RK Roja: భువనేశ్వరిది బస్సు యాత్ర కాదు.. ఫ్యాషన్‌ షో: మంత్రి రోజా

నిజం గెలిస్తే జీవితకాలం చంద్రబాబునాయుడు జైల్లోనే ఉంటారని, ఆయనతోపాటు లోకేశ్‌, భువనేశ్వరి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని మంత్రి రోజా విమర్శించారు.

Updated : 25 Oct 2023 08:41 IST

తిరుమల, న్యూస్‌టుడే: నిజం గెలిస్తే జీవితకాలం చంద్రబాబునాయుడు జైల్లోనే ఉంటారని, ఆయనతోపాటు లోకేశ్‌, భువనేశ్వరి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని మంత్రి రోజా విమర్శించారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆమె శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘భువనేశ్వరి నిజం గెలవాలని గట్టిగా శ్రీవారి వద్ద పూజలు చేసినట్లున్నారు. మేము కూడా నిజం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజంగా భువనేశ్వరికి నిజం గెలవాలని ఉంటే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుపై సీబీఐ విచారణ కోరాలి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ను చూస్తే పాడుతా తీయగా సెలక్షన్‌కు ఇటు ఒక బ్యాచ్‌, అటు ఒక బ్యాచ్‌ కూర్చుని సెలక్ట్‌ చేసినట్లు ఉంది. అర సున్నా, అర సున్నా కూర్చుని లోపల ఉన్న గుండు సున్నా కోసం పార్టీ దిశానిర్దేశం చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. యువగళం చేయలేక లోకేశ్‌ మంగళం పాడితే.. ఫ్యాషన్‌ షోకు వెళ్లే మాదిరిగా భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తున్నారు’ అని మంత్రి రోజా పేర్కొన్నారు.

రాజకీయ విమర్శకులకు వేదికగా తిరుమల: తిరుమల క్షేత్రంలో కొందరు నాయకులు చేస్తున్న రాజకీయ విమర్శలు శ్రుతి మించుతున్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చిన వారు ఆలయ పవిత్రతను పట్టించుకోకుండా, తమ రాజకీయ ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారు. దీనిపై ఇటీవల డయల్‌ యువర్‌ ఈవోలో భక్తులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తితిదే అధికారులు సంయమనం పాటించాలని రాజకీయ నాయకులకు సూచించారు. అయినా వారిలో మార్పు రావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని