Siddaramaiah: ప్రభుత్వం కూలిపోతుందన్న హెచ్‌డీ.. సీఎం స్పందన ఇదే..!

కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోతుందంటూ జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్య తీవ్రంగా స్పందించారు.

Published : 12 Dec 2023 02:25 IST

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి (HD kumaraswami) చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రంగా స్పందించారు. భాజపా, జేడీఎస్‌ పార్టీలు భ్రమలో బతుకుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని, ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకే కుమారస్వామి ఇలాంటి అసత్యాలు మాట్లాడుతున్నారని అన్నారు. కేవలం ఆత్మ సంతృప్తి కోసమే వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప.. అందులో వాస్తవం లేదని చెప్పారు.

భాజపా, జేడీఎస్‌ల పరిస్థితి ఒడ్డున పడిన చేపలా తయారైందని, అధికారం కోల్పోవడంతో ఏం చేయాలో తెలియక గిలగిలా కొట్టుకుంటున్నారని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కూలిపోతుందని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కుమారస్వామి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని, సిద్దరామయ్య కేబినెట్‌లోని ఓ మంత్రి  భాజపాలో చేరబోతున్నారని మీడియాకు చెప్పారు. మరో 50-60 మంది ఎమ్మెల్యేలు కమలం గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నిజాయితీ కోల్పోయిందని అందువల్ల ఏ క్షణంలోనైనా  ఏదైనా జరగొచ్చని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. రాష్ట్ర రాజకీయాలపై గతవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం సిద్దరామయ్య బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వెనకబడిన వర్గాల వారికి నిధుల కేటాయింపును పెంచుతూ సిద్దరామయ్య నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు కర్ణాటకలో భాజపా, జేడీఎస్‌ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  మొత్తం 224 స్థానాలకు గానూ హస్తం పార్టీ 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక భాజపా 66 స్థానాలతో రెండో స్థానానికి పరిమితం కాగా.. జేడీఎస్‌ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని