alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్‌

ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌  ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే..

Updated : 20 Mar 2024 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆయన ఆట ఎందరికో ఆదర్శం. భారతదేశానికి గర్వకారణం. ఎందరో గెలుపునకు ఆయనో మూలకారణం. ఆయనే బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ (Pullela Gopichand). తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వచ్చి తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే క్రికెటర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి.. ప్రతిభను గుర్తిస్తూ.. క్రీడారంగానికి ఎన్నో సేవలు అందిస్తున్న చాముండేశ్వర నాథ్‌ (Chamundeshwar Nadh) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కొన్ని విషయాలు షేర్‌ చేశారు. అవేంటో చదివేయండి. 

మీ కుటుంబ నేపథ్యమేమిటి? క్రికెట్‌ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారు?
చాముండేశ్వర నాథ్‌: మా తాతగారు వాళ్లు జమీందారులు. మా అమ్మ వాళ్లది కూడా పెద్ద ఫ్యామిలీనే. మా అమ్మ వాళ్లింట్లో షూటింగ్‌లు జరిగేవి. నాకు చదువు మీద ఆసక్తి ఉండేది కాదు. ఇంటర్‌లో అన్ని సబ్జెట్‌లు కలిపి 38 మార్కులు వచ్చాయి. చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఇష్టం. మా నాన్న ప్రోత్సహించారు. అలా క్రికెట్‌ వైపు వచ్చాను. 

2001లో పుల్లెల గోపీచంద్‌కు వచ్చిన గొప్ప ప్రశంస ఏది?
పుల్లెల గోపీచంద్‌: ఆ సంవత్సరం నేను ఆల్‌ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్‌ గెలుచుకున్నా. అప్పుడు చాలామంది ప్రశంసించారు. ఆరోజు మా అమ్మ చాలా సంతోషించింది. ‘బాగా ఆడావు’ అని చెప్పింది. ఆ ఒక్కమాట నాకు చాలా ఆనందాన్నిచ్చింది. 

మీకు చాముండేశ్వరనాథ్‌తో ఎలా పరిచయం ఏర్పడింది?
పుల్లెల గోపీచంద్‌: ఆయన అన్ని క్రీడలను ఫాలో అవుతారు. గెలిచిన వాళ్లకు కార్లు బహుమతిగా ఇస్తారు. అలా మా పరిచయం ఏర్పడింది.
చాముండేశ్వర నాథ్‌: నేను మొదట కారు గిఫ్ట్‌గా ఇచ్చింది పుల్లెల గోపీచంద్‌కే. 2001లో ఇచ్చాను. ఇప్పటివరకు విన్నర్స్‌కు 24 కార్లు బహుమతిగా ఇచ్చాను. 

మిమ్మల్ని స్కూల్లో మోకాళ్లపై నిలబెట్టేవారట.. ఎందుకు?
పుల్లెల గోపీచంద్‌: ఎక్కడ టోర్నమెంట్‌ జరిగినా వెళ్లేవాడిని. దీంతో స్కూల్‌కు వెళ్లడం కుదిరేది కాదు. వెళ్లిన రోజుల్లో టీచర్‌ ఏమైనా అడిగితే చెప్పేవాడిని కాదు. సగం రోజులు మోకాళ్ల మీద నిలబెట్టేవారు. నేను అలా బయట నిల్చున్నప్పుడే ‘గోపీచంద్‌ ఫలనా టోర్నమెంట్‌ గెలిచాడు’ అని అనౌన్స్‌మెంట్‌ వచ్చేది. అందరూ చప్పట్లు కొట్టేవాళ్లు. తర్వాత ఆ స్కూల్ వాళ్లే నన్ను చూసి చాలా గర్వపడ్డారు.
చాముండేశ్వర నాథ్‌: నేను స్కూల్లో ఎప్పుడూ నిల్చొని పరీక్షలు రాసేవాడిని. టీచర్స్ ఎందుకని అడిగితే. కూర్చుంటే ముందు వాళ్ల పేపర్‌ కనిపించడం లేదనేవాడిని. పరీక్షలన్నీ అలా చూసి రాసినవే.

మీకు జాబ్‌ వచ్చిందంటే ఎవరూ నమ్మలేదుట.. నిజమేనా?
చాముండేశ్వర నాథ్‌: 1970ల్లో బ్యాంక్‌ జాబ్‌ రావడం చాలా గొప్ప. నాకు ఆ ఉద్యోగం వచ్చేసరికి మా నాన్న నమ్మలేదు. ఐదు రోజుల తర్వాత ఇంటికి లెటర్‌ వచ్చినప్పుడు నమ్మారు. నాకు అప్పట్లో పైసలకు, రూపాయలకు తేడా తెలియక.. బ్యాంక్‌లో లెక్క రాస్తూ పైసలన్నిటినీ రూపాయల్లో రాసేశా. దీంతో కోట్ల రూపాయలు తేడా వచ్చింది. తర్వాత రోజే బ్యాంక్‌ నుంచి పంపించేశారు. నా భార్య కూడా అక్కడే పనిచేసేది. ‘ఐలవ్‌యూ’ అని రాసిన పేపర్‌ను ఫైల్‌లో పెట్టి ఇచ్చాను. ఓకే చేసింది. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు. 

మీకు ప్రపోజ్‌ చేసిన అమ్మాయికి రూల్స్ పెట్టారట? ఎందుకు?
పుల్లెల గోపీచంద్‌: రాజమండ్రి అమ్మాయి నాకు ప్రపోజ్‌ చేసింది. తనంటే నాకూ ఇష్టమే. నాకు ఎప్పుడూ ఆట మీదే శ్రద్ధ ఉండేది. దీంతో ఎక్కువగా ఫోన్‌లు మాట్లాడడం కుదిరేది కాదు. 2001లో ఆ అమ్మాయిని అమ్మకు చూపించా. వాళ్లు అంగీకరించారు. వెంటనే పెళ్లైంది.
చాముండేశ్వర నాథ్‌: ఆ అమ్మాయి గోపీ కన్నా ముందే ఒలింపిక్స్‌ ఛాంపియన్‌. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొదటి మహిళా ఛాంపియన్‌. గోపీ కోసం లక్షన్నర రూపాయల జీతం వచ్చే జాబ్‌ను వదిలేసింది. ఇప్పుడు పిల్లలను చూసుకుంటోంది.

మీరు బ్యాడ్మింటన్ ఎలా ఆడతారో.. మీ భార్య అలిగినప్పుడు కూడా అలానే బతిమలాడుతారట? 
పుల్లెల గోపీచంద్‌: మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు(నవ్వుతూ). మా పెళ్లి అయ్యాక 7 ఏళ్లకు బయటకు వెళ్లాం. నేను అంత బిజీ పర్సన్‌. తను నన్ను చాలా అర్థం చేసుకుంటుంది. 

మీ దగ్గర కోచింగ్‌ తీసుకొని గొప్ప వాళ్లు అయ్యాక వదిలేసి వెళ్లిన వాళ్లకు మీరేం చెబుతారు?
పుల్లెల గోపీచంద్‌: అకాడమీలో వెళ్లే వాళ్లు వెళ్తుంటారు. ఉండేవాళ్లు ఉంటారు. ఏది జరిగినా ఎక్కువ ఆలోచించను. అకాడమీ మొదలుపెట్టడానికి చాలామందిని డబ్బులు అడిగాను. కొందరు స్పందించడం, ఫోన్లు తీయడం మానేశారు. నేను కనిపిస్తే పక్క నుంచి వెళ్లేవారు. చివరి ఆప్షన్‌గా మాకున్న ఫ్లాట్‌ అమ్మేయాలని నిర్ణయించుకున్నా. అదే సమయానికి తెలిసిన ఒకాయన రూ.3 కోట్లు అప్పు ఇచ్చారు. దాంతో అకాడమీ ప్రారంభించాను. తర్వాత గవర్నమెంట్‌తో స్థలం విషయంలో కోర్టు కేసులో 6 ఏళ్లు పోరాడాను. చివరకు నేనే గెలిచాను. ఇలాంటి ఒడుదొడుకులు ఎన్నో చూశాను. కష్టం వచ్చిన ప్రతిసారీ దేవుడు ఎవరో ఒకరిని పంపుతారు. నా కష్ట సమయంలో చాలామంది నాకు తోడుగా ఉన్నారు. చాముండేశ్వర నాథ్‌ మా ఫ్యామిలీ ఫ్రెండ్‌.

ఇప్పుడు మీరు హైదరాబాద్‌లో రెండు అకాడమీలు నడుపుతున్నారు కదా.. ఎలా అనిపిస్తోంది?
పుల్లెల గోపీచంద్‌: ఒకప్పుడు బ్యాడ్మింటన్‌ నేర్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ కష్టం ఇప్పుడు పిల్లలు పడకూడదని నేను రెండు అకాడమీలు పెట్టాను.

మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కువ సపోర్ట్‌ చేసిందెవరు?
చాముండేశ్వర నాథ్‌: నా కుటుంబం. వైజాగ్ స్టేడియానికి నేనెంతో చేశా. రూ.10లక్షలు తీసుకున్నానని నాపై ఆరోపణలు వచ్చాయి. తర్వాత నిజం తెలిశాక క్షమాపణలు చెప్పారు. బీసీసీఐ సెలక్షన్‌ కమిటీలో ఏడేళ్లు ఉన్నాను. ఆ సమయంలో 15 మంది ఇండియా తరఫున ఆడారు. ఇప్పుడు భారత్ కోసం ఆడుతోన్న వాళ్లలో నేను సెలెక్ట్‌ చేసిన వాళ్లే చాలామంది ఉన్నారు. 

ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరు?
చాముండేశ్వర నాథ్‌: చాలామంది ఉన్నారు. జగపతిబాబు నాకు మంచి స్నేహితుడు. వాళ్ల భార్య కూడా మా ఫ్యామిలీ ఫ్రెండే.

మీకు వచ్చిన అవార్డులన్నిట్లో ఏదంటే ఎక్కువ ఇష్టం?
పుల్లెల గోపీచంద్‌: మోదీ చేతులమీదుగా లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకొన్నా. అది ఎప్పటికీ ప్రత్యేకమే.

మీకు కోపం వస్తే మామూలు మనిషిలా ఉండరటగా?
చాముండేశ్వర నాథ్‌: సమయాన్ని వృథా చేస్తే నాకు కోపం వస్తుంది. ఒకసారి రమ్యకృష్ణ, నయనతార, విశాల్‌ మా ఇంటికి వస్తామన్నారు. విశాల్‌ అరగంట ఆలస్యంగా వచ్చాడు. కోపమొచ్చి తిట్టేశాను.

ధోనీ గురించి ఒక్కమాట చెప్పండి?
చాముండేశ్వర నాథ్‌: అసామాన్యుడు. అలాంటి వ్యక్తిని ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్‌ టీమ్‌లో చూడలేదు. తన రూమ్‌ డోర్‌ ఎప్పుడూ తెరిచే పెడతారు. ఎవరైనా వెళ్లి తనతో మాట్లాడచ్చు. కానీ, ఫోన్‌లో మాత్రం అందుబాటులో ఉండరు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని