Hanuman: హనుమాన్‌గా చిరంజీవి.. రాముడిగా మహేశ్‌ చేస్తారేమో: ప్రశాంత్‌ వర్మ

Jai Hanuman: ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించనున్న ‘జై హనుమాన్‌’ గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Updated : 30 Jan 2024 19:20 IST

హైదరాబాద్‌: ‘హనుమాన్‌’(Hanu-Man)తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma). తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విజయోత్సాహంతో ప్రశాంత్‌ వర్మ తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘జై హనుమాన్‌’ పట్టాలెక్కనుంది. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’అన్న ఆసక్తికర అంశంతో ఇది రూపొందనుంది. అయితే, ఇందులో హనుమంతుడు, రాముడి పాత్రలను ఎవరు పోషిస్తారు? అన్న అంశంపై అటు సినీ వర్గాలు, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హనుమాన్‌, రాముడి పాత్రలను ఎవరు చేస్తే  బాగుంటుందో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘జై హనుమాన్‌’ (Jai Hanuman) మూవీ స్కేల్‌ చాలా పెద్దది. స్టార్‌ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. హనుమంతుడి పాత్ర ఎవరు చేసినా హావభావాలు వ్యక్తపరచడంలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఎందుకంటే బయట మనం చూసే హనుమాన్‌లా ఆ పాత్ర ఉండదు. ఆంజనేయస్వామికి అష్ట సిద్ధులు తెలుసు. కాబట్టి, ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు. ఆ శక్తులను వివరంగానే చూపిస్తాం. హనుమాన్‌ పాత్ర పోషించడానికి పలువురు బాలీవుడ్‌ నటులు ఆసక్తి చూపారు. అయితే, ఆన్‌స్క్రీన్‌తో పాటు, ఆఫ్‌ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్‌ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవిగారు (Chiranjeevi) కూడా ఉండవచ్చు’’

‘‘పద్మవిభూషణ్‌ వచ్చిన తర్వాత కలవలేదు. ఆయన ఇంటి వద్ద అంతా కోలాహలంగా, వేడుకగా ఉంది. అదంతా కాస్త సద్దుమణిగాక వెళ్లి కలుస్తా. అన్నీ కుదిరితే చిరంజీవిగారే ఆ పాత్ర చేసే అవకాశం కూడా ఉండొచ్చు. చెప్పలేం. ఇక రాముడిగా నా మనసులో ఉన్న నటుడు మహేశ్‌బాబు (Mahesh babu).  సోషల్‌మీడియాలో ఆయన్ను రాముడిగా క్రియేట్‌ చేసిన ఫొటోలను చూశా. మా ఆఫీస్‌లో కూడా మేం రాముడి పాత్రను ఆయన ముఖంతో రీక్రియేట్‌ చేసి చూసుకున్నాం’’

‘‘మేము అనుకున్న ఇండియన్‌ సూపర్‌ హీరోల కథలన్నీ సినిమాలుగా తీస్తాం. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఒకవేళ పెద్ద హీరోతో సినిమా చేయాల్సి వచ్చినా స్క్రిప్ట్‌లో మార్పులు చేయం. కొన్ని పరిమితులకు లోబడి వాళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. వారి ఆలోచనలు నచ్చితే, పరిశీలిస్తాం. ఏదైనా అంతిమ నిర్ణయం చిత్ర బృందానిదే. కొన్ని కథలను కేవలం కొత్త నటీనటులతో చేస్తాం. మహిళా ప్రాధాన్యం ఉన్న మూవీలో సమంత (Samantha) చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’

‘‘ఇక నుంచి మా సినిమాలు శరవేగంగా సాగుతాయి. గతంతో పోలిస్తే, మాకు అనేక వనరులు సమకూరాయి. ‘అధీర’ సినిమా కూడా ఉంటుంది. 25 మందితో స్క్రిప్ట్‌ టీమ్‌ పనిచేస్తోంది. ఈ సంఖ్యను 100కు పెంచుతా. ఏ స్టోరీపై ఎవరు పనిచేయాలో ముందే చెబుతా. వాళ్లలో కొందరు దర్శకులు కూడా అవుతారు. ముందుగా వాళ్లకు కొంత అమౌంట్‌ ఇచ్చి, కొన్ని సన్నివేశాలను షూట్‌ చేసుకుని రమ్మంటాం. మా విజన్‌కు సరిపోయేలా ఉంటే, మిగిలిన చిత్రానికి వాళ్లే దర్శకత్వం వహిస్తారు. ‘జై హనుమాన్‌’ పనులు ఏడాది కిందటే మొదలు పెట్టాం. కథ సిద్ధమే. ఎలా తీయాలో అన్నదానిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. వీఎఫ్‌ఎక్స్‌ సహా చాలా విషయాలు నేర్చుకోవాలి. వాటన్నింటిపైనా అవగాహన రాగానే షూటింగ్‌ మొదలవుతుంది. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడం’’ అని ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని