ్లినా కోపం వస్తుంది.

సుజాత: మేము సినిమాకు వెళ్లాలంటే ఒక పరీక్షకు వెళ్తునట్లే వెళ్లాలి. సినిమా హాల్లో సందేహం వస్తే అడగకూడదు. సినిమా అంతా అయ్యాక అప్పుడు అడగాలి. ఎగ్జామ్‌ రాసినట్లు ఉంటుంది. (చందు: అందుకే నాతో సినిమాకు వచ్చిన ప్రతిసారీ ఇదే చివరిది.. నీతో ఇక సినిమాకు రాను అంటుంది.)

చందు మీద కంప్లైంట్స్‌ ఉన్నాయా మీకు?

సుజాత: చాలానే ఉన్నాయండీ. ఆన్‌లైన్‌లో ఉన్నా ఫోన్‌ తీయరు. మెసేజ్‌కు రిప్లై ఇవ్వరు. మనం మాట్లాడేటప్పుడు మనవైపు చూడకుండా ఫోన్‌ చూస్తూ మాట్లాడతారు. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తుంటాడు. రోజూ ఎవరో ఒక ఫ్రెండ్‌ వచ్చారంటూ వెళ్తారు.

చందూ మొండేటి: నాకు మెసేజ్‌లు చూసే అలవాటు లేదు. ఫోన్‌ మాత్రం అసలు తీయకుండా ఉండను. ఒకవేళ చూడకపోతే తర్వాతైనా చేస్తాను. ఒక పుట్టినరోజు నాడు ఉదయం 6 గంటలకు కేక్‌ కట్‌ చేయించి గొలుసు గిఫ్ట్‌ ఇచ్చాను. అయినా రోజంతా డల్‌ గానే ఉంది. తర్వాత రోజు అడిగితే.. రాత్రి 12 గంటలకు చైన్‌ ఇవ్వలేదని అలిగింది. సినిమా విడుదలైనప్పుడు ఉండే టెన్షన్‌ పుట్టినరోజులకు, పెళ్లిరోజుకు ఉంటుంది. తను చాలా సున్నిత మనస్కురాలు. ఎప్పుడు కోపమొచ్చినా నేనే బతిమాలుకుంటా. 

ప్రాంక్‌ కాల్స్‌ చేశారా?

చందూ మొండేటి: పెళ్లికి ముందు వేరే నంబర్‌ నుంచి ఫోన్‌ చేసింది. నాకు తెలియక మాట్లాడుతూనే ఉన్నాను. ఒకసారి పరశురామ్‌ ఫోన్ చేసి ‘సుజాత తన ఫ్రెండ్‌తో కలిసి నాకు ఫోన్‌ చేస్తుందని’ చెప్పారు. విషయం తెలిసినా కూడా నేను తెలియనట్లే మాట్లాడాను. కొన్ని రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చి.. మిమ్మల్ని ఏడిపించింది మేమే అని సంబర పడ్డారు. నేను మనసులో నవ్వుకున్నాను.

గొడవలు ఎక్కువ ఎవరు పెట్టుకుంటారు?

చందూ మొండేటి: తనే. కానీ ఆ ప్రభావం మాత్రం నాపై ఉంటుంది (నవ్వులు).

మీ ఇద్దరిలో క్రేజీ ఎవరు?

సుజాత: తనే.

చందూ మొండేటి: నేను చాలా క్రేజీగా ఉంటాను. సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటాను. వాళ్ల చుట్టాలందరూ చందు లాంటి భర్త రావాలి అని అంటుంటారు. (సుజాత: అందుకే చందుకు మా వాళ్లు హడావిడి కేంద్రం అని పేరు పెట్టారు).

అబద్ధాలు ఎవరు చెబుతారు?

సుజాత: తను అబద్ధం చెబుతాడని తెలిసి కూడా నేను అడుగుతాను. ఒక విషయం చెప్పాలి.. కొన్నిరోజుల ముందు ఫోన్‌ వచ్చిన ప్రతిసారి బయటకు వెళ్లి చిన్నగా మాట్లాడుతున్నాడు. తనకు తెలియకుండా నేను ఆ నంబర్‌ తీసుకుని వాళ్లకు ఫోన్‌ చేశా. వాళ్ల దగ్గర చందు అప్పు తీసుకున్నాడట.. అందుకే పక్కకు వెళ్లి మాట్లాడుతున్నాడని అర్థమైంది.

చందూ మొండేటి: అబద్ధాలు చాలా తక్కువ చెబుతాను.

మీ ఇద్దరి లైఫ్‌లో జరిగిన సంఘటనను సినిమాల్లో పెట్టారా?

చందూ మొండేటి: పెళ్లికి ముందు సుజాతకు చెప్పిన మాట ‘ప్రేమమ్‌’ సినిమాలో పెట్టాను. ‘అందమైన అమ్మాయిలందరూ సినిమాల్లోనే ఉండరు. కొంతమంది టీచర్స్‌గా కూడా ఉంటారు’ ఈ డైలాగ్‌ చాలా పాపులర్‌ అయింది. నాకు నాగార్జున గారంటే చాలా ఇష్టం.

ఆయన లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.. అనే సంఘటన ఏమైనా ఉందా?

సుజాత: ఉందండీ. నేను కొన్ని కారణాల వల్ల పీహెచ్‌డీ మధ్యలో ఆపేశాను. తన ప్రోత్సాహంతోనే పూర్తిచేసి డాక్టరేట్‌ తీసుకున్నా. ఆయన లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు.

చందూ మొండేటి పెళ్లికాక ముందు చేసి అల్లరి పనులేంటి.. అలాగే ఆయన ఫ్రెండ్స్‌ను కలవడానికి వెళ్లినప్పుడు సుజాతకు ఏం పాట పంపుతారు.. ఇలాంటి సరదా కబుర్లతో సాగిన చందు, సుజాతల ‘అలా మొదలైంది’ ఎపిసోడ్‌ను  ‘ఈటీవీ విన్‌’ యాప్‌లో వీక్షించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని