Updated : 16/12/2020 09:43 IST

గణతంత్ర అతిథిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌

మోదీ ఆహ్వానానికి అంగీకారం తెలిపిన బ్రిటన్‌ ప్రధాని

లండన్‌: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గతనెల ఫోన్‌ చేసి ఆహ్వానించగా... జాన్సన్‌ అంగీకారం తెలిపినట్టు బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం డౌనింగ్‌ స్ట్రీట్‌ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. భారత పర్యటనకు వస్తున్నట్టు మోదీకి జాన్సన్‌ లేఖ రాయడమే కాకుండా... వచ్చే ఏడాది బ్రిటన్‌లో జరిగే జీ7 సదస్సుకు అతిథి దేశ ప్రతినిధిగా హాజరుకావాలని భారత ప్రధానిని ఆహ్వానించినట్టు పేర్కొన్నాయి. భారత పర్యటన విషయమై జాన్సన్‌ కూడా స్పందించారు. ‘‘ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న కొత్త సంవత్సరంలో మొదట భారత్‌లో పర్యటించబోతున్నా. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇతోధిక పురోగతి సాధించాలని మోదీ, నేనూ కృత నిశ్చయంతో ఉన్నాం. ఇందుకు నా పర్యటన దోహదపడుతుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ కీలక భూమిక పోషిస్తోంది. బ్రిటన్‌కు అత్యంత ముఖ్యమైన భాగస్వామి కూడా. అభివృద్ధి సాధన, ఉద్యోగ కల్పన, భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కోవడం, పుడమిని రక్షించుకోవడం వంటి అంశాల్లో రెండు దేశాలూ కలిసి పనిచేస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగిన అనంతరం జాన్సన్‌ కీలక పర్యటన చేపడుతుండటం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా... వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రిక్‌ వాహనాలు వంటి అంశాలపై నేతలిద్దరూ చర్చలు జరుపుతారని డౌనింగ్‌ స్ట్రీట్‌ పేర్కొంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్‌ నుంచి ముఖ్య అతిథిగా హాజరవుతున్న రెండో వ్యక్తి జాన్సన్‌ కావడం విశేషం. ఇంతకుముందు 1993లో అప్పటి బ్రిటన్‌ ప్రధాని జాన్‌ మేజర్‌ రిపబ్లిక్‌ డే వేడుకలకు అతిథిగా విచ్చేశారు.
భారత్‌... ‘ప్రపంచ ఫార్మసీ’
‘‘మహమ్మారిని ఎదుర్కోవడంలో రెండు దేశాలు ఎంతో సన్నిహితంగా కలిసి పనిచేశాయి. ప్రజలందరికీ అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాయి. కష్టకాలంలో భారత్‌ మాకు 1.10 కోట్ల మాస్కులు, 30 లక్షల ప్యాకెట్ల పారాసిటమాల్‌ మాత్రలను పంపింది. భారత్‌... ప్రపంచ ఫార్మసీ. ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లలో సగం అక్కడి నుంచే వస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌... పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో 100 కోట్ల డోసులకు పైగా తయారవుతోంది. ఆ దేశంతో మున్ముందు మరింతగా కలిసి పనిచేస్తాం’’ అని డౌనింగ్‌ స్ట్రీట్‌ పేర్కొంది.

భారత్‌-బ్రిటన్‌ సంబంధాల్లో నూతన శకం
విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌

గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, భారత్‌-బ్రిటన్‌ సంబంధాల్లో నూతన శకం ఆరంభానికి ఇది శుభ సూచిక అని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డోమినిక్‌ రాబ్‌తో ఆయన 4 గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం వారిద్దరూ సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. వాణిజ్యం-అభివృద్ధి, రక్షణ-భద్రత, వాతావరణ మార్పులు, ఆరోగ్య సేవలు, ఉభయ దేశ ప్రజల మధ్య అనుసంధానం గురించి ప్రధానంగా చర్చించినట్టు నేతలిద్దరూ తెలిపారు. ‘‘ఉభయ దేశాల సంబంధాలకు సంబంధించి 10 సంవత్సరాల రోడ్‌మ్యాప్‌ విషయంలో ఇద్దరి మధ్య పలు అంశాల్లో అంగీకారం కుదిరింది. 2021 నుంచి దీన్ని అమల్లోకి తీసుకెళ్తాం. జీ7, ఐరాస వాతావరణ మార్పు సదస్సుల నుంచే ఇది ప్రారంభమవుతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా వచ్చే ఏడాది నుంచి మరింత ముందడుగు వేస్తాం. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా బోరిస్‌ను ఆహ్వానించడం మాకు గర్వకారణం’’ అని రాబ్‌ పేర్కొన్నారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని