
అమెరికా ఎన్నికలు: ఏ వర్గం ఎవరివైపు?
‘2020 కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ’ ఏం చేబుతోందంటే..
న్యూయార్క్: మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ వెలువడుతున్న సర్వేలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా ‘2020 కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ’ తమ సర్వే ఫలితాలను వెల్లడించింది. మొత్తం 71 వేల మందిని ఆన్లైన్లో సర్వే చేశారు. సెప్టెంబరు నుంచి అక్టోబరు మధ్య ఈ ప్రక్రియ జరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో 51 శాతం మంది డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ వైపు మొగ్గుచూపుతుండగా... 43 శాతం మంది ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌నకు మద్దతు పలికారు. ఈ అధ్యయనాన్ని 2006 నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది పరిశోధకులు జరుపుతున్నారు.
> బైడెన్ మద్దతుదారుల్లో అత్యధికులు 18-44 ఏళ్ల మధ్య వయసున్న వారే కావడం గమనార్హం. ఇక 65 ఏళ్ల వయసు పైబడిన వారిలో 53 శాతం మంది ట్రంప్ వైపు మొగ్గుచూపారు.
> ఆసియా అమెరికన్లలో 65 శాతం మంది బైడెన్‌కు.. కేవలం 28 శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు మద్దతుగా నిలిచారు.
> నల్లజాతీయుల్లో ట్రంప్‌పై అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తేలింది. వీరిలో కేవలం 9 శాతం మంది మాత్రమే ఆయనకు మద్దతుగా నిలిచారు. 86 శాతం బైడెన్‌కే ఓటేశారు.
> హిస్పానిక్ అమెరికన్లు సైతం బైడెన్‌కే మద్దతుగా నిలిచారు. ఈ వర్గంలో 59 శాతం మంది బైడెన్ వైపుండగా.. మిగతా 35 శాతం ట్రంప్ వైపున్నారు.
> శ్వేతజాతీయుల్లో అతిస్వల్ప తేడాతో ట్రంప్ ముందంజలో ఉన్నారు. వీరిలో ట్రంప్‌నకు 49 శాతం మంది మద్దతుగా ఉండగా.. 45 శాతం మంది బైడెన్ వైపు మొగ్గుచూపారు.
> మహిళల్లో బైడెన్‌కు 55 శాతం, ట్రంప్‌నకు 39 శాతం మంది మద్దతుగా ఉన్నారు. పురుష ఓటర్లలో ఇద్దరు అభ్యర్థులకూ దాదాపు సమాన మద్దతు లభించింది.
> కాలేజీ డిగ్రీ లేని శ్వేతజాతీయుల్లో 57 శాతం ట్రంప్ వైపుండగా.. 38 శాతం బైడెన్ వైపు నిలబడ్డారు. డిగ్రీ ఉన్నవారిలో 58 శాతం బైడెన్‌కు.. 36 శాతం ట్రంప్ వైపు మొగ్గుచూపారు.
> నిరుద్యోగుల్లోనూ బైడెన్‌కు భారీ మద్దతు ఉన్నట్లు సర్వే తేల్చింది. ఇక 2016లో హిల్లరీ క్లింటన్‌కు ఓటేసిన వారిలో 95 శాతం మంది ఇప్పుడు బైడెన్‌కు మద్దతుగా ఉన్నారు. అదే ట్రంప్ తనకు గతంలో ఓటేసిన వారిలో 90 శాతం మందినే ఆకర్షిస్తున్నారు.