venky atluri: ‘చంద్రముఖి’ చూసొచ్చి వారం రోజులు ఇంట్లో లైట్లు వేసుకునే పడుకున్నా!

‘తొలిప్రేమ’తో దర్శకుడిగా అరంగేట్రం చేసి- తొలి ప్రయత్నంలోనే హిట్‌ కొట్టాడు. ఇప్పుడు ధనుష్‌ను ‘సార్‌’గా మార్చి తెలుగు, తమిళ ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేసిన వెంకీ.. తన సినీ ప్రయాణం గురించి ఏం చెబుతున్నాడంటే...

Updated : 02 Mar 2023 14:55 IST

వెండితెరపైన అందమైన ప్రేమకథలతో హ్యాట్రిక్‌ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి. యాక్టర్‌ అవ్వాలని సినీ పరిశ్రమకొచ్చిన ఈ యువ దర్శకుడు ఒకప్పుడు నటిస్తూనే డైలాగులూ రాశాడు. క్రమంగా మెగా ఫోన్‌ పట్టుకుని ‘తొలిప్రేమ’తో దర్శకుడిగా అరంగేట్రం చేసి- తొలి ప్రయత్నంలోనే హిట్‌ కొట్టాడు. ఇప్పుడు ధనుష్‌ను ‘సార్‌’గా మార్చి తెలుగు, తమిళ ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేసిన వెంకీ.. తన సినీ ప్రయాణం గురించి ఏం చెబుతున్నాడంటే...

నేను కలెక్టర్‌ కావాలన్నది అమ్మ కల. బ్యాడ్‌ యాక్టర్‌ని అన్నది నాన్న మాట. ఈ రెండింటికీ మధ్యలో మొదలైందే నా సినిమా ప్రయాణం. కాలేజీలో బోరింగ్‌ క్లాస్‌లో కూర్చుని మొదటిసారి కథ రాసుకున్న క్షణంలో నేనసలు అనుకోలేదు. కథలు రాస్తానని.. వాటిని నేనే సినిమాలుగా తెరకెక్కిస్తానని. మనం అనుకోనివి జరగడమే కదా జీవితం. డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న నేను అసలు హీరోను అవుదామని సినీ పరిశ్రమలో అడుగుపెట్టా. రెండు సినిమాల్లో నటించాక అనూహ్యంగా నా ప్రయాణానికి బ్రేక్‌ పడింది. నేను హీరో మెటీరియల్‌ కాదని అర్థమైంది. నాకొచ్చిన కొన్ని అవకాశాల వల్ల నా లక్ష్యం దర్శకత్వమనే మరో మార్గం వైపు మళ్లింది. ఇప్పుడు స్పష్టతతో ఆ బాటలోనే వేగంగా ప్రయాణిస్తూ.. ‘సార్‌’ అనే మైలు రాయి దగ్గర ఉన్నా. విద్యావ్యవస్థనీ, అందులోని లొసుగుల్నీ చూపించిన ఈ సినిమాను యువతతోపాటు వారిని కష్టపడి చదివించే తల్లిదండ్రుల్నీ దృష్టిలో పెట్టుకుని తీశా.

నువ్వే హీరో అన్నారు

విద్యార్థుల గురించి సినిమా తీశాను అనగానే ముందు నా స్టూడెంట్‌ లైఫ్‌ ఏమిటో కూడా తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా. మాది గుడివాడ దగ్గర వానపాముల. నాన్నది వ్యాపారం. ఆయన చిన్నతనంలోనే మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. అమ్మానాన్నలకు ఒక్కడినే సంతానం. నేను కలెక్టర్‌ అయితే చూడాలన్నది మా అమ్మ కోరిక. చదువులో యావరేజ్‌ స్టూడెంట్‌ని. నేను కలెక్టర్‌ అవ్వడమేంటీ అనుకునేవాడిని. నాకు ఆటలంటే చాలా ఇష్టం. వాటి కోసమే స్కూలుకీ, కాలేజీకీ వెళ్లేవాడిని. ఆ ఆసక్తితోనే క్రికెటర్‌ అవ్వాలనుకున్నా. పలు రాష్ట్రాలకెళ్లి టోర్నమెంట్లు ఆడేవాడిని. ఒకసారి మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయని అమ్మ కోప్పడి క్రికెట్‌ మాన్పించింది. తరవాత అమ్మానాన్నల కోసమే ఇంజినీరింగ్‌లో చేరా. చదువుతున్నాగానీ అదే నా లక్ష్యమనిపించలేదు. పైగా ఒక లెక్చరర్‌ తన క్లాస్‌కి రాకపోతే ఊరుకునేవారు కాదు. ఆయనకు భయపడి వెళ్లేవాడిని. ఒకసారి ఆయన నాలుగురోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది. అందుకే ముందురోజు నాలుగు పీరియడ్‌లు వరసగా ఆయనే క్లాస్‌ తీసుకున్నారు. నా బెంచ్‌మేట్స్‌ కొందరు మానేశారు. వాళ్లు తప్పించుకోవడం, నేను క్లాస్‌లో ఇరుక్కుపోవడంతో విసుగొచ్చింది. ఆ చిరాకులో క్లాస్‌ వినకుండా ఓ కథ రాశా. అప్పుడే నాలో కథ రాసే నైపుణ్యం ఉందని అర్థమైంది. చదివిన ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. అలానే కొందరు హీరోగా ప్రయత్నించమని సలహా ఇచ్చేవారు. పైగా అదే సమయంలో నా స్కూల్‌మేట్‌ తరుణ్‌- నిఖిల్‌, ఉదయ్‌కిరణ్‌ వంటివారు సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. నాకూ సినిమాల్లోకి వెళ్లాలనిపించింది. అది నటుడిగానా, రచయితగానా అన్నది అర్థం కాలేదు. మొదట్లో ఇంట్లో చెప్పడానికి భయపడ్డా. మా బాబాయి ఒకరు గంగోత్రి ఆడిషన్‌కి పంపారు. కానీ ఎంపిక కాలేదు. వేరేవాళ్లు రాఘవేంద్రరావుగారి దగ్గర అసిస్టెంట్‌గా అవకాశం ఉంది చేయమన్నారు. అందుకు నాన్న ఒప్పుకోలేదు. అమ్మకేమో నేను సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం లేదు. ఈలోగా ఒక సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. స్పష్టత లేకుండా పరుగులు తీస్తున్న ఆ సమయంలో మా బాబాయికి తెలిసిన వాళ్లు సినిమా తీస్తున్నారు. విషయం తెలిసి బాబాయి నన్ను ఆ సినిమా ఆఫీసుకి తీసుకెళ్లగానే ‘నువ్వే మా హీరో’ అన్నారు నిర్మాత. అలానే పాస్‌పోర్ట్‌ ఉందా అని అడిగారు. ఉందనగానే ఆస్ట్రేలియాలో షూటింగ్‌ అన్నారు. అదంతా కలో నిజమో అర్థం కాలేదు. పాస్‌పోర్ట్‌ ఉన్నందుకే అవకాశం ఇచ్చారేమో అనిపించింది. హీరోగా నాకు మర్యాద ఇస్తుంటే ఆశ్చర్యంగా అనిపించేది. నేను ఎలా చేసినా బాగుంది అనేవారు తప్ప తప్పొప్పులు చెప్పేవారు కాదు. చివరికి సినిమా పూర్తయ్యాక చాలామంది సినీ పెద్దలు ప్రివ్యూ చూసి కామ్‌గా వెళ్లిపోయారు తప్ప రివ్యూ చెప్పలేదు. థియేటర్‌లో ఒక్క షో మాత్రమే ఆడి డిజాస్టర్‌ అయిన ఆ సినిమా పేరు ‘జ్ఞాపకం’. నా జీవితంలో అదో చేదు జ్ఞాపకం. నువ్వు బ్యాడ్‌ యాక్టర్‌వి, నీకు నటనే రాదన్నారు నాన్న. అప్పటికీ నా మీద నాకు స్పష్టత లేదు. ఆ డైలమాలో ఉండగానే ‘స్నేహగీతం’లో సెకండ్‌ హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ సమయానికి డైలాగ్‌ రైటర్‌ రాకపోవడంతో నాకు రాసే ఛాన్స్‌ దక్కింది. నిజానికి కాలేజీలో విసుగుతో కథ రాయడం తప్ప రచయితగా నాకు ఎలాంటి అనుభవం లేదు. శిక్షణా తీసుకోలేదు. అలాంటిది ఆ సినిమాకి చేయి తిరిగిన రచయితలా మాటలు రాయడం చూసి దర్శకుడు ఆశ్చర్యపోయారు. ఆ తరవాత సినిమాకీ నాకే రైటర్‌గా అవకాశమిచ్చారు. నిజానికి నటించినప్పుడు కలగని సంతృప్తి రాసినప్పుడు దొరికింది. అలా 2011లో వచ్చిన ‘ఇట్స్‌ మై లవ్‌ స్టోరీ’కి మాటలు రాశా. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ కూడా తీశా. తరవాత ‘మిస్టర్‌ మజ్ను’ కథ రాసుకున్నా. దాన్ని తీసుకుని ఉషాకిరణ్‌ మూవీస్‌కి వెళ్లా. వాళ్లు కథ చదవకుండా ‘నువ్వు ఏం అవ్వాలనుకున్నావ్‌...’ అనడిగారు. ‘హీరోగా, దర్శకుడిగా రెండు పడవల మీద కాళ్లు వేయడం సరికాదు. హీరో అవ్వాలనుకుంటే... మేం ఓ దర్శకుణ్ని చూసుకుని నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాం. అదే నువ్వు దర్శకుడిగా సినిమా తీస్తే హీరోని వెతుకుతాం..’ అన్నారు. నిజానికి అప్పటి వరకూ నన్ను అలా ఎవరూ అడగలేదు. ఆ ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది. వాస్తవానికి నేను హీరో అవ్వాలని సినీ పరిశ్రమకొచ్చా. దానిమీద నాకంత పేషన్‌, ఇష్టం ఉండి ఉంటే రెండో ఆలోచన ఉండేది కాదు. ఒకవేళ నా అసలు లక్ష్యం దర్శకత్వమేనేమో అనుకుని రెండో ఆలోచన వైపే మొగ్గు చూపా. 

‘దిల్‌’ రాజు నమ్మారు

‘ఇట్స్‌ మై లవ్‌ స్టోరీ’కి పనిచేస్తున్నప్పుడే దిల్‌ రాజుగారితో పరిచయమైంది. ఎందుకో తెలియదు గానీ దర్శకుడిగా రాణిస్తానని ఆయన నన్ను నమ్మారు. నా మొదటి సినిమా ‘తొలిప్రేమ’ కూడా వాళ్ల బ్యానర్‌లోనే చేయాలనుకున్నాం. ఒకవైపు సినీ పరిశ్రమలో పరిచయాలు పెంచుకుంటూ ఒక్కో అడుగు వేస్తుంటే- మా అమ్మ మాత్రం నేను సినీ రంగంలోకి రావడం జీర్ణించుకోలేకపోయింది. దాదాపు నాలుగేళ్ల పాటు బాధపడింది. అమ్మానాన్నలిద్దరూ నన్ను ఎలాగైనా ఈ రంగంలోంచి బయటకు తీసుకురావాలని ఆలోచించేవారు. ఒకరోజు ‘మీ అబ్బాయి మంచి దర్శకుడు అవుతాడని నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి’ అని దిల్‌ రాజుగారు చెప్పడంతో నాన్న ఆలోచనల్లో మార్పు వచ్చింది. సినిమాలపైన దృష్టి పెట్టా. ‘మిస్టర్‌ మజ్ను’ హై బడ్జెట్‌ మూవీ కావడంతో ఆ కథను పక్కన పెట్టి ‘తొలిప్రేమ’ కథ రాసుకున్నా. ‘ముకుంద’ టీజర్‌ చూశాక వరుణ్‌ అయితే ఆ కథకు బాగుంటాడనిపించింది. తనకి కథ చెప్పడానికి ముందు నలుగురైదుగురికి చెప్పి ఉన్నా.  చేతినిండా సినిమాలున్న వరుణ్‌ కూడా ఒప్పుకోడనిపించింది. కానీ విన్న వెంటనే చేస్తానన్నాడు. తీరా ఆ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టే ముందు వరుణ్‌ కాలు విరిగింది. పైగా వరుణ్‌ చేయాల్సిన సినిమాలు ఆగిపోయాయి. తను కోలుకుని అవన్నీ పూర్తిచేసి ‘తొలిప్రేమ’ పట్టాలెక్కడానికి ఏడాదిన్నర పట్టింది. చెప్పలేనంత నిరాశ. నేను చాలామందికి కథ చెప్పి ఉన్నా. ఎవరైనా కాపీ కొట్టొచ్చు, లేదంటే కాన్సెప్ట్‌ తీసుకోవచ్చు... అని భయపడ్డా. లక్కీగా అలాంటివేం జరగలేదు. ఆలస్యమైనా సజావుగా షూటింగ్‌ జరిగింది. సినిమా హిట్‌ అయింది.

ఆ తరవాత ‘మిస్టర్‌ మజ్ను’ అఖిల్‌తో చేశా. అదయ్యాక ‘రంగ్‌ దే’ కూడా అనుకున్న వెంటనే షూటింగ్‌ మొదలైంది. సగం సినిమా పూర్తి చేశాక కొవిడ్‌తో లాక్‌డౌన్‌ వచ్చింది. మళ్లీ ఎదురుచూపులు. మానసికంగా చాలా ఇబ్బంది పడినా అది ప్రపంచమంతటికీ వచ్చిన సమస్య అని సర్దుకున్నా. కాకపోతే ఆ సినిమా సెకండ్‌ హాఫ్‌ విదేశాల్లో చేయాల్సి ఉంది. అనుకున్నన్ని రోజులు అనుమతులు దొరక్క త్వరత్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది. అయినా ఆ సినిమాకొచ్చిన ఫలితాలు మాత్రం సంతృప్తినిచ్చాయి. అయితే అప్పటికి నేను తీసిన మూడు సినిమాలూ ప్రేమకథలే. వెంకీ అన్నీ ప్రేమ కథలే తీస్తాడు అనేవారు. ఈసారి దారి మార్చాలనుకున్నా. లాక్‌డౌన్‌లో నేను స్వయంగా చూసిన పరిస్థితుల్నే కథగా రాశా. అదేంటంటే... చాలా వరకూ మనదేశంలో విద్య వ్యాపారమైంది. మన విద్యావ్యవస్థ ఎటు వెళుతోందో తెలియక ప్రశ్నించే గొంతుకగా మారి ‘సార్‌’ కథ రాశా. ఆ లైన్‌ నిర్మాతలకు నచ్చింది. అప్పుడే కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పడుతోంది గానీ కథ వినిపించడానికి హీరోల అపాయింట్‌మెంట్లు దొరకట్లేదు. అనుకోకుండా ధనుష్‌కి చెప్పే అవకాశం వచ్చింది. ఆయన కథ విన్నాక ‘డేట్స్‌ ఎప్పుడు కావాలి వెంకీ’ అన్నారు. అప్పటికీ ఆశ్చర్యంగా చూస్తున్న నా ముఖం చూసి ‘ఈ కథ నాతో చేయడానికి ఓకే కదా...’ అన్నారు. కథ చెప్పిన వెంటనే ఆయన సినిమా ఓకే చేయడం, షూటింగ్‌ పట్టాలెక్కడం చకచకా జరిగిపోయాయి. పైగా నాకెంతో ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్‌గారు ‘సార్‌’ నిర్మాతల్లో ఒకరు. దర్శకులవ్వాలనుకునేవారికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయనకీ నా కథ నచ్చింది. ఆ మెప్పుతో దర్శకుడిగా ఇంకో మెట్టు ఎక్కానని అనుకుంటున్నా. ఇక వయసులోనూ, అనుభవంలోనూ నా కంటే పెద్దవారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. నేను 24 ఫ్రేమ్స్‌నూ గౌరవిస్తా. దర్శకుడిగా ఆయా విభాగాల్లో పని చేసేవారి నిర్ణయానికి పెద్దపీట వేస్తా. అదే నా సీక్రెట్‌ ఆఫ్‌ సక్సెస్‌ అని నమ్ముతా.

అలక

‘తొలిప్రేమ’లో  ‘నిన్నిలా నిన్నిలా...’ పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఆ పాట ట్యూన్‌ చేసేటప్పుడు అర్మాన్‌ మాలిక్‌గానీ, అర్జిత్‌ సింగ్‌గానీ పాడితే బాగుంటుంది అన్నారు తమన్‌. తరవాత చెన్నై వెళ్ళాక ఆ పాట నేనే పాడా అన్నారు. అదేంటీ అంటే... ఏంట్రా నా వాయిస్‌ బాగోలేదా అన్నారు.  అర్మాన్‌ మాలిక్‌, అర్జిత్‌ సింగ్‌గానీ పాడితే బాగుంటుందని మెంటల్‌గా ట్యూన్‌ చేశారు. దాంతో నా మనసులో అదే ఉండిపోయింది. వద్దంటే వద్దన్నా. చివరికి వరుణ్‌, నిర్మాతలు కూడా నో అనడంతో అర్మాన్‌ మాలిక్‌ చేత పాడించారు. ఇక ఆ సినిమాలో తమన్‌ ఇంకే పాటా పాడలేదు. అలిగారు.

ప్రశంస

‘తొలిప్రేమ’ చూసిన చిరంజీవిగారు నన్ను మెచ్చుకున్నారు. ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఆ పిలుపు వరుణ్‌ పెదనాన్నగా కాకుండా నా ప్రతిభకుగుర్తింపుగానే వచ్చింది. సినిమా బాగుంటే కొత్త దర్శకుల్ని ఆయన అలానే అభినందిస్తారు. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రశంస అది.

నిర్ణయం

దర్శకుడిగా పలు కోణాల్లో సినిమాలు తీయాలనే ఆలోచన ఉంది. కానీ హారర్‌ జోలికి మాత్రం వెళ్లను. పైగా అలాంటి సినిమాలు అసలు చూడను. ‘చంద్రముఖి’ చూసొచ్చి వారం రోజులు ఇంట్లో లైట్లు వేసుకునే పడుకున్నా. అంతేకాదు నేను హారర్‌ సినిమాలు తీసినా అది కామెడీ సినిమాలా ఉంటుందేమో అనిపిస్తుంది.

హెచ్చరిక

నాకు మీమ్స్‌ చదివే అలవాటుంది. ‘సార్‌’కు ముందు విడుదలైన నా మూడు సినిమాలూ ప్రేమకథలే. సెకండ్‌హాఫ్‌లో కథ విదేశాల్లో ఉంటుంది. వెంకీ ‘నారప్ప’ తీస్తే అది కూడా సెకండ్‌ హాఫ్‌ లండన్‌లో షూట్‌ చేసేవాడు అంటూ మీమ్స్‌ వచ్చాయి. బాగా నవ్వుకున్నా. ఆలోచించా కూడా. ఈసారి కాస్త జాగ్రత్త పడ్డా.

స్నేహగీతం

నేను, నితిన్‌, కీర్తి సురేశ్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. మా ముగ్గురికీ ఓ వాట్సాప్‌ గ్రూపు ఉంది. ‘రంగ్‌ దే’ షూటింగ్‌ సమయంలో మా స్నేహం మరింత బలపడటంతో మా గ్రూపు పేరు ‘రంగ్‌ దే ఫ్రెండ్స్‌ ఫర్‌ లైఫ్‌’ అనే పేరు పెట్టుకున్నాం. ముగ్గురం కలిశామంటే అల్లరే అల్లరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని