Lok Sabha Polls: ఆ రెండు పార్టీలూ ఏకమైనా.. 20 సీట్లలో మేమే గెలుస్తాం: సిద్ధరామయ్య

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో  రాష్ట్రంలో కాంగ్రెస్‌ 15 నుంచి 20 సీట్లు గెలుచుకుంటుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.

Published : 25 Jul 2023 18:04 IST

హుబ్బళ్లి:  వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా(BJP), జేడీఎస్‌(JDS)లు ఏకమవుతాయా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) స్పందించారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేసినా, చేయకపోయినా 15 నుంచి 20 సీట్లలో గెలుపు కాంగ్రెస్‌దేనని విశ్వాసం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన హుబ్బళ్లిలో మాట్లాడారు. ‘‘ఆ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఐక్యంగా పోటీ చేస్తారో లేదో నాకు తెలియదు. వాళ్లు కలిసినా మాకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఒకవేళ వారు కలిసినా, కలవకపోయినా సరే మేం మాత్రం 15 నుంచి 20 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటాం’’ అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం భాజపాతో కలిసి పని చేస్తామని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి జులై 21న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024)కు ముందే భాజపా, జేడీఎస్‌ చర్చలు జరగడంతో.. పొత్తు ఖాయమేనంటూ గత కొంత కాలంగా వచ్చిన వార్తలకు ఆయన ప్రకటన బలం చేకూర్చినట్టయింది. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ తాజాగా కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు వచ్చినా సరే ఒంటరిగానే బరిలో దిగుతామని తేల్చి చెప్పడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 సీట్లకు గాను భాజపా 25 సీట్లు గెలుచుకొని క్లీన్‌స్వీప్‌ చేయగా.. కాంగ్రెస్‌, జేడీఎస్‌, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసీటుకు పరిమితమయ్యారు. అయితే, ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లకు గాను కాంగ్రెస్‌ 135 సీట్లు గెలుచుకొని భారీ విజయం సాధించగా.. భాజపా 66, జేడీఎస్‌ 19 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని