Laya: నా గురించి అలా రాయడం చూసి బాధేసింది: లయ

నటి లయ (Laya) తాజాగా ‘ఆలీతో సరదగా’ కార్యక్రమలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు. 

Published : 23 May 2024 09:55 IST

పికాసో చిత్రమైనా.. ఎల్లోరా శిల్పమైనా నటి లయ (Laya)అందాన్ని చూసి అసూయ పడతాయి. ఆమెను చూస్తే ప్రేక్షకుల మనసులు ఆనందపడతాయి. తెలుగమ్మాయిగా చిత్రసీమలో అడుగుపెట్టి.. తన అభినయంతో వరుస నంది అవార్డులను అందుకున్నారు. నటిగా, నర్తకిగా, గృహిణిగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఉంటూ సోషల్‌ మీడియా ద్వారా మనల్ని ఎప్పుడూ పలకరించే లయ తాజాగా ‘ఆలీతో సరదాగా’(Alitho Saradaga) కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. తన (Actress Laya) కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇప్పుడు కృష్టా జిల్లా అమ్మాయివా.. అమెరికా అమ్మాయివా?

లయ: నేను అమెరికా వెళ్లినప్పటికీ విజయవాడ అమ్మాయినే. అందుకే తెలుగు అమ్మాయిననే పలకరించండి. నేను చేసిన చివరి సినిమా ‘టాటా బిర్లా మధ్యలో లైలా’. 

అమెరికా లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు ఇండియాకు రావడానికి కారణమేంటి?

లయ: 2007లో అమెరికాకు వెళ్లాను. పెళ్లి అయ్యాక పూర్తి సమయం కుటుంబానికి కేటాయించాలనుకున్నా. పిల్లలు పెరిగే సమయంలో వాళ్లతో ఉండాలని నిర్ణయించుకున్నా. అలానే ఉన్నాను. ఇప్పుడు పిల్లలు వాళ్ల పనులు వాళ్లు చేసుకోగలుగుతున్నారు. అందుకే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాను. నితిన్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తోన్న ‘తమ్ముడు’లో చేస్తున్నా.  ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది. అందుకే ఇండియా వచ్చాను.

అమెరికా ఎప్పుడు వెళ్లారు?

లయ: 2007లో వెళ్లాను. ఇప్పుడు హైదరాబాద్‌ను చూసి ఆశ్చర్యపోయాను. చాలా డెవలప్‌ అయింది. నేను అమెరికాలో చాలా ఏళ్లు జాబ్‌ చేశాను. 

మీ అమ్మానాన్నల గురించి చెప్పండి?

లయ: మా నాన్న డాక్టర్‌. నేను ఒక్కదాన్నే. అమ్మానాన్న నన్ను గారాబంగా పెంచినప్పటికీ హద్దు మీరితే వెంటనే తిట్టేవాళ్లు. కాకపోతే అలా కఠినంగా ఉండడం నాకు ఉపయోగపడింది. నేను కొన్నిసార్లు పల్లీమసాల తినడానికి మైసూర్‌ వరకు వెళ్లేదాన్ని. అక్కడ ఉన్నంత రుచిగా ఎక్కడా ఉండదు.

ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?

లయ: ఇండస్ట్రీకి రావడానికి కారణం మా తల్లిదండ్రులే. ‘స్టార్‌ 2000 కంటెస్ట్‌’ ప్రకటన చూసి నాకు ఇష్టం లేకపోయినా తెలియకుండా నా ఫొటోస్‌ పంపారు. అందులో నేను సెకండ్‌ వచ్చాను. ఆ తర్వాత విజయవాడలో ఓ కార్యక్రమంలో ‘స్వయంవరం’ చిత్రబృందం నన్ను చూసి సినిమాలో నటిస్తారా అని అడిగారు. మా పేరెంట్స్ అంగీకరిస్తే నటిస్తానని చెప్పాను. వాళ్లు మా నాన్నను కలిసి పర్మిషన్‌ తీసుకున్నారు. అలా ‘స్వయంవరం’లో అవకాశం వచ్చింది. నేను హీరోయిన్‌ అయి 25 ఏళ్లు పూర్తయింది. 

మీరు చెస్‌లో నేషనల్‌ ఛాంపియన్‌ కదా.. ఎక్కడ నేర్చుకున్నావు?

లయ: నేను కోనేరు హంపి వాళ్ల నాన్న దగ్గర చెస్‌ నేర్చుకున్నా. 7 సార్లు నేషనల్స్‌కు వెళ్లాను. ఒకసారి గెలిచాను.

మొదటి సినిమా ఏది? అవకాశం ఎలా వచ్చింది?

లయ: బాలనటిగా ‘భద్రం కొడుకో’లో చేశాను. మా అమ్మ ఓ స్కూల్లో మ్యూజిక్‌ టీచర్‌గా చేసేది. ఆ స్కూల్‌ తరఫున విహారయాత్రకు వెళ్లాం. ఆ సినిమా దర్శకుడు నన్ను చూసి యాక్టివ్‌గా ఉన్నానని ఎంపిక చేశారు. అప్పుడు నేను చాలా చిన్న పిల్లని. ‘అమ్మోరు’లో కూడా చేయాల్సింది. కానీ, నేను పొడుగ్గా ఉన్నానని తీసుకోలేదు.

లయ ఇబ్బందుల్లో ఉందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. మీరు చూశారా?

లయ: చూశాను. మనం రోజూ కనిపిస్తూ ఉంటే మన గురించి వార్తలు వచ్చినా ఎవరూ నమ్మరు. నేను సోషల్‌మీడియాకు దూరంగా ఉండడంతో రకరకాల వార్తలు రాశారు. నా ఆర్థిక స్థితి అసలు బాలేదని, టీ అమ్ముకొని బతుకుతున్నట్లు చాలా దారుణంగా రాశారు.  అది చూసి కుటుంబం బాధ పడింది. నాపై అలా రాయడం చూసి నేనూ బాధపడ్డాను.

మీకు పులిహోరంటే ఇష్టమట నిజమేనా? కాలేజీకి వెళ్లకుండా సినిమాలు చూసేవారట?

లయ: చాలా ఇష్టం. నేను బాగా చేస్తాను. చాలారకాల పులిహోరాలు చేస్తాను. కాలేజీ మానేసి మరీ ఎక్కువగా ఫ్రెండ్స్‌తో లవ్‌స్టోరీ సినిమాలు చూసేదాన్ని.  ఎందుకంటే మాములు సినిమాలు అందరితో చూడొచ్చు కానీ, లవ్‌స్టోరీస్‌ చూడలేం కదా.  

ఈ సినిమా అనవసరంగా అంగీకరించా.. అనుకున్న సందర్భం ఏదైనా ఉందా?

లయ: ఇప్పుడొచ్చే ఆర్టిస్టులు చాలా తెలివైనవారు. ‘స్వయంవరం’ హిట్ అయిన తర్వాత ఎవరైనా దానికి మించిన సినిమాను చేస్తారు. నేను ‘మా బాలాజీ’ అనే చిత్రం అంగీకరించాను. అందులో నాది విడో పాత్ర. ఆ సినిమా బాగున్నా.. నేను ఆ సమయంలో దాన్ని చేసుండాల్సింది కాదు. అలాంటి సినిమాలు రెండు, మూడు చేశాను. నా అదృష్టం బాగుండి.. తర్వాత కూడా మంచి సినిమాలు వచ్చాయి. 

మీ పెళ్లి ఎప్పుడు జరిగింది. మీ ఆయన ఏం చేస్తుంటారు?

లయ: మా ఆయన పేరు శ్రీ గణేశన్‌. అమెరికాలో డాక్టర్‌. 2006లో పెళ్లి అయింది. 2005లో మొదటిసారి ఓ కార్యక్రమం కోసం అమెరికా వెళ్లాను. అక్కడ మా వారి బంధువు నన్ను చూసి పెళ్లి గురించి ప్రస్తావించారు. పెళ్లి చూపుల కంటే ముందు రెండు నెలలు ఫోన్‌లో మాట్లాడుకున్నాం. అలా చూసిన మొదటి సంబంధమే కుదిరింది. మా పిల్లలకు తెలుగు చదవడం, రాయడం వచ్చు. మాట్లాడడం రాదు.

‘స్వయంవరం’లో వేణుతో చేయడం ఎలా అనిపించింది?

లయ: ఆ సినిమా మొత్తం నేను స్టూల్‌ వాడాను. అది వేణుకు, నాకు ఇద్దరికీ తొలి సినిమానే. ఆయన చాలా మంచి వ్యక్తి. నా సినిమా విడుదలయ్యాక థియేటర్లో చూసుకోవాలంటే నాకు భయం. ఎలా చేశానో అని భయపడ్డాను. ఇప్పటికీ అదే భావనలో ఉన్నా.

తొమ్మిదో తరగతిలో బైక్‌ కోసం ఏదో గోల చేశారట.. ఏంటది?

లయ: బైక్ కావాలని మొదట అడిగాను. కొనివ్వలేదు. దాంతో అలిగాను. చేసేదేమీ లేక కొనిచ్చారు. చాలా ప్రామిస్‌లు చేశాను. నెమ్మదిగా నడుపుతానని, ఒక్కదాన్నే వెళ్తానని. కాని ట్రిపుల్‌ రైడ్‌కు వెళ్లడంతో పోలీసులు చాలాసార్లు పట్టుకున్నారు.

మీ అమ్మాయి కూడా నటించిందని విన్నాను. ఏ సినిమాలో?

లయ: ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’లో నటించింది. చిన్నప్పుడు ఇలియానాగా చేసింది. తను సినిమాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నా. 

మీకు లవ్‌ లెటర్స్‌ ఎన్ని వచ్చాయి?

లయ: చాలానే వచ్చాయి. లెక్కపెట్టలేదు. సినిమా షూటింగ్‌ల కారణంగా కాలేజ్‌కు తక్కువగా వెళ్లేదాన్ని. లవ్‌ లెటర్‌ ఇస్తారనే భయంతో ప్రేమికుల రోజు కాలేజ్‌కు వెళ్లేదాన్ని కాదు. ఎవరైనా లెటర్‌ ఇస్తే ఎలా స్పందించాలో అర్థమయ్యేది కాదు.

‘ప్రేమించు’ విశేషాలు పంచుకోండి?

లయ: అద్భుతమైన సినిమా. చాలా నంది అవార్డులు వచ్చాయి. ఆ సినిమాలో నా పాత్ర కోసం చాలా ప్రాక్టీస్‌ చేశాను. అంధుల మేనరిజం నేర్చుకున్నా. దర్శకుడు నాకు చాలా సపోర్ట్‌ చేశారు.

దర్శకుడు కె.విశ్వనాథ్‌ గారి సినిమాలో (స్వరాభిషేకం) నటించడం ఎలా అనిపించింది?

లయ: సెట్‌లోకి వెళ్లగానే దైవత్వం కనిపిస్తుంది. మాటల్లో వర్ణించలేం. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని.

ఓ దర్శకుడు మిమ్మల్ని చంపేస్తా అని బెదిరించారట.. ఎందుకు?

లయ: డేట్స్‌ సర్దుబాటు విషయంలో గొడవ జరిగింది. దీంతో ఆయన చంపేస్తానని బెదిరించారు. మీరు చంపేసినా నేను ఏమీ చేయలేను అని చెప్పాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు