‘అంబేడ్కర్‌ను పార్లమెంట్‌కు రాకుండా చేశారు’

నగరంలోని పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శాసనసభలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ పాతబస్తీ అభివృద్ధిపై లేవనెత్తిన అంశాలపై మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో అనేక ....

Published : 17 Sep 2020 01:26 IST

శాసనసభలో కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ విమర్శలు

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శాసనసభలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ పాతబస్తీ అభివృద్ధిపై లేవనెత్తిన అంశాలపై మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పాతబస్తీలో మరిన్ని బస్‌షెల్టర్లు, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో వీధికుక్కలు, పందులు లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. నగర వ్యాప్తంగా రూ.430 కోట్లతో మురికికాల్వలను బాగుచేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ పరిధిలో 11వేల టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. దీంతోపాటు మరికొన్ని అంశాలపైనా కేటీఆర్‌ మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు ఊరట కలిగించేలా ఆయన ప్రకటన చేశారు. జీవో 131ను సవరిస్తామన్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారమే రుసుం వసూలు చేస్తామని స్పష్టం చేశారు. సవరించిన జీవోను రేపు విడుదల చేస్తామన్నారు. 

అన్ని పురపాలికల్లో వైకుఠంధామాలు

రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా పట్టణ ప్రకృతి వనాలు ప్రారంభించామని కేటీఆర్‌ చెప్పారు. అన్ని పురపాలికల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద ఎకో అర్బన్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 2014 తర్వాత ఖమ్మం ఎలా మారిందో ప్రజలకు తెలుసన్నారు. లక్కారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశామని.. భద్రకాళి ట్యాంకును అభివృద్ధి చేసిందెవరో ప్రజలకు తెలుసని చెప్పారు. బోధించు, సమీకరించు, పోరాడు అనేవి అంబేడ్కర్‌ నినాదాలని.. ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని కేటీఆర్‌ గుర్తు చేశారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో అంబేడ్కర్‌ను ఓడించింది ఎవరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఉద్దేశించి ప్రశ్నించారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ ఏనాడూ పట్టించుకోలేదు..గౌరవించలేదన్నారు. ఆయన్ను ఓడించి పార్లమెంట్‌కు రాకుండా చేసింది కాంగ్రెస్సేనని కేటీఆర్‌ ఆరోపించారు. ఇప్పటికే బోరబండలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని.. త్వరలో ట్యాంక్‌బండ్‌ వద్ద 125 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్‌ విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని