venky atluri: ఈ కథకీ... ‘సూపర్‌ 30’, ‘త్రీ ఇడియట్స్‌’కీ సంబంధమేమీ లేదు!

ధనుష్‌ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘సార్‌’ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఈసందర్భంగా ఆయన పంచుకున్న ఆసక్తికర విశేషాలు..

Published : 19 Feb 2023 14:56 IST

‘‘మూడు ప్రేమకథలు చేశాక... ఈసారి ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనుకొన్నా. ఆ  ఆలోచనల నుంచి పుట్టిందే ‘సార్‌’ కథ. ఒక తరహా కథలకి పరిమితం కాకుండా... అన్ని రకాల చిత్రాల్ని తెరకెక్కించడమే నాకు ఇష్టం’’  అన్నారు యువ దర్శకుడు వెంకీ అట్లూరి. ‘తొలిప్రేమ’తో మెగాఫోన్‌ చేతపట్టిన ఆయన... ‘మిస్టర్‌ మజ్ను’, ‘రంగ్‌ దే’ చిత్రాలతో  తన ప్రతిభని చాటి చెప్పారు. ఇటీవల ధనుష్‌ కథానాయకుడిగా ‘సార్‌’ తెరకెక్కించారు. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి పంచుకున్న విశేషాలివి..!

‘‘నా చదువులు 90వ దశకంలోనే సాగాయి. ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవాలు, నేను ఎదురు చూసిన సంఘటనల్ని ఆధారంగా చేసుకునే ఈ కథ రాసుకున్నా. 90ల నాటి కథే అయినా ఇప్పటి పరిస్థితుల్నీ ప్రతిబింబిస్తుంది. ఈ కథాంశం ఎప్పుడైనా సరే, అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. విడుదల తర్వాత అదే రుజువైంది. చదువుకునే పిల్లలకి ఎంతగా నచ్చిందో, వాళ్ల తల్లిదండ్రుల్నీ అంతే కదిలించింది’’

‘‘సినిమా చూశాక దర్శకులు త్రివిక్రమ్‌, కథానాయకులు నితిన్‌, వరుణ్‌తేజ్‌, నిర్మాత శిరీష్‌తోపాటు ఇంకా చాలా మంది ఫోన్‌ చేసి మంచి సినిమా చేశావని మెచ్చుకున్నారు. చెన్నైలో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశా. వాళ్లు చివరి వరకు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. తెలుగులో ప్రీమియర్‌ షో నుంచీ బాగుందంటూ ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. కొంతమందైతే హిందీలో కూడా విడుదల చేయాల్సిందన్నారు. ఈ  స్పందన చాలా తృప్తినిచ్చింది’’.

‘‘ఈ కథ రాసుకున్నాక నా మనసులో ధనుష్‌ తప్ప మరొకరు లేరు. ఆయనకే కథ చెప్పే అవకాశం రాగానే చాలా సంతోషించా. కథ వినగానే ఆయన చప్పట్లు కొట్టి డేట్స్‌ ఎప్పుడు కావాలన్నారు. ఆయన విజన్‌ ఉన్న నటుడు. సన్నివేశం చేస్తున్నప్పుడు ఇదెలా వస్తుందో అలవోకగా ఊహిస్తారు. ఆయనలో స్పష్టతని గమనించి చాలా నేర్చుకున్నా’’

‘‘త్రివిక్రమ్‌ ఆలోచనలు ఈ కథపై చాలా ప్రభావం చూపించాయి. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆయనతో సాగించిన చర్చల నుంచి పుట్టినవే. ఆయన అనుభవాల స్ఫూర్తితో రాశా.  చాలా మంది పోలుస్తున్నట్టుగా ఈ కథకీ... ‘సూపర్‌ 30’, ‘త్రీ ఇడియట్స్‌’కీ సంబంధమేమీ లేదు. ‘సూపర్‌ 30’ కంటే ముందే రాసుకున్న కథ ఇది. ఆ సినిమా కూడా విద్య నేపథ్యంలోనే అని తెలిసి భయపడుతూ చూశా. అదొక జీవిత కథ  అయితే, ఇదొక కల్పిత కథ’’.

‘‘ప్రేమకథలంటే నాకెప్పుడూ ఇష్టమే. వాటిని వదిలేస్తానని చెప్పను కానీ... ఇకపై విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. తదుపరి అందరినీ సీటు అంచున కూర్చోబెట్టే ఓ సినిమా చేయాలనుకుంటున్నా. దాని గురించి ఇప్పుడే చెప్పలేను కానీ, ‘సార్‌’ని ఎక్కువ మందికి చేరవేయడమే నా ముందున్న లక్ష్యం. దీనికి కొనసాగింపు ఆలోచనంటూ ఏమీ లేదు’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని