Murali mohan: ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్‌

సినీ నటుడు మురళీ మోహన్‌ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. 

Updated : 04 Apr 2024 11:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అడుగు పెట్టిన అన్ని రంగాల్లోనూ విజయం సాధించారు నటుడు మురళీమోహన్‌ (Murali mohan). కష్టాన్ని నమ్ముకున్న ఆయన్ని కళామతల్లి అక్కున చేర్చుకొని ఒక గొప్ప నటుడిగా తీర్చిదిద్దింది. మంచి మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన.. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయనతో పాటు ఆయన కోడలు మాగంటి రూప కూడా ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ అసలు పేరేంటి?

మురళీ మోహన్‌: రాజారామ్మోహన్‌రాయ్‌.. మా నాన్నకు స్వాతంత్ర్య సమరయోధులంటే ఇష్టం. అందుకే మా అందరికీ ఇలాంటి పేర్లే పెట్టారు. స్కూల్లో చేరినప్పుడు రాజబాబు అని మార్చుకున్నా. సినిమాల్లోకి వచ్చాక మురళీ మోహన్‌ అయ్యాను. నాకు ఇండస్ట్రీకి వచ్చేసరికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మేము చేసుకున్న పూజల ఫలితంగా మా పిల్లలకు పెళ్లైయ్యాక కూతురు లాంటి కోడలు వచ్చింది. కొడుకు లాంటి అల్లుడు వచ్చాడు. మా కోడలు కూడా నన్ను నాన్నగారు అనే పిలుస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయింది. దైవబలం ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యం కావు.

ఎవరో హీరో మిమ్మల్ని శ్రీరామచంద్రుడితో పోల్చారట.. ఎవరాయన?
మురళీ మోహన్‌: అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao). ఆయన నాకు ఆరాధ్య దైవం. ఆయన, సావిత్రి ఇద్దరూ నాకు చాలా ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా ఆయన్ని చూడాలనుకున్నా. అలాంటి నేను ఇండస్ట్రీకి రావడం.. ఆయనతో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తా. ఒకసారి అమెరికాలోని కార్యక్రమంలో ఆయన స్టేజ్‌పై మాట్లాడుతూ.. నన్ను శ్రీరామచంద్రుడితో పోల్చారు. 

మీ నాన్నగారు మిమ్మల్ని రాజా అని పిలుస్తారట.. ఎందుకు?
రూప: నాన్నకు మొదట అబ్బాయ్ పుడితే రాజా అని పిలవాలని నాన్నమ్మ కోరుకుంది. కానీ నేను పుట్టా.. అందుకే నన్నే రాజా అని పిలుస్తారు. అదే ఇప్పటికీ కొనసాగిస్తారు. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నచ్చితే 100 సార్లు చూస్తాను. ‘శంకరాభరణం’ 100సార్లు చూశా. ఆ సినిమా స్ఫూర్తితో డ్యాన్స్‌ నేర్చుకున్నా. 

వ్యవసాయం అంటే ఇష్టమా?
రూప:  గౌరవం. మా ఇంట్లో అందరికీ వ్యవసాయమంటే ఇష్టం. నాకు నీతి ఆయోగ్‌ నుంచి అవార్డ్‌ కూడా వచ్చింది. ఆ అవార్డు వచ్చాక చంద్రబాబునాయుడు గారికి చూపించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నా. ఎందుకంటే దానికి ముందు జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోయాను. ఓటమితో కుంగిపోకుండా బలంగా పని చేశాను. సేవ చేస్తున్నానని ఆయనతో చెప్పాను. 
మురళీ మోహన్‌: మహిళా సాధికారికత కోసం రూప చాలా పని చేసింది. శ్రీలంకలో 10 ఏళ్లు ఉండి అక్కడి మహిళలకు చదువు విలువ తెలియజేసింది.

మీ భర్త మీకు పెళ్లికి ముందే పరిచయమా?
రూప: అవును. మా ఇద్దరికీ కామన్‌ ఫ్రెండ్స్‌ ఉండేవాళ్లు. అలా పరిచయం. అది ప్రేమగా మారింది. ఎనిమిదేళ్లు ప్రేమించుకున్నాక పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని మా వారు మొక్కుకున్నారు. అందుకే 20 మందితో గుడిలో చేసుకున్నాం. తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటుచేశాం. 

కోట శ్రీనివాసరావు మిమ్మల్ని ఏదో సలహా అడిగారట.. ఏమిటది?
మురళీ మోహన్‌: ఆయనది బ్యాంక్ ఉద్యోగం. సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఏది ఎంచుకోవాలో అర్థం కావట్లేదని నన్ను సలహా అడిగాడు. సినిమాల్లో నటిస్తూ ప్రతీ రెమ్యునరేషన్‌లో సగం దాచుకోమని చెప్పా. ఒకవేళ అవకాశాలు రాకపోతే ఆ దాచిన డబ్బు ఉపయోగపడుతుందన్నాను. 

మీరు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరు?
రూప: నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఆయనతోపాటు నేను కొన్ని పనులు చేశాను. స్ఫూర్తి మాత్రం ఎన్టీఆర్ స్పీచ్‌. అది నన్ను కదిలించింది. ఒక మనిషి చెప్పింది అంతమంది వింటున్నారంటే గొప్ప విషయం. నాకు జనంతో ఉండడం ఇష్టం. రాజకీయాలంటే జనం అనుకుని వచ్చాను. పాలిటిక్స్ ఇలా ఉంటాయని అప్పట్లో తెలియదు. కుటుంబం ప్రోత్సహించకుండా ఏదీ సాధ్యం కాదు. నా ఫ్యామిలీ నాకు అండగా ఉంది. మా వారికి మాత్రం రాజకీయాలంటే ఇష్టం లేదు. అయినా నా కల కోసం నన్ను సపోర్ట్‌ చేశారు. 

పాలిటిక్స్‌ నుంచి ఏం నేర్చుకున్నారు?
రూప: పోరాటం చేయగలిగితేనే రాజకీయాల్లోకి వెళ్లాలి. ఈ రంగంలో విమర్శ, ప్రతి విమర్శలు సహజం. కానీ నేటి పరిస్థితుల్లో అది దూషణల దాకా వెళ్తుంది. అభ్యర్థులను మాత్రమే కాకుండా వాళ్ల కుటుంబాలను కూడా ఇందులోకి లాగుతున్నారు. ఎంత ఎక్కువ దూషిస్తే అంత గొప్ప నాయకుడని..  అదే గొప్ప నాయకుడి లక్షణమనేలా తయారైంది. నాకు ఆ అలవాటు లేదు. 

మొదటిసారి అమెరికా ఎప్పుడు వెళ్లారు?
మురళీ మోహన్‌: మా అమ్మాయి పెళ్లి సంబంధాల కోసం వెళ్లాను. అక్కడి సంబంధమే చేసుకోవడంతో.. అప్పటినుంచి తరచూ వెళ్తూనే ఉన్నాను. మా పిల్లలు అమెరికాలో ఉన్నా మా గురించి ఎక్కడా చెప్పరు. సెలబ్రిటీ పిల్లల్లా కాకుండా సాధారణంగా ఉంటారు. నా భార్య నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంటుంది. చాలా సాధారణ జీవితం గడుపుతుంది. కాటన్‌ చీర కట్టుకుంటుంది. నగలు కూడా వేసుకోదు. ఒకసారి మా ఇంటికి ఎవరో వచ్చి మా ఆవిడను చూసి పని అమ్మాయనుకున్నారు. ఇంట్లో ఇన్ని నగలు ఉన్నప్పుడు వేసుకోవచ్చు కదా అని అడిగితే వద్దంటుంది. కానీ, చాలా తెలివైనది. 
రూప: మా అత్తగారిని నేను అమ్మ అని పిలుస్తాను. ఆవిడకు అన్ని విషయాలపై అవగాహన ఉంటుంది. ఏది అడిగినా మంచి సలహా ఇస్తారు. 

మీ బెస్ట్‌ ఫ్రెండ్స్ ఎవరు?
మురళీ మోహన్‌: మాకు కొన్ని గ్రూప్స్‌ ఉన్నాయి. అందులో కోడెల శివప్రసాద్ కూడా ఉండేవారు. ఆ గ్రూప్స్‌లోని వారందరూ ఫ్యామిలీ మెంబర్స్‌లా ఉంటాం. ఏ కష్టమొచ్చినా అందరం కలుస్తాం. అందరికీ అండగా ఉంటాం. చిరంజీవి నేను చాలా ఆప్యాయంగా ఉంటాం. వెంకయ్యనాయుడిని చూసి చాలా నేర్చుకున్నా. పాలిటిక్స్‌ గురించి కొత్త విషయాలు తెలుసుకున్నా. 

మీ అమ్మాయికి ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరిందని వార్తలు వచ్చాయి.. నిజమేనా?
రూప: నిజమే. మ్యూజిక్ డైరెక్టర్‌ కీరవాణి కుమారుడు శ్రీసింహాతో మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని