ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నిక రద్దు

భారాస ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ చెల్లవని పేర్కొంది.

Published : 04 May 2024 08:00 IST

తాజాగా ఎన్నిక నిర్వహించాలి
పిటిషనర్‌కు రూ.50 వేలు చెల్లించాలి
తీర్పు వెలువరించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ చెల్లవని పేర్కొంది. ఎన్నికను తాజాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్‌ పతిరెడ్డి రాజేశ్వరెడ్డికి రూ.50 వేలు చెల్లించాలని విఠల్‌ను ఆదేశించింది. అప్పీలుకు వెళ్తామని ఆయన న్యాయవాది అభ్యర్థించడంతో తీర్పు అమలును 4 వారాలపాటు నిలిపివేసింది. 2021 నవంబరు 9న ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. 23న రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. 26న ప్రకటించిన తుది జాబితాలో ఆయన పేరు లేదు. దస్తూరాబాద్‌ ఎంపీపీ కిషన్‌ సింగారి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్‌ను ఉపసంహరించారు. భారాస నేతల బలవంతంతో ఆయన ఈ పని చేశారని, దానికి రిటర్నింగ్‌ అధికారి సహకరించారని, ఎన్నికను రద్దు చేయాలని రాజేశ్వర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విఠల్‌తో కుమ్మక్కైన కిషన్‌.. ఫోర్జరీ సంతకం చేసి రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించినట్లు తేలిందని న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ‘‘నామినేషన్‌ సందర్భంగా ఆయన చేసిన సంతకం, ఉపసంహరణ పత్రంలో సంతకం ఒకటి కాదని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ నివేదిక ఇవ్వడంతో అది ఫోర్జరీ అని తేలింది. రాజేశ్వర్‌రెడ్డి తరఫున నామినేషన్‌ ఉపసంహరణ నిమిత్తం కిషన్‌ ఇచ్చిన ఫారంను రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరించుకోకుండా ఆమోదించారు. దానివల్ల ఆయనకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. ఉపసంహరణను ఆమోదిస్తూ ఎన్నికల అధికారి తీసుకున్న చర్య చట్టవిరుద్ధం’’ అని న్యాయమూర్తి తన 71 పేజీల తీర్పులో పేర్కొన్నారు.

ఇది పారదర్శక ఎన్నిక కాదు

‘‘ఇది పారదర్శకమైన ఎన్నిక కాదు. విఠల్‌, కిషన్‌ కుమ్మక్కయ్యారు. అయితే రిటర్నింగ్‌ అధికారి వారితో కుమ్మక్కయ్యారనడానికి పిటిషనర్‌ ఆధారాలు సమర్పించలేదు. నిబంధనలు పాటించనందున ఆ ఎన్నిక చెల్లదు. పిటిషనర్‌ రాజేశ్వర్‌రెడ్డి పోటీలో లేకపోవడం వల్ల ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రకటించాలని ఆదేశించలేం. అందువల్ల ఎన్నికను తాజాగా నిర్వహించాలి’’ అని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ తీర్పు వెలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని